Day 284 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

చనిపోవుచున్నవారమైనట్లుండియు ఇదిగో బ్రదుకుచున్నవారము (2 కొరింథీ 6: 8-10).

పోయిన సంవత్సరం మా తోటలో బంతి మొక్కలు వేశాము. ఆ మొక్కలు మా తోట హద్దులు దాటి బయటకు మొలిచాయి. వాటన్నిటికీ పూలు పూసినప్పుడు ఎంత బావుందో! ఆలస్యంగా వాటిని నాటాం. కొన్ని పూలు ఇంకా కళకళలాడుతూ ఉంటే కొన్ని పూలు అప్పుడే వాడిపోయి ఎండిపోవడం మొదలుబెట్టాయి. మంచు కురపడం ప్రారంభమైంది. ఆ మొక్కలన్నీ నాశనమైపోయాయి. నేననుకున్నాను "బంతిపూల కాలం అయిపోయింది. ఇవన్నీ ఇక కనిపించవు" వాటికి వీడ్కోలు చెప్పేశాను.

ఒకప్పుడు కళకళలాడుతూ ఉండి, ఇప్పుడు వెలవెలబోతున్న ఆ మొక్కలున్న ప్రదేశం వైపుకు వెళ్ళడం మానేశాను. కానీ కొన్నాళ్ళు గడిచిన తరువాత ఆ మొక్కలున్న ప్రదేశం అంచుల్లో లెక్కలేనన్ని బంతి మొక్కలు మొలుస్తున్నాయని మా తోటమాలి చెప్పాడు. నేను వెళ్ళి చూశాను. చలికాలంలో నాశనం అయిపోయిందనుకున్న ప్రతి మొక్కా ఏభై పిల్ల మొక్కల్ని మొలిపించింది. కురిసిన మంచూ, చలిగాలులూ ఏమి చేశాయి?

అవి పువ్వుల్ని వాడగొట్టి నేల రాలిపోయేలా చేశాయి. తమ మంచు పాదాలతో వాటిని నేలలోకి అణగదొక్కాయి. "ఇక మీరు తలెత్తలేరు" అనుకుంటూ వెళ్ళిపోయాయి. అయితే ఆ మంచు విడిపోగానే ప్రతి మొక్కకీ అనేకమైన పిల్లమొక్కలు సాక్షులుగా లేచి "మరణం ద్వారా మేము బ్రతుకుతున్నాము" అన్నాయి.

దేవుని రాజ్యంలో కూడా ఇంతే. మరణం మూలంగా నిత్యజీవం వస్తుంది. సిలువ శ్రమలు, సమాధి మూలంగా సింహాసనం, నిత్యమైన పరలోకపు మహిమ వచ్చాయి. ఓటమి వల్ల విజయం కలిగింది.

శ్రమలకు భయపడకండి, ఓటమికి బెదిరిపోకండి.

మనం కూలిపోయినా నాశనమైపోము. ఇలాటి అనుభవాల వల్లనే మనుషులు బలవంతులౌతారు. అయితే కనిపించే విషయాలకు లొంగిపోయి లోకం వెంట వెళ్లేవాళ్ళు వెంటనే వికసించి క్షణమాత్రం వైభవంతో కనబడతారు. గాని వాళ్ళ అంతం వచ్చినప్పుడు అది శాశ్వతంగా ఉంటుంది.

నీ జీవితాన్ని నష్టాల్లో గణించు లాభాల్తో కాదు
ఎంత త్రాగామని కాదు ఎంత ఒలకబోశామని
ప్రేమబలం త్యాగం మీదే నిలబడుతుంది
ఎక్కువ బాధలు పడ్డవాడే మరెక్కున ఇవ్వగలడు.