అధ్యాయాలు : 16, వచనములు : 433
గ్రంథకర్త : రోమా 1:1 ప్రకారం అపో. పౌలు ఈ పత్రిక రచయిత అని గమనించవచ్చు. రోమా 16:22లో అపో. పౌలు తెర్తియు చేత ఈ పత్రికను వ్రాయించినట్టు గమనిచగలం.
రచించిన తేది : దాదాపు 56-58 సం. క్రీ.శ
మూల వాక్యాలు :
1:6వ ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితివిు. 17వ. ఎందుకనిన నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంత కంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచ బడుచున్నది.
3:21వ ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలు పడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్య మిచ్చుచున్నారు. 22వ. అది యేసు క్రీస్తునందలి విశ్వాస మూలమైనదై, నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది. 23వ. ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. 24వ .కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే, క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడు చున్నారు. 25వ. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించి నందున, ఆయన తన నీతిని కనుపరచవలెనని.
రచించిన ఉద్ధేశం: రోమా పత్రిక రచించిన ఉద్దేశాన్ని రోమా 1:1 లో గమనించవచ్చు. దేవుని సువార్త నిమిత్తమై ప్రత్యేకింపబడిన వాడుగా, రోమా సంఘంలో ఉన్న పరిశుద్ధుల యెడల దేవుడు చూపిన నమ్మికను ప్రోత్సాహిస్తూ ఈ పత్రికను రచించెను. న్పెయిను పట్టణం నందు సువార్త నిమిత్తం తాను చేయబోయే పరిచర్య నిమిత్తం ప్రార్థన సహకారం కొరకు ఈ పత్రికలో వివరించెను. యూదా క్రైస్తవులు మరియు అన్య క్రైస్తవుల మధ్య ఉన్న సమస్యలకు జవాబునిచ్చుట ఈ పత్రికలో ముఖ్య ఉద్దేశంగా గమనించవచ్చు. మాసిదోనియ మరియు అకయ వారు యెరుషలేములో బీదలైన వారికొరకు పోగు చేసిన చందాను వారికి అప్పగించి రోమా పట్టణము మీదుగా స్పెయినుకు ప్రయాణము చేతును అని తెలియజేస్తూ ఈ పత్రికను కోరింథీ సమీపంలో కెంక్రేయలో సంఘ పరిచారకురాలైన ఫీబే ద్వారా అందించెను.
అన్యజనులు క్రైస్తవులుగా మారుటలో అక్షేపణ లేదు. అయితే వారు మొదట సున్నతి పొంది మోషే ధర్మశాస్త్రమును నెరవేర్చిన తరువాత మాత్రమే క్రైస్తవులు కాగలరు. ఇది రోమా లో ఒక పక్షపు వారి మూర్ఖ వివాదం. ఎట్లనగా యూదా మతమును అంగీకరించని ఒకడు క్రీస్తునందు విశ్వాసముంచి రక్షణ పొందగలడా ? అనే ప్రశ్నకు సమాధానం తెలియజేస్తుంది ఈ రోమా పత్రిక.
ఉపోద్ఘాతం: అపరాధములయందు, బలహినతలయందు ఉన్నవారికి మరియు రక్షణ విషయంలో కొదువగా ఉన్నవారికి ఈ పత్రిక ప్రయోజన కారణముగా ఉంటుంది. నిజ జీవితంలో ఎన్నో ఇబ్బందులను కష్టాలను ఛేధించుకొని విజయాలు పొందినవారికి మరియు రక్షణ మార్గంలో దేవునితో సహవాసం చేసిన వారికి ఈ పత్రిక బలపరుస్తుంది. ఒక క్రైస్తవునిగా, క్రైస్తవ వీరునిగా జీవించడానికి ఈ పత్రిక అనుదినం చదవాలి దానిని అభ్యసించాలి. బలమైన విశ్వాసిగా జీవించడం అందరికీ ఇష్టమే, కాని ఎలా జీవించాలో అనేకమైన ప్రశ్నలు సందేహాలు. అయితే పౌలు తన విశ్వాసమును బహిరంగముగా ఒప్పుకొని అప్పగించు రీతిలోని తన జీవిత విధానం ఈ పత్రిక లో గమనించవచ్చు.
అయితే నీతిమంతులుగా తీర్చబడుట ధర్మశాస్త్రమూలముగా కాదు గాని కేవలం యేసు క్రీస్తు వలననే కలుగుతుంది. ధర్మశాస్త్రము కేవలము దేవుని యొక్క పరిశుద్ధతను బయలుపరుస్తుంది. స్వభావంగా పాపియైన మానవుడు పరిపూర్ణముగా ధర్మశాస్త్ర ప్రకారం జీవించలేడు, అయితే ఆ మానవుడు నీతిమంతుడుగా ధర్మశాస్త్ర ములముగా ఎలా తీర్పుతీర్చగలడు? కేవలం క్రీస్తు ద్వారానే పాప క్షమాపణ, అప్పుడే నీతిమంతుడుగా తీర్చబడగలడు. కనుక క్రీస్తునందు విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుదుము అను సంగతిని అపో.పౌలు ఈ పత్రికలో విశదీకరించాడు.
పలు సంఘాలలో ఉన్న విశ్వాసుల ఆధ్యాత్మిక స్థితిగతులను పరిశీలించిన వాడిగా పాపము విషయములో యూదులకును అన్యజనులకును రక్షణ అవసరమని గుర్తించాడు. అయితే ఈ రక్షణ దేవుని కుమారుడును మన ప్రభువునునైన యేసు క్రీస్తు సిలువ కార్యముద్వారా కలిగెను. అనగా ఈ రక్షణ కేవలం విశ్వాసం ద్వారానే దేవుడు అబ్రహామునకు చూపిన విధముగా ప్రతి మానవునికి దయజేస్తాడు. ఒక క్రైస్తవునికి రక్షణ అనునది మొట్టమొదటి అనుభవం. క్రీస్తు మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి విశ్వాసులమైన మనకు పాపము నుండి, ధర్మశాస్త్రము నుండి మరియు మరణము నుండి విడుదల కలుగజేసి ఇట్టి రక్షణను కలుగజేసెను.
రోమా పత్రిక దేవుని నీతియనునది ముఖ్య ఉద్దేశముగా విభజించబడింది. దేవుని నీతి ప్రత్యక్షత (అధ్యా 1-8), దేవుని నీతి నిరూపించబడుట (అధ్యా 9-11), దేవుని నీతి యొక్క అనుచరణ అభ్యాసము (అధ్యా 12-16). అపో. పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరిని పాపము విషయంలో ఖండిస్తూ రోమా సంఘములో ఉన్న విశ్వాసులకు దేవుని యెక్క సత్య వాక్యమును భోదించుట లో ఆసక్తిని ఈ పత్రిక ద్వారా కనపరచెను. అయితే మనము సరియైన మార్గములో ఉన్నామో లేదో పరీక్షించు కొని సువార్త విషయంలో సిగ్గుపడక ఉన్నామా?. క్రీస్తు యొద్దకు వచ్చునప్పుడు మన జీవితాలను సరిచేసుకోవాలని దేవుడు ఎన్నడును బలవంతము చేయలేదుగాని, వాస్తవానికి మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మనకొరకు సిలువలో మరణించెను. ఎప్పుడైతే మన జీవితాలను క్రీస్తుకు సమర్పించి జీవిస్తామో పాపస్వభావములో ఇక ఎన్నడును నడిపించబడము గాని పరిశుద్ధాత్మ ద్వారానే మనలను నడిపిస్తుంది. అదేమనగా యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపేనని హృదయమందు విశ్వసించిన యెడల రక్షింపబడుదుము. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకొనవలెను. ఎట్లనగా ఇట్టి సమర్పణ ఆయనను ఆరాధించుటలో ఉన్నతమైన కోరిక. ఈ లోకములో వాటి సౌఖ్యాలతో జీవించి ప్రభువును మెప్పించలేముగాని మన దృష్టి ఎల్లపుడు క్రీస్తు వైపు నుంచుకొనవలెను.
సారాంశం: అపో. పౌలు రోమా సంఘానికి పత్రిక వ్రాస్తూ, పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్ధానం చేసిన విధముగా దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తు విషయమైన సువార్తను నెరవేర్చేను. ఎట్లనగా శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారునిగాను ప్రభావముతో నిరూపింపబడెను. యేసు క్రీస్తు నందు విశ్వాసముంచిన వారముగా అనగా తన కృపను పొందుటకు మనలను ప్రత్యేకించెను. అయితే మనము కూడా మన స్నేహితుల యెడల ప్రేమ కలిగి, ఒకరినొకరు ఆదరిస్తూ, విశ్వాసములో స్థిరపడుతూ, వారికోసం ప్రార్థించడమే కాకుండా వారివలన దేవుని ఘనపరచడమే ఒక విశ్వాసిగా మనం నేర్చుకోవాలి. మన నడవడిలో, ఉద్దేశాల్లో మరియు ఆలోచనల్లో ఎల్లప్పుడూ “దేవుని చిత్తమైతే” (యాకో 4:15) అని అనడం జ్ఞాపకముంచుకోవాలి. ఒక క్రైస్తవ విశ్వాసిగా తన జీవిత నడవడిలో, సంఘములో మరియు లోకముతో ఏ విధముగా జీవించాలి అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలిసింది కదా!. ఒక బలమైన విశ్వాసిగా జీవించడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమేన్..