ఎస్తేరు గ్రంథం


  • Author: Praveen Kumar G
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini Jun - Jul 2011 Vol 1 - Issue 5

అధ్యాయాలు : 10, వచనములు : 167

గ్రంథకర్త : మొర్దెకైగా (9:29) (రచనా శైలిని తీసికొని ఈ పుస్తకమును ఎజ్రాయో, నెహెమ్యాయో వ్రాసి యుండవచ్చు) రచించిన తేది : దాదాపు 133 సం. క్రీ.పూ

మూల వాక్యాలు : 4:14 “నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కునుండి వచ్చును గాని, నీవును నీ తండ్రి యింటివారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను”.

రచించిన ఉద్ధేశం: దేవుని సార్వభౌమాధికారాన్ని తెలియజేసి తన ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, సంరక్షణ ఎంత గొప్పదో, మహా మేధావులను సహితం తన స్వాధీనంలో ఉంచుకొని ఎలాంటి పరిస్థితుల్లోనైనా అవలీలగా మార్చగల దేవుని శక్తి సామర్ధ్యాలను లోకానికి ప్రత్యక్షం చేయడమే ఈ గ్రంథం ముఖ్య ఉద్దేశం. ఈ పుస్తకంలో ఎక్కడ కూడా దేవుడు, ధర్మశాస్త్రము, యెరుషలేము, ప్రార్థన అనే మాటలు కనిపించవు. కాని ప్రతీ సందర్భంలో పరోక్షంగా దేవుని హస్తం, దేవుని ప్రేమ, దేవుని బిడ్డల ప్రార్ధన, దేవుని కాపుదల కనిపిస్తాయి. ప్రత్యేకంగా మన దేశం పేరు ఈ గ్రంధంలోనే హిందూ దేశము అని ప్రాయబడడం విశేషం.

ఉపోద్ఘాతం: స్త్రీల పేర్లలో కనబడు గ్రంథములలో ఇది ఒకటి. ఆదిమ హెబ్రీ బాషలో ఎస్తేర్తు గ్రంథం “మెగిల్లాహ్” అని ప్రాముఖ్యముగా యూదుల పూరీము పండుగ వేడుకల్లో పర్ణశాలలో బిగ్గరగా చదువబడిన గ్రంథం. ప్రపంచ చరిత్రను, తన ప్రజలైన ఇశ్రాయేలీయులను తన హస్తాల్లో ఉంచుకొన్న దేవుడు, కొంత మంది వ్యక్తులను మరుగున ఉంచి, తన స్వంత సమయములో తన మహిమార్ధం పనిచేసేలా వారి హస్తాలను కదిలించాడు. అలాంటి వారిలో ఎస్తేరు ఒకటి. పరిశుధ్ధ గ్రంథంలో నేహేమ్యా తరువాత ఎస్తేరు గ్రంథం వచ్చినప్పటికిని నేహెమ్యా కార్యక్రమ-ములకు 30సం||లకు ముందే ఎస్తేరు కార్యక్రమములు జరిగినవి. ఈ కార్యములు జరిగిన స్థలము పారసీక సామ్రాజ్యము యొక్క రాజధానియైన షూషనులోను, చక్రవర్తి అంతఃపురములో జరిగినవి.

పర్షియా మహా సామ్రాజ్యానికి దర్యావేషు కుమారుడైన అహశ్వేరోషు చక్రవర్తిగా ఉన్నాడు. ఇతని సామ్రాజ్యం హిందూ దేశము నుండి కూషు దేశం వరకు 127 సంస్థానములు. పారసీక, మాదీయ దేశాల పరాక్రమశాలులను, సంస్థానాధి-పతులనందరినీ ఆహ్వానించి దాదాపు ఆరు మాసములు తన రాజ్య ప్రభావైశ్వర్యాలను, మహాత్యాతిశయ ఘనతలను ప్రదర్శిస్తూ వచ్చాడు. ఏడురోజుల విందు తరువాత తన భార్య అయిన వష్తీ రాణి అందాన్ని చూపించాలనుకున్నాడు. కాని అవిధేయురాలైన వష్తీ రాణి యొక్క మొండితనము వల్ల రాజు కోపగించుకొని తనను రాణి పదవి నుండి తొలగించాడు. అంతేగాక ప్రతీ యింటిలోను స్త్రీలు పురుషులకు లోబడాలని దేశమంతటా చాటించాడు. తరువాత యుద్ధములలో ఓడిపోయి నాలుగు సంవత్సరములు గడిచినపిమ్మట ఒకనాడు అనేక మంది కన్యకలలో ఒకతిగా ప్రత్యేకించబడి ఎన్నుకొనబడింది యూదురాలైన “హదస్సా”. హదస్సా అనగా గొంజి చెట్టు. గొంజి చెట్టు అన్ని వృక్ష జాతులలో చిన్నది. గొంజి చెట్టు లాంటి సామాన్య అనాధ బాలికయైన హదస్సను దేవుడు ఎస్తేరు అనగా నక్షత్రంగా మార్చి దుఃఖాంధ-కారంలో మునిగిపోయిన ప్రజలమధ్య ప్రకాశింపజేసాడు.

రాజు దగ్గర ఎంచబడిన స్త్రీలంతా ఉపపత్నులుగా ఎంచబడ్డారు కాని ఎస్తేరు జీవితం పట్ల దేవునికి గల ఉన్నతమైన ఉద్దేశం ప్రకారం అహశ్వేరోషు ఆమె పట్ల ప్రేమను, దయను కలిగించాడు. ఈ విధంగా దేవుని నిర్ణయం చొప్పున ఆమె రాణిగా చేయబడింది. ఆమె గుణ లక్షణాలు అందుకు దోహదపడ్డాయని చెప్పవచ్చు.

ఎస్తేరు చిన్న నాటినుండి సంరక్షకునిగా ఉన్న మొర్దెకైకి సంపూర్ణ విధేయత చూపించింది. దేవుని సహాయం కొరకు చూస్తూ మొర్దెకై సలహా ప్రకారం పని జరిగించేందుకు తన ప్రాణాన్ని సహితం లెక్కచేయలేదు. తరువాత అహశ్వేరోషు రెండవ సంస్థానములో ఉన్న ప్రధాన మంత్రి, అమలేకీయుల హగగు వంశాస్తుడైన హామాను యూదులను నాశనము చేయవలెనని తాకీదులు వ్రాయించు కొనవలెనని పనిన పన్నాగ-మును దేవుడు ఎస్తేరు ద్వారా తన ప్రజలను రక్షిస్తాడు. అధికార దుర్విని-యోగామునకు పాల్పడిన హామాను ఆతని కుటుంబమంతా ఉరితీయించబడ్డారు. తరువాత మొర్దెకై ఆ దేశములో రెండవ మానవుడిగా హెచ్చింపబడ్డాడు. ఆయన యూదుల యొక్క సంరక్షకునిగా మార్చబడడం ఈ గ్రంథం ముగింపులో గమనించగలం.

సారాంశం: మన జీవితాల్లో కొన్ని పర్యాయములు ఎన్నిక లేనివిగా, అల్పమైనవిగా కనిపించవచ్చు. మన జీవితంపట్ల దేవుని ప్రణాళిక ఎట్టిదో, మన ద్వారా ఆయన ఏ సంకల్పమైతే నేరవేర్చుకొనబోతున్నాడో మనకు అర్ధం కాదు. కాని దేవుడు మన జీవితాల్లో అనుమతించిన ప్రతీ పరిస్థితిని సంతోషంగా స్వీకరిస్తే, హదస్సాను ఎస్తేరుగా మార్చిన దేవుడు ఎందుకూ పనికిరాము అని అనుకుంటున్నా మనలను దేవుడు అనేకులకు దీవెనకరంగా చేస్తాడు. కనుక అన్ని విషయాల్లో దేవుని పట్ల విధేయత చూపించే వారముగా నడచుటకు ప్రయత్నిద్దాం.

toilax 5mg bhalsbrand.site toilax spc