ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని (ఫిలిప్పీ 3:7).
అంధ ప్రసంగీకుడు జార్జి మాథ్సస్ గారిని సమాధి చేసినప్పుడు ఆ సమాధి చుట్టూ ఎర్ర గులాబీలను నాటారు. ప్రేమ, త్యాగాలతో నిండిన ఆయన జీవితానికి అవి చిహ్నాలు. ఈ ధన్యుడైన భక్తుడే ఈ క్రింది గీతాన్ని రచించాడు.
నన్ను కట్టి పడేసిన ప్రేమా,
నీలోనే నాకు విశ్రాంతి
నువ్విచ్చిన బ్రతుకు ఇదుగో నీదే
నీ కరుణాసంద్రంలో కలిసి
నా జీవనధార ధన్యమవుతుంది
నన్నెప్పుడూ వెంబడించే కాంతీ,
కొడిగట్టిన ఈ దీపాన్ని నీలో కలుపుకో
నా హృదయపు మసక రేఖలు
నీ సూర్యకాంతిలో లీనమై
ప్రకాశమానమై వెలుగనీ
బాధలో తోడుండే ఆనందమా,
నా హృదయపు తలుపులు తెరిచాను
కురిసే వానలో ఇంద్రధనుస్సును వెదికాను
వాగ్దానాలు ఎన్నడూ భంగం కావు
తెల్లవారితే ఇక కన్నీళ్ళుండవు
అతిశయాస్పదమైన నా ప్రభువు సిలువా
నిన్ను వదిలించుకునే సాహసం చెయ్యనెప్పుడూ
జీవం మన్నె నేను సమాధైపోతే
నేలలోనుంచి ఎర్రగులాబీలు పూస్తాయి
నాలోని జీవాత్మ నిత్యం జీవిస్తుంది.
ఒక కథ ఉంది. ఒక చిత్రకారుడు తాను గీసే బొమ్మలో ఒక విలక్షణమైన ఎరుపురంగును వాడుతుండేవాడట. అలాటి ఎరుపురంగును ఎవరూ ఉపయోగించేవారు కాదట. అతడు ఆ ఎరుపురంగును ఎలా తయారుచేశాడో, ఆ రహస్యం ఎవరికీ తెలియకుండానే చనిపోయాడట. అతడు చనిపోయిన తరువాత అతని శవాన్ని పరీక్షిస్తే అతని రొమ్ముమీద ఎప్పటినుంచో మానకుండా ఉన్న గాయం కనిపించిందట. అతడు గీసే బొమ్మల్లో ఉపయోగించే ఎరుపురంగు ఎక్కడిదో అప్పుడు అర్థమైంది అందరికీ. హృదయ రుధిరాన్ని ఖర్చు పెట్టకుండా ఏ ఘనకార్యమూ సాధించలేము, ఏ యోగ్యమైన గమ్యాన్నీ చేరలేము.