Day 118 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను (న్యాయాధి 3:9,10).

తన యుద్ధశూరుల్ని దేవుడు సంసిద్ధపరుస్తున్నాడు. సరైన తరుణం వచ్చినప్పుడు కనురెప్పపాటులో వాళ్ళ స్థానంలో వాళ్ళని ఉంచుతాడు “ఇతనెక్కడినుంచి వచ్చాడు!" అంటూ ప్రపంచమంతా ముక్కున వేలేసుకుంటుంది.

స్నేహితుడా, పరిశుద్ధాత్మను నిన్ను సిద్దపరచనియ్యి. క్రమశిక్షణ నేర్చుకో. పాలరాతి శిల్పానికి తుది మెరుగులు దిద్దాక దేవుడు దాన్ని ఎత్తి పీఠంమీద ప్రతిష్టిస్తాడు. దాన్నుంచవలసిన స్థానంలో అమరుస్తాడు.

ఒకరోజు వస్తుంది, ఒత్నియేలులాగానే మనం కూడా జాతులకి న్యాయాధి పతులుగా ఉంటాము. వెయ్యేళ్ళపాటు భూమిపై క్రీస్తుతో కూడా అధికారం వహించి రాజ్యమేలుతాము. ఆ రోజును రుచి చూడాలంటే దేవునిద్వారా మనం మలచబడాలి. మన అనుదిన జీవితంలో ఎదురయ్యే శ్రమలు చిన్న చిన్న విజయాలు వీటన్నిటి మూలంగా దేవుడు మనకి శిక్షణ ఇస్తున్నాడు. ఇది మనకి తెలియదు. కాని ఒక్కవిషయం గురించి మాత్రం సందేహం లేదు. పరిశుద్ధాత్మ ఆ అవసరానికి తగినట్టు ఒత్నియేలును సిద్ధంచేసి ఉంచాడు. పరలోకపు రాజైన దేవుడు అతనికి ఓ సింహాసనాన్ని తయారుగా ఉంచాడు.

మానవబలము, మానవ ఘనత
సుఖశాంతుల్లో చిగురించవు
లోకంలో బాధలనెదుర్కోనివారు
శూరులెన్నటికీ కాలేరు

మనిషి జీవిత యాత్రలో ఎప్పుడో ఒకప్పుడు పల్లపు ప్రాంతాల్లో నడవక తప్పదు. ప్రతివాడూ బాధల సొరంగంలోగుండా వెళితేనే తప్ప విజయపు మెట్టు దారికి ఎక్కలేడు.