నీళ్ళు మోసే ఒక వ్యక్తి వద్ద రెండు పెద్ద కుండలు ఉన్నాయి. కావిడి చెరివైపుల ఒక్కొక్కటి వేసుకొని మెడపై మోస్తున్నాడు. కుండలలో ఒక దానిలో పగుళ్లు ఉండగా, మరొకటి మంచిగా ఉండి ఎప్పుడూ నీటితో నిండుగా ఉండేది.
నది నుండి కుండలను మోసుకుంటూ అతను ఇంటికి వచ్చే సరికి పగిలిన కుండ సగం మాత్రమే నీటితో నిండి ఉండేది. ఇలా ప్రతిరోజూ ఆ వ్యక్తి ఒకటిన్నర కుండలతో ఇంటికి నీటిని చేరవేయడం రెండేళ్లపాటు సాగింది. ఎప్పుడూ నీళ్ళతో నిండుగా ఉండే కుండ అది తయారు చేయబడినదానికి కలిగిన సాఫల్యతకి గర్వపడింది. కాని పేలవమైన పనితీరుతో పగుళ్లు కలిగిన కుండ దాని అసంపూర్ణతకు సిగ్గుపడింది.
పగుళ్ళతో ఉండి చేదు అనుభవాన్ని, ఘోరమైన వైఫల్యాన్ని గ్రహించిన రెండు సంవత్సరాల తరువాత ఓటి కుండ ఒక రోజు నదివద్ద నీరు మోసేవానితో "నేను సిగ్గుపడుతున్నాను, మీకు క్షమాపణ చెబుతున్నాను, నా పనిని సగం మాత్రమే చేయగలిగాను, ఎందుకంటే నాలో ఉన్న ఈ పగుళ్లు దారంతా కారుతూ ఇంటికి వచ్చేలోగా నీరు బయటకు పోయేలా చేస్తున్నాయి. నా లోపాల కారణంగా, మీ పని సగం మాత్రమే జరుగుతుంది. మీ ప్రయత్నానికి పూర్తి విలువ లభించట్లేదు" అని అంది.
అప్పుడతడు కుండతో “మనం నడిచే దారిలో నీ వైపు మాత్రమే పువ్వులు ఉన్నాయని గమనించావా? ఇంకొక కుండ వైపు లేవు. నీ లోపం నాకు తెలుసు దాన్ని సద్వినియోగం చేసుకున్నాను. నేను నీ దారిలో పూల విత్తనాలను నాటాను. ప్రతి రోజు నది నుండి వచ్చేటప్పుడు నీవు వాటికి నీరుపోసావు. అందమైన పువ్వులు పూసాయి. రెండు సంవత్సరాలుగా నేను నా యజమాని బల్ల అలంకరించడానికి ఈ అందమైన పువ్వులను ఉపయోగించాను. నీవు నీలా ఉండకపోతే, నా యజమాని ఇంటికి ఇంత శోభ చేకూరి ఉండేది కాదు. "
నీతి: మనలో ప్రతి ఒక్కరికి వివిధ రకాల లోపాలు ఉన్నాయి. మనమంతా బీటలువారిన కుండలమే. ఈ ప్రపంచంలో వ్యర్ధమైనదేదీ లేదు. ఏదీ వృధా కాదు. మీ జీవితంలోని కొన్ని రంగాలలో మీరు అసమర్ధులు లేదా పనికిరానివారు అని మీరు అనుకోవచ్చు. కాని ఏదో ఒకవిధంగా ఈ లోపాలు ఆశీర్వాదాలుగా మారతాయి.
II కొరింథీ 12:9-10 నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను.