కయీను హేబేలు


  • Author:
  • Category: Articles
  • Reference: Sajeeva Vahini

సృష్ఠిలో మొదటి సహోదరులు కయీను, హేబేలు. వారు సమర్పించిన కృతజ్ఞతార్పణలలో ఏంతో వ్యత్యాసముంది.

కయీను భూమిని సేద్యపరచువాడు. అతడు కొంతకాలమైన తరువాత పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను.

హేబేలు గొఱ్ఱెలకాపరి, తన మందలో తోలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని కృతజ్ఞతార్పణగా తెచ్చెను.

ఇద్దరు సమర్పించినవి కృతజ్ఞతార్పణలే గాని దేవుడు హేబేలు అర్పణను అంగీకరించి కయీను అర్పణను తిరస్కరించాడు.

అసలు కారణం ఏమిటంటే?

1) కయీను మొదటిగా తన హృదయాన్ని దేవునికి సమర్పించుకోలేదు; అందుకే దేవుడు అతని అర్పణను అంగీకరించలేదు. హేబేలు మొదటిగా తన హృదయాన్ని దేవునికి సమర్పించుకొన్నాడు గనుకనే దేవుడతని అర్పణను అంగీకరించాడు.

2) కయీను సమరించిన అర్పణ ఆచారమును సూచిస్తూ ఉన్నాడు కనుకనే తిరస్కరించబడినది. హేబేలు సమర్పించిన సమర్పణ విశ్వాసముతో కూడు కొన్నది. ఎందుకనగా అతడు తన మందలో తోలు చూలు పుట్టిన వాటిని దేవునికి సమర్పించాడు. అందుకే అతని అర్పణ అంగీకరించబడింది.

3) కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పించాడే గాని పంటలో శ్రేష్ఠమైన వాటిని అర్పించలేదు అందుకే దేవుడు అతని అర్పణను తిరస్కరించాడు. హేబేలు అయితే తోలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని అనగా శ్రేష్ఠమైన వాటిని అర్పించాడు. అందుకే అతని అర్పణను దేవుడు అంగీకరించాడు.

హేబెలును గూర్చి దేవుడిచ్చిన సాక్ష్యం హెబ్రీ 11:4 లో చెప్పబడినరీతిగా అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతిమంతుడని, విశ్వాసముతో అర్పించిన అర్పణలను దేవుడు అంగీకరిస్తాడనియు, అర్పించిన వారు నీతిమంతులుగా తీర్చబడుతారు అనియు, అనేక విధములుగా దీవించబడుతూ పరలోక రాజ్యమునకు వారసులవుతారనియు తెలిసికొనుచున్నాము.

ప్రతీ పరిశుధ్ధ దినం దేవుని సన్నిధికి వెళ్తున్న మనం, విరిగి నలిగిన మన హృదయాలను సమర్పిస్తూ...దేవునిచే అంగీకరించదగిన శ్రేష్ఠమైన అర్పణలను ఇవ్వగలుగుతున్నామా?