Day 34 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొనిపోయెను (మార్కు 1:12).

దేవుడు చేసే మేళ్ళకి ఇది విచిత్రమైన ఉదాహరణ. వెంటనే...అంటే దేని వెంటనే? ఆకాశం చీలి పరిశుద్ధాత్మ పావురంలాగా క్రీస్తు మీదికి దిగివచ్చి, తండ్రి దీవెన వాక్యం "నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నాను" అంటూ వినిపించిన వెంటనే. ఇది అసాధారణమైన అనుభవమేమీ కాదు. నీ ఆత్మకి కూడా ఇలాటి అనుభవాలు కొత్తేమీ కాదు. నీ మనసు ఉత్సాహంతో గాలిలో తేలిన మరుక్షణమే దిగులుతో పాతాళానికి క్రుంగిపోయిన సందర్భాలు లేవా? నిన్ననే ఆకాశంతో ఆడుకుంటూ ఉదయ కిరణాలతో ఊసులాడింది నీ హృదయం. ఈ రోజు దాని రెక్కలు ముడుచుకున్నాయి. దాని నోరు మూతబడింది. మధ్యాహ్నం తండ్రి చిరునవ్వుతో కేరింతలు కొట్టావు. సాయంత్రమయ్యేసరికి అరణ్య ప్రాంతాల్లో తిరుగుతూ
"నా దారి దేవునికి కనుమరుగైంది" అని నిట్టూరుస్తున్నావు.

"వెంటనే" అనే మాటలోని ఆదరణని గమనించావా? దీవెన వెంటనే ఎడబాటు ఎందుకు కలగాలి? ఇంత త్వరగా కష్టం కలగడమే మనకి నిశ్చయత కలుగజేస్తున్నది. ఎలాగంటే దీవెన వెంటనే కష్టం వాటిల్లింది కాబట్టి. ఆ కష్టం కూడా మారువేషంలో ఉన్న దీవెనన్న మాట. నువ్వు అరణ్యాలలోను, గెత్సెమనే తోటలలోను, కల్వరిలోను ధైర్యవంతుడివిగా ఉండాలని దేవుడు తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేస్తాడు. నువ్వింకా లోతుల్లోకి దిగగలగాలని నిన్ను పైకెత్తి నీకు బలాన్నిస్తాడు. అసహాయులకి సహాయం చెయ్యడానికిగాను నిన్ను రాత్రి చీకటిలోకి పంపనుద్దేశించి నిన్ను వెలిగిస్తాడు.

అరణ్యంలోకి పోవడానికి అన్ని వేళల్లోనూ నీకు శక్తి చాలదు. యొర్దాను నది ఒడ్డున మహిమానుభవం పొందిన మరుక్షణంలోనే నీకు ఆ శక్తి ఉంటుంది.
బాప్తిస్మం లోని తేజస్సే నిన్ను అరణ్యంలోని ఆకలిని తట్టుకునేలా చెయ్యగలదు. ఆశీర్వాదాల తరువాత వచ్చేవి పోరాటాలే.

ఆధ్యాత్మిక జీవితాన్ని స్థిరపరచి దాన్ని అనేక రెట్లు అభివృద్ది చెందించే పరీక్షలు సామాన్యమైనవి కావు. ఆ సమయాల్లో నరకమే దిగివచ్చినట్టు ఉంటుంది. మన ఆత్మ వలలో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తుంది. దేవుడు మనల్ని సైతాను చేతికి అప్పగించాడని అర్థమవుతుంది. అయితే ఆత్మకు దేవుణ్ణి కాపరిగా ఉంచుకున్న వాళ్ళకి ఈ అనుభవం ఒక ఘనవిజయానికి దారి తీస్తుంది. శోధన తరువాత కాలమంతా జీవితానికి అరవై రెట్లు ప్రయోజనం కనిపిస్తుంది.