విశ్వాసపు సహనం
దాదాపు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిస బ్రతుకులకు ఒక్కసారిగా విడుదల దొరికేసరికి ఆరు లక్షల ఇశ్రాయేలీయుల కాల్బలం కనానువైపు ప్రయాణం మొదలయ్యింది. సాఫీగా ప్రయాణం సాగిపోతుంది అనుకునేలోపే ముందు ముంచెత్తే ఎర్ర సముద్రం వెనక మష్టుపెట్ట జూసే ఫారో సైన్యం. మరణం ఇరువైపులా దాడిచేస్తుంటే ఆరిన నేలను దర్శించి నడిచిపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది కదా. ఆరిన నేలను నడవాలంటే విశ్వాసపు సాహసం కావాలి. అప్పుడే, సముద్రం వంటి సమస్యలను కుడా దేవునితో నేను అధిగమించగలననే ధైర్యం కలుగుజేస్తుంది.
యేసు క్రీస్తు తన శిష్యుల విశ్వాసాన్ని బలపరచడం కోసం తాను ప్రయాణిస్తున్న దోనెను బలమైన ఈదురుగాలుల తాకిడికని ఎదుర్కొనిచ్చాడు. శిష్యులు, సముద్ర ప్రయాణంలో అనుభవజ్ఞులైనప్పటికీ, మునుపెన్నడూ చూడని తుఫాను వారిలో భయాన్ని రేకెత్తించింది. అదే దోనెలో నిద్రించుచున్న యేసయ్యను నిద్ర లేపి “బోధకుడా, మేము నశించిపోవు చున్నాము; నీకు చింతలేదా?” అంటూ భయముతో అడిగినప్పుడు. ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండు మని సముద్ర ముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళ మాయెను. నేను చేయగలనని మీరింకా నమ్మలేకపోతున్నారా?” (మార్కు 4:36-41) అని శిష్యులను ప్రశ్నించినప్పుడు వారు మిక్కిలి భయపడి “ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడు చున్నవని యొకనితో ఒకడు చెప్పుకొన” (మార్కు 4:41) మొదలుపెట్టారు.
శ్రమ, కష్టం మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు అనే మాటకు ఈ సంఘటనలు వినూత్నమైన అనుభవాలకు ఉదాహరణలు. దేవుని బలం మరియు శక్తిని మనకు తెలియజేయడానికి మరియు మనం అనుభవించి తెలుసుకోడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఈ అనుభవం కేవలం ఆయనతో సాన్నిహిత్యం కలిగినవారికే సాధ్యం అని గ్రహించాలి. కొన్ని సార్లు దేవుని కృప వంటి రక్షణ వలయంలో జీవిస్తున్నప్పుడు జీవితం ఆనందమయం అనిపించవచ్చు. జీవితంలో కొన్ని అనుకోని సంఘటలు, సముద్రం వంటి శ్రమలు, ఈదురు గాలుల వంటి కష్టాలను దేవుడు అనుమతించినప్పుడు వాటిని ఎదుర్కోవాలంటే విశ్వాసపు సహనం కావాలి. ధైర్యము కలిగి వాటిని ఎదుర్కొనే సాహసం చేయాలి. ఆమెన్.
Audio: https://youtu.be/5oF-jN4QM1k