ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను (యోబు 13:15).
నేను నమ్మినవాని ఎరుగుదును గనుక సిగ్గుపడను (2 తిమోతి 1:12).
నా నావలన్నీ విరిగి తెరచాపలు చిరిగి
నిరర్థకమైనా శంక నన్నంటదు
నే నమ్మిన వానిని నేనెరుగుదును
కనిపించే కీడంతా నాకు మేలయ్యేను
ఆశలు జారినా అదృష్టాలు మారినా
నిన్నే నమ్మానంటూ గొంతెత్తి పిలిచేను
విన్నపాలు వీగిపోయినా సన్నుతుడు మూగయైనా
నే నమ్మిన ప్రేమను నేనెరుగుదును
నేనర్రులు చాచే ఈవులు ఇవ్వకపోయినా
కళ్ళల్లో కన్నీళ్ళు సుళ్ళు తిరిగినా
భావనలలో ఎగసిన విశ్వాస హోమం
భారమైనా దూరమైనా ఆయనకే అర్పితం
బాధలు వడగండ్లయి బాధించినా
కష్టాలు కందిరీగలై వేధించినా
నేనెదురు చూసే ఔన్నత్యం నేనెరుగుదును
కష్టనష్టాలే దానికి నిచ్చెనలు
నా సిలువ క్రింద నే నలిగి నీరైనా
నా కెదురయ్యే విపరీత నష్టాలే
నా పాలిట అపురూప లాభాలు
విశ్వాసపు లంగరు దించాను
శోధన పెనుగాలుల నెదిరించాను
తొణకదు బెణకదు నా ఆత్మనావ
మృత్యుసాగరపు తీరం చేరేదాకా
నా మనసు నా తనువు ప్రకటించాయి
అందరి వీనుల విందుగా, నా కడ ఊపిరిదాకా
నీ విశ్వాస్యతను అనుమానించను నేనని
ఒక అనుభవశాలి అయిన నావికుడన్నాడు "భయంకరమైన తుపాను చెలరేగి నప్పుడు చెయ్యాల్సిన పని ఒకటుంది. అది తప్ప వేరే మార్గం లేదు. అదేమిటంటే ఓడని ఒక దిక్కుగా నిలిపి అది అక్కడే స్థిరంగా కదలకుండా ఉండేలా ఏర్పాటు చెయ్యడం."
క్రైస్తవుడా, నువ్ చెయ్యవలసిందీ ఇదే. పౌలు ఉన్న ఓడ పెనుతుపానులో చిక్కుకున్నప్పుడు చాలాకాలం సూర్యుణ్ణికాని, నక్షత్రాలనుగాని చూడలేకపోయిన అనుభవం నీకు సంభవించవచ్చు. ఇలాంటప్పుడు ఒకటే దారి. ఇది తప్పనిసరి.
నీ తెలివితేటలు నీకు తోడు రావు. గతంలోని అనుభవాలు సహాయపడవు. ఒక్కోసారి ప్రార్థనలవల్ల కూడా ఓదార్పు కనిపించదు. ఇక మిగిలింది ఒకటే దారి. ఆత్మను ఒక దిశలో స్థిరంగా నిలిపి అటూ ఇటూ కొట్టుకుపోకుండా చూసుకోవడమే.
క్రీస్తు దిశగా ఆత్మ నావను లంగరు వెయ్యాలి. ఝంఝామారుతాలు, ఉవ్వెత్తున లేచిపడే కెరటాలు, విసిరికొట్టే ప్రవాహాలు, ఉరుములు మెరుపులూ, గండశిలలూ ఏం వచ్చినా పర్వాలేదు. చుక్కానికి కట్టేసి, నీ ఆత్మ విశ్వాసానికి దేవుని విశ్వాస్యతనూ ఆయన నిబంధననూ యేసుక్రీస్తు ద్వారా నీపై చూపించే ప్రేమనూ ఆధారంగా చేసి స్థిరంగా ఉండాలి.