పోయిన సంపద తిరిగి వచ్చాక యోబు భక్తునికి కలిగినరెండవ కుమార్తె “కేజియా”. ఈ పేరునకు అర్ధం “పరిమళ వాసన”. ఈమె అక్కపేరు “యొమీయా” చెల్లి పేరు “కెరంహప్పుకు” వీరు చాలా అందగత్తెలని బైబిల్ గ్రంథంలో వ్రాయబడియున్నది. ఆ దేశమందంతటను అనగా ఊజు దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. (యోబు 42:15)
అందమైన ముఖాన్ని కలిగియుండి అంధవికారమైన చేష్టలు చేసినట్లయితే సమాజం హర్షించదు. అలాంటి చేష్టలు చేసినట్లయితే ఈ స్త్రీ పేరు మరో విధంగా వ్రాయబడి యుండేదేమో!. కేజియా తన పేరునకు తగినట్లయితే, పరిమళ వాసన కలిగి జీవించియుండవచ్చు. చెక్కర చేదుగా వుంటే దానికాపేరు తగియుండేది కాదు. మల్లెపువ్వు ఉల్లివాసన కలిగియుంటుందా? గులాబీని ఏ పేరుతొ పిలిచినా అది పరిమళాన్ని వెదజల్లడం మానుతుందా అని ప్రశ్నించే వారుండవచ్చు గాని, కేజియా మాత్రం దేవునికీ, లోకానికీ పరిమళ వాసనగా జీవించిందనే విశ్వసించాలి. ఈమెను గూర్చి గ్రంథములో ఎక్కువగా వ్రాయబడలేదు. అయినా ఆమె ప్రవర్తన ద్వారా మాటల ద్వారా సువాసనగల జీవితాన్ని జివించిందని నేటి మహిళలమైన మనమంతా గ్రహించి మనోవాక్కాయకర్మల క్రీస్తు కొరకు మనము కూడా సుగంధాన్ని వెదజల్లాలి.
పరమగీతం 4:10లో గమనించినట్లయితే “నీవు పూసికోనిన పరిమళతైలములవాసన సకల గంధవర్గములకన్నా సంతోషకరము” అని వ్రాయబడింది. 4:11లో గమనించినట్లయితే “నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసనను కలిగియున్నది.” ఈ మాటలు జ్ఞానియైన సొలోమోను తన ప్రియురాలైన షూలమ్మితిని గురించి వ్రాసినవి. వాస్తవముగా ఆమె నల్లనిది అయినా సువాసనలతో కూడిన గంధవర్గాలతో బాహ్యశరీరాన్ని చక్కగా అలంకరించుకొని పరిమళాలను వెదజల్లి రాజు ప్రేమకు పాత్రురాలైంది. దేవుడు తన బిడ్డలను బిక్షమెత్తుకొనువారిగా చేయక యాజకులుగాను, రాజులుగాను చేసి దీవించాడు. కాని, మనము చేయు క్రియలు, మాటలు దేవుని దృష్టికి ఇంపుగా, సొంపుగా వుండాలి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచులాగున వారి యెదుట మీ వెలుగును ప్రకాశింపనియ్యుడి అని బైబిల్ బోధిస్తుంది. అందుకే ప్రభుని కొరకు మన మాటలద్వారా, క్రియలద్వారా పరిమళించాలి. మానవ జీవిత పరిసరాలకనుగు-ణ్యమైనది ఆలోచనలను వెళ్ళబుచ్చడానికి వీలైనది “మాట”. దేవుడు మనిషికిచ్చిన వరాలు. భాష, వాక్కు, హృదయ తలంపులన్నీ నోటి ద్వారా బయలు-పర్చబడతాయి, అందుకే నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లోపలికి వెళ్ళేది అపవిత్రపరచదుగాని, వెలుపలికి వచ్చే మాటలే మనిషిని అపవిత్రపరుస్తాయి. షూలమ్మితి నోరు సువాసనగలదని జ్ఞాని తన గ్రంథంలో వివరించాడు. పరమగీతం 7:9 లో చూచినట్లయితే నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసం అని వ్రాయబడింది. మననోళ్ళు ఎలా ఉన్నవి అని ప్రతివారు ఈ సమయంలో ప్రశ్నించుకోవాలి. దుర్భాషలు, ముసలమ్మ ముచ్చట్లు మాటలాడుతు-న్నామా? వ్యర్ధమైన మాటలలో దోషముంటుంది సుమీ! యాకోబు 3:8- వచనములను చూచినట్లయితే నాలుక మరణకరమైన విషములో నిండినదై ప్రకృతి చక్రానికే చిచ్చుపెడుతుందని భక్తుడు వ్రాశాడు. కాబట్టి మాటల ద్వారా దేవునికి పరిమళ సువాసనగా జీవించాలి. నోరు మంచిదైతే ఊరంతా మంచిదని లోకస్తులు వాడే సామెతను ఈ సందర్భంలో గుర్తుచేసుకోవాలి.
ఇక మనం చేసే ప్రార్ధనల ద్వారా పరిమళాన్ని వెదజల్లాలి. మానవుని మహత్తర సాహసయాత్ర ప్రార్ధన. దేవుడు పరిశుద్ధుల హస్తాల్లో ఉంచిన మహత్తర శక్తి ప్రార్ధన. పార్ధించక నష్టపోయేవారు అనేకులున్నారు గాని ప్రార్థించి నష్టపోయినవారులేరు. హన్నా ప్రార్థించి సమూయేలును పొందింది. హాగరు ప్రార్థించి నీటిని సంపాదించుకుంది. సొలోమోను ప్రార్థించి జ్ఞానాన్ని పొందాడు. యేసయ్య తన తండ్రిని అడిగి సర్వకార్యాలు జరిగించాడు. కాబట్టి మనం చేసే ప్రతీ ప్రార్థన దేవునికి ఇష్టమైన రీతిలో ఉండాలి. పాపాత్మురాలు ప్రభువును అచ్చజఠా-మాంసి అత్తరుతో అభిషేకించింది. ప్రార్థన సువాసనగలది. అట్టి పరిమళమైన ప్రార్థనా జీవితాలను నేటి మహిళలమైన మనకు ఎంతో అవశ్యము.
మనకు దేవుడు ఎన్నో సుఖాలను ఇచ్చాడు. వంటింటిలో కుక్కర్స్, వరండాలో కుక్క కాచుకోనియుండగా ఏ చీకూ చింతా లేకుండా జీవించే అవకాశం దేవుడు మనకిచ్చాడు. కాని, తీరిక సమయంలో సమాజ శ్రేయస్సుకై ప్రార్థించాలి. దానియేలు రోజుకు మూడుసార్లు, దావీదు మహారాజు రోజుకు ఏడు సార్లు ప్రార్థించారు. వారి ప్రార్థనలు సువాసనగలవి. షూలమ్మితి గంధవర్గాలతో నిండివుంది. మరి నీవు – నేను ఎలా ఉన్నాము. సంతోశమ్మ సంతోషంగా ఆనందమ్మ ఆనందంగా ఉంటుందా? మృదుభాషిని మాటలెలా ఉన్నాయి? పరిమళ పరిమళిస్తుందా? ఆనంద నిలయంలో ఏడ్పులు లేవా?అని మనలను మనం ప్రశ్నించుకోవాలి. ఆయన విలువైన రక్తముతో మనలను కొనియున్నాడు. పుణరుర్థానుడైన క్రీస్తు సువాసనను మన జీవితంలో నింపుకొందుము గాక!