ఓపికతో పరుగెత్తుదము (హెబ్రీ 12:1-2).
ఓపికగా పరుగెత్తడం చాలా కష్టమైన పని. అసలు పరుగెత్తడం అంటేనే ఓపిక లేకపోవడాన్ని సూచిస్తున్నది. ఒక గమ్యాన్ని చేరాలన్న ఆతృతతోనే పరుగెత్తడం అనేది జరుగుతుంది. ఓపిక అనగానే మనకు ఒకచోట నిలకడగా కూర్చోవడం కళ్ళల్లో మెదులుతుంది. మంచం పట్టినవాళ్ళ దగ్గర కూర్చుని ఉండే దృశ్యం జ్ఞాపకం వస్తుంది. అయితే మంచం పట్టినవాళ్ళకు ఓపిక ఉండడం తేలికైన విషయమే.
కష్టమైన పని ఏమిటంటే పరుగెత్తే ఓపిక. విచాగం అలుముకున్నప్పుడు ఒకచోట కూర్చోవడం,దురదృష్టం సంభవించినప్పుడు మెదలకుండా ఉండడంలో గొప్ప శక్తి ఉన్నమాట నిజమే కాని, అలాటి ఆపద సంభవించినప్పుడు మామూలుగా పని చేసుకుంటూపోవడంలో ఇంకా గొప్ప శక్తి ఉంది. నీ హృదయంలో ఒక భారం ఉంది. అయినా పరుగెత్తుతూనే ఉన్నావు. నీ ఆత్మ మూలుగుతూ ఉంది. అయినా నీ దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూ పోతూనే ఉన్నావు. ఇదే నిజమైన క్రైస్తవ లక్షణం.
మనలో చాలామందికి ఎక్కడో ఏకాంతంలో మన విచారాన్ని అనుభవించే అవకాశం ఉండదు. ఎప్పటిలాగా పనులు చేసుకుంటూనే ఆ విచారాన్ని అనుభవించాల్సి ఉంటుంది. మన చింతను సావకాశంగా విశ్రాంతిలో దాచిపెట్టడం కాదు. చురుకుగా కొనసాగించే దైనందిన కార్యక్రమాల్లో పూడ్చి పెట్టవలసి వస్తుంది. ఒక్కోసారి అందరితో కలసి పనిచేస్తూ వారి ఆనందాన్ని పంచుకుంటూ మనలోని విచారాన్ని అనుభవించవలసి వస్తుంది. విచారాన్ని ఈ విధంగా పాతిపెట్టడం చాలా కష్టం. ఓపికతో పరుగెత్తడం దుస్సాధ్యం.
"మనుష్య కుమారుడా, ఇదే నువ్వు చూపిన సహనం. ఓపిక కలిగి ఉంటూనే పరుగెత్తడం. ఒక గమ్యంకోసం ఎదురుచూస్తూ ఈ లోపల అవసరమైన పనుల్ని చేసుకుంటూ పోవడం. పెళ్ళివిందు పాడైపోకూడదని కానాలో నీళ్ళను ద్రాక్షారసంగా మార్చావు. తాత్కాలికమైన ఆకలిని తీర్చడానికి అరణ్యంలో గొప్ప జనసమూహానికి ఆహారం పెట్టావు. అయితే ఈ సమయమంతా గుండెల్లో గొప్ప బరువు మోస్తూనే ఉన్నావు. ఎవరూ దాన్ని పంచుకోలేదు. ఎవరితోనూ దాన్ని చెప్పుకోలేదు. మనుషులు ఆకాశంలో ఇంద్రధనుస్సును చూపించమని నిన్ను అడిగారు. అయితే అంతకంటే ఎక్కువ ధన్యతనే నేను అడుగుతున్నాను. నీ మేఘంలో నన్ను ఇంద్రధనుస్సుగా చెయ్యి. ఇతరులకు సంతోషకారణంగా నన్ను చెయ్యి. నీ ద్రాక్షతోటలో పనిచేస్తే నా సహనం పరిపక్వమౌతుంది."
ఆశలన్నీ సమసినప్పుడు
ఇతరులకోసం మన చేతులు
పని చేస్తూనే ఉంటే మంచిది
భరించడానికి శక్తి
పూరించిన బాధ్యతలోనే ఉంది
ఇతరులకి పంచి ఇచ్చిన ఆనందమే
నీ హృదయ బాధకు ఔషధం