పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను (అపొ.కా. 12:5).
పేతురు మరణం కోసం ఎదురుచూస్తూ చెరసాలలో ఉన్నాడు. అతణ్ణి విడిపించడానికి సంఘానికి మానవపరంగా అధికారంగాని శక్తిగాని లేవు. లోక సంబంధమైన సహాయం లేదు. అయితే పరలోకపు సహాయం ఉంది. సంఘస్తులంతా బహు నిష్టగా తీవ్రమైన ప్రార్థనలో మునిగారు. దేవుడు తన దూతను పంపాడు. అతడు పేతురును నిద్రనుండి లేపి కావలివాళ్ళ మధ్యనుండి బయటికి నడిపించాడు. వాళ్ళు ఇనుపగేటు దగ్గరికి వచ్చేసరికి దానంతట అదే తెరుచుకుంది. పేతురు విముక్తుడయ్యాడు.
నీ జీవితంలో నీ దారికి అడ్డుగా ఏదన్నా ఇనుపగేటు ఉందేమో. పంజరంలో పక్షిలాగా నీ రెక్కలు ఆ ఇనుపకడ్డీలకేసి కొట్టుకుంటున్నాయేమో. నువ్వొక రహస్యం నేర్చుకోవాలి. నమ్మికగల ప్రార్థన. నువ్వు ఇనుప గేటు దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రార్థన ఉంటే ఆ గేటు తనంతట తానే తెరుచుకుంటుంది. ఆనాటి సంఘస్థులు మేడగదిలో ప్రార్థించినట్టు నువ్వు ప్రార్థించగలిగితే నిరుత్సాహానికి, అనవసరమైన బాధలకూ నువ్వు లోనుకాకుండా తప్పించుకోగలవు. దుర్వారమైన ఆటంకాలు మాయమైపోతాయి. నీ స్వంత విశ్వాసంతో కాక దేవుడిచ్చిన విశ్వాసంతో ప్రార్ధించడం నేర్చుకుంటే ప్రతికూల పరిస్థితులు చక్కబడతాయి (మార్కు 11:22). చెరసాలల్లో ఉన్న ఆత్మలెన్నో ఏళ్ళతరబడి గేటు తెరుచుకోవాలని ఎదురుచూస్తున్నాయి. క్రీస్తులోని ప్రియులు, సైతాను బంధకాల్లో ఉన్నవారు, నమ్మికతో కూడిన నీ ప్రార్థనవల్ల విముక్తులౌతారు.
అత్యవసర పరిస్థితుల్లో అత్యాసక్తితో ప్రార్థించాలి. మనిషి మొత్తంగా ప్రార్థనగా రూపొందాలి. కర్మెలుపై ఏలీయా నేలమట్టుకు వంగి తన మోకాళ్ళమధ్య తలను పెట్టుకుని ప్రార్ధించాడు. అదీ ప్రార్థనంటే. మనిషే ప్రార్థనగా మారాడు. వ్యక్తిత్వమంతా దేవునితో లీనమైంది. మాటలేవీ ఉచ్ఛరించలేదు. మాటల్లో ఇమడనంత ఆవేదనా పూరితంగా ఉంటుంది ప్రార్థన ఒక్కోసారి. దేవునితో ఐక్యమై దుష్టశక్తులకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. ఇలాటి ప్రార్థనకి తిరుగులేదు. ఇలాటి ప్రార్ధన ఎంతో అవసరం.
ఉచ్ఛరింపశక్యంగాని మూలుగులు దేవుడు నిరాకరింపశక్యం గాని ప్రార్థనలు.