యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? (1 యోహాను 5:5).
నీలాకాశం నవ్వుతున్నప్పుడు మలయ మారుతాలు వీస్తున్నప్పుడు
పరిమళసుమాలు పూస్తున్నప్పుడు తేలికే దేవుణ్ణి ప్రేమించడం
పూలు పూసిన లోయలగుండా సూర్యుడు వెలిగించిన కొండలమీద
పాటలు పాడుతూ పరుగులెత్తే వేళ తేలికే ఆయన చిత్తాన్ననుసరించడం
కుండపోతగా వర్షం కురిసేవేళ - పొగమంచు పొరలుగా కమ్మినవేళ
దారిలో అవరోధాలెదురైనవేళ - గాలి విరోధంగా వీచిన వేళ
అరుణోదయాన్ని అంధకారపు రాక్షసి కబళించినవేళ
కష్టం దేవునిపై నమ్మకముంచడం - ఆజ్ఞకి లోబడడం
పాటలు పాడే పిట్టలు గాలిలో పందాలు వేసేవేళ
సన్నుతి గీతాలు మనసులో మనుగడలో సంతోషం నింపేవేళ
తేలికే నమ్మకముంచడం గాని, పాట ఆగిపోతే, కష్టాలతో కాలం స్థంభిస్తే
కావాలి మనకి భయసందేహాలనధిగమించే విశ్వాసం
దేవుడే దీన్ని మనకు దయచేస్తాడు, లోటును భర్తీ చేస్తాడు
ఆయన మాటని నమ్మి, ఆధారపడి అడుగుదాం విశ్వాసంతో
మార్గం కఠినమైనా, సరళమైనా సదా మన నాయకుడాయనే
అనుదిన అవసరాలను అందించే వాడాయనే.
దేవుడు మన చెయ్యి విడిచి పెట్టేస్తాడేమో అనిపించే పరిస్థితుల్లో కూడా నమ్మకం ఉంచడం, మన ఆక్రందనల్ని ఎవరూ వినడం లేదేమో అనిపించినా, మన అరుపులకి కనీసం ప్రతిధ్యని కూడా వినిపించనంత శూన్యం ఆవరించినా విజ్ఞాపనలు చెయ్యడం, ఈ లోకం ఓ యంత్రంలాగా దాని పని అది చేసుకుంటూ పోతూ, కలకాలం ఎవరితో నిమిత్తం లేకుండా కొనసాగుతూ ఉన్నప్పుడు కూడా దేవుడు నిద్రపోవడం లేదు, ఎప్పటి లాగానే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అన్న నిశ్చయతని కలిగి ఉండడం, ఇది కావాలి అని కోరుకోకుండా మనకి ఏది దక్కితే అది దేవుడు మనకిచ్చిందని అనుకోవడం, ఓపికతో ఎదురుచూడడం, విశ్వాసం ఎండిపోతుందేమోనన్న భయం తప్ప ఇక చావుకైనా భయపడకపోవడం ఇదే లోకాన్ని జయించే విశ్వాసం అంటే.