Day 7 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

నేనేస్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను (ఫిలిప్పీ 4:11).

తాను బందీగా ఉన్న చీకటి కొట్టులో ఉండి, సౌకర్యాలేమీ లేని స్థితిలో పౌలు ఈ మాటలు రాసాడు. ఒక రాజుగారు ఒక రోజున తన తోటలోనికి వెళ్లి చూసేసరికి మొక్కలు, చెట్లు అన్నీ వాడిపోయే ఎండిపోతూ ఉన్నాయట. గేటు దగ్గర నిలిచియున్న మర్రిచెట్టును రాజుగారు అడిగారట. ఎందుకిలా అయిపోయావు అని. కొబ్బరిచెట్టు కంటే నేను పొడుగ్గా లేను కాబట్టి నాకు జీవితం మీద విరక్తి పుట్టింది అని చెప్పిందట ఆ వృక్షం. కొబ్బరిచెట్టేమో తనకి ద్రాక్షపళ్ళు కాయలేదని ఆత్మహత్యకి సిద్ధపడి ఉంది. ద్రాక్షతీగెమో నిటారుగా నిలబడలేనే అని దిగులుతో కృశించిపోతున్నది. బంతి మొక్కేమో తన పూలకి సంపంగిలా వాసన లేదని నిరాహారదీక్షలో ఉంది. చివరికి ఒకచోట సన్నజాజి తీగె మాత్రం నిండుగా, పచ్చగా కనువిందుగా కనిపించింది. రాజుగారన్నారు, ""సన్నజాజీ, కనీసం నువ్వన్నా పచ్చగా కళకళలాడుతూ ఉన్నావు. ఈ తోటంతా నిస్పృహ చెందిన మొక్కలే కనిపించాయి. నువ్వు చిన్నదానివైనా ధైర్యంగా ఉన్నావు, సంతోషం.""

అప్పుడు సన్నజాజి అందట ""రాజా, మిగతా మొక్కలన్నీ తాము మరెవరిలాగానో లేమే అని బాధపడుతున్నారు. అయితే నీకు మరి చెట్టు కావాలనే మర్రిమొక్క నాటావు. ద్రాక్ష కావాలనే ద్రాక్ష తీగె నాటావు. సన్నజాజి కావాలనుకున్నావు కాబట్టి నన్ను నాటావు. అందుచేత నేను సన్నజాజిగానే ఉంటాను. మరెవరిలాగానో లేననే నిరుత్సాహం నాకెందుకు?""

కొంతమంది చేస్తారేన్నైనా మహత్తులు
పంతమెందుకు నీ పని నీదే
సృష్టి అంతటిలోకి ఎవరూ
నీ అంత బాగా ఆ పని చేయలేరు

పూర్తిగా దేవునికి చెందినవాళ్లు ఎలాంటి పరిస్థితిలోనైనా సంతృప్తిగానే ఉంటారు. ఎందుకంటే దేవుని చిత్తము వాళ్ళ చిత్తము. ఆయన ఏం చెయ్యాలని కోరుతాడో అదే ఆయనకోసం చెయ్యాలని వాళ్లు కోరుకుంటారు. తమకున్న ప్రతిదాన్ని వాళ్లు వదిలేసుకున్నారు. అలాటి నగ్నత్వంలో అన్ని వస్తువులు తమకి నూరంతలుగా తిరిగి సమకూరడం వాళ్లు చూస్తారు.