మన అందరికీ పది ఆజ్ఞలు తెలుసు కదా. అవి ఎవరు మనకు ఇచ్చారు? అవి ఎక్కడ నుండి వచ్చాయి? ఈ కథలో మనం తెలుసుకుందాం. మనందరికి మోషే అంటే ఎవరో తెలుసు కదా. కొన్ని వేల సంవత్సరాల క్రితం, ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు నుండి తాను చూపించే దేశమునకు నడిపిస్తారు. ఐగుప్తులో వారు బానిసలుగా ఉండేవారు. వారిని విడిపించి వారిని తీసుకొని వెళ్ళడానికి దేవుడు మోషేని ఏర్పరచుకున్నారు. ఎన్నో సంవత్సరములు ఇశ్రాయేలీయులందరూ, చిన్నపిల్లలు మరియు పెద్దవారు, వారి జంతువులు కలిసి ఆ క్రొత్త ప్రదేశానికి ప్రయాణమవుతుంటారు. ఎంతో దూరం వారు ప్రయాణం చేస్తున్నప్పుడు. దేవుని బిడ్డలుగా వారు నడుచుకోవాలని వారికి కొన్ని ఆజ్ఞలను ఇచ్చారు. ఆ ఆజ్ఞల ప్రకారమే వారు నడుచుకోవాలని దేవుని ఆజ్ఞ. ఆ ఆజ్ఞలను ఇచ్చుటకు దేవుడు మోషేని సినాయి కొండపైకి పిలిచి అక్కడ 40 దినములు గడిపి తనకు 10 ఆజ్ఞలను బయలుపరచారు. మీ అందరికీ ఆ 10 ఆజ్ఞలు తెలుసు కదా..
- 1. నీ దేవుడనైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
- 2. దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు;
- 3. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు;
- 4. విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము
- 5. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము
- 6. నరహత్య చేయకూడదు.
- 7. వ్యభిచరింపకూడదు.
- 8. దొంగిలకూడదు.
- 9. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు
- 10. నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు అని చెప్పెను.