నా ఉద్యానవనముమీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి (పరమ 4:16).
ఆ అధ్యాయంలో కనిపించే సుగంధ ద్రవ్యాల వెనుక చాలా అర్థం ఉంది. అగరు అనేది చేదైన పదార్థం. అది చేదైన పదార్థాల్లో ఉండే మాధుర్యాన్ని గురించి చెబుతూ ఉంటుంది. ఈ చేదు తియ్యదనం అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. గోపరసం అనే పదార్థాన్ని చనిపోయిన వాళ్ళను సిద్దపరిచేందుకు వాడతారు. ఇది మరణానికి సూచనగా ఉంది. స్వార్థం, గర్వం, పాపం ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ హృదయంలో నిండే సువాసనకి ఈ గోపరసం సూచనగా ఉంది.
తమ అంతరంగాలపై, వదనాలపై సిలువలోని దీనత్వాన్ని, పవిత్రతను కలిగి ఉండే క్రైస్తవులలో అనిర్వచనీయమైన అందం, ఆనందం ఏదో కదలాడుతూ ఉంటుంది. ఒకప్పుడు వారిలో రాజ్యమేలిన లక్షణమేదో ఇప్పుడు నశించిపోయి వారు క్రీస్తు పాదాలవద్ద ఉన్నారనడానికి ఇది ఒక పరిశుద్ద సాక్ష్యం. విరిగి నలిగిన హృదయాలలో ఉండే ఆకర్షణ, దీనమనస్సులోనుండి వెలువడే నిశ్శబ్ద సంగీతం, విరబూసిన పూరెమ్మపై మంచు బిందువులు నిలిచి దానికి చేకూర్చే వింత శోభ.
పరిమళ తైలం అనే సుగంధ ద్రవ్యం వేడిచేయడం వల్ల తయారవుతుంది. అగ్నిజ్వాలల గుండెల్లో నుండి పైకెగసే సుగంధ మేఘమే ఈ పరిమళ తైలం. ఏ హృదయంలోని మాధుర్యం శ్రమల వేడిమికి ఆవిరై వ్యాపించిందో ఆ హృదయానికి పరిమళ తైలం సూచనగా ఉంది. ఆ సుగంధపు ఆవిరి స్తుతి ప్రార్థనల పొగలుగా పైకి లేస్తుంది. మనం మన హృదయపు పరిమళాన్నీ,సౌరభాన్నీ, మాధుర్యాన్నీ వెలువరిస్తున్నామా?
దేవా, నీలోని సౌరభం నా ద్వారా వ్యాపించేలా నన్ను నీతో కలసి ఉండనీ.
పిట్టకథ ఒకటి పర్షియా ప్రాంతానిది
మట్టిముద్ద కథ వినండి;
ఘుమఘుమలాడుతూ ఆ ప్రాంతమంతా
పరీమళాలు నింపుతూ, పరవశింపజేస్తూ
కనిపించింది ఓ ప్రయాణికుడికి
"ఎవరు నీవు? మేలి ముసుగులో ఉన్న
అత్తరు పన్నీరువా సామర్కండు సంపెంగ నూనెవా?"
"కాదు, కాదంది" ఆ మట్టిముద్ద
మట్టిముద్దను మాత్రమే నేనంది
"విరిసిన ఈ సుగంధం మరి నీకెక్కడిది?"
"విప్పి చెబుతా వినండి ఈ వింత రహస్యం
విరబూసిన గులాబీతో చేశాను స్నేహం"
చిత్రం ఈ చిన్న కథ.
షారోను గులాబీతో కలిసి ఉండేవారు
వారెంత సామాన్యులైనా
పరిమళాలు విరజిమ్ముతుంటారు
ప్రభూ, నేను నీనుండి సువాసనలు
సంగ్రహించి వేదజల్లేలా
సదా నీతో సన్నిహితంగా ఉండనియ్యి.