ప్రతీ హృదయంలో క్రిస్మస్


  • Author: Vijaya Kumar G
  • Category: Messages
  • Reference: Sajeeva Vahini Dec - Jan 2010 Vol 1 - Issue 2

దేవుడు లేని గుడి గుడి కాదు. మొదట గుడిలో వెలిసాకే ఏ దేవుడైనా ఏ అవతారమైనా. అవతారం అనగానే దేవుడికి మనమిచ్చే రూపం అనుకుంటే అది ఓ క్షమించరాని పొరపాటు. దేవుడే అవతరించాల్సి వస్తే లేదా అవతరించాలనుకుంటే ఏ రూపంలో ఏ ఆకారంలో అవతరించాలో అది ఆయనకే తెలుసు.

కనిపించే ప్రతీ చరా చరములోను యుండి కనిపించకుండా ఉండేదే దైవం. అలా అని కనిపించిన ప్రతీదీ దైవమే అనుకుంటే అదొక పొరపాటు. ఏదో ఒక రోజు తానే ఒక రూపంగా అవతరించబోతున్నాడు అనేది దేవునికి మర్మమైన విషయం కాదు. ఆదికాండం చదువుతుంటే ఈ మర్మం స్ఫురించక తప్పదు బయలుపడక మానదు. ఆదికాండం 1:27 “దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను;” ప్రకారం దేవుడు తన స్వరూపం తన పోలిక సృష్టిలో మరి దేనికి ఇవ్వలేదు (నరునికి తప్ప).

దేవుడు నరుని అవతారం అనుకుందాం. మరి గుడి సంగతో! 1 కోరింథి 3:16 ప్రకారం “మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?” అనగా మనమే దేవుని ఆలయం, ఆత్మయే ఆ గుడిలో దైవం. తన పోలికగా సృష్టించబడిన వాడు నరుడైతే – నరుని పోలికగా పుట్టినవాడు దైవంకాక మరేమిటి?. సృష్టి ఆరంభంలోనే దేవుడు నరావతారి అవుతాడు అనే ప్రవచనం వెలువడింది అంటే ఆశ్చర్యం. ఆది 3:15 లో “నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను”.

దేవుని మహిమను పోగొట్టుకున్న నరునికి దైవజ్ఞానపులోతు ఎప్పటికి అంతు చిక్కనిదే. అందుకే దేవుడు ప్రవక్తల ద్వారా ఎప్పటికప్పుడు తన రాకడను బయలుపరుస్తూనే ఉన్నాడు. యెషయా 7:14 “కన్యక గర్భవతియై కుమారుని కనును” అతనికి ఇమ్మానుయేలు అని పేరు. యెషయా 9:6 “ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను” అనగా దేవుడు స్త్రీ సంతానముగా లేదా స్త్రీ గర్భాన పుట్టిన ఒక శిశువుగా అవతరించబోతున్నాడు. అతడు సప్తాత్మావషుడు (1. శిశువు లేదా కుమారుడు 2. రాజు 3. ఆశ్చర్యకరుడు 4. ఆలోచనకర్త 5. బలవంతుడు 6. నిత్యుడు 7.సమాధాన కర్త) అనగా యెషయా 11:2 “ 1. యెహోవా ఆత్మ 2. జ్ఞాన ఆత్మ 3. వివేకమగు ఆత్మ 4. ఆలోచన ఆత్మ 5. బలమైన ఆత్మ 6. తెలివి పుట్టించు ఆత్మ 7. భయభక్తులను పుట్టించు ఆత్మ” అవతరించబోయే దేవుడు కేవలం నరుడుగా మాత్రమే అవతరిస్తాడని ఆయనే తన ప్రజలకు (తనయందు విశ్వాసముంచిన వారికి) తోడు నీడగా ఉంటాడని, ఆయనే రాజై రారాజై రాబోవు యుగంలో పరిపాలిస్తాడని బయలుపరచబడింది. సిద్ధాంతం ఏదైనా, వేదాంతం ఎంతైనా తాత్పర్యం ఒక్కటే. మాట చేత సృష్టించబడిన సృష్టము ఏదీ నరునికి సాటి రాదు. ఎందుకంటే సృష్టి కేవలం మాట చేత కలిగింది కాని నరుడు మాత్రం దేవునిచే స్వయంగా స్వహస్తాలతో నిర్మించబడినాడు అంటే పుట్టబోయే దైవ స్వరూపం. మికా 5:2 “బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబము లలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీ యులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.” లోని ప్రవచనం ప్రకారం దేవుడు ఒక అదృశ్యం నుండి దృశ్యంగా వేలుస్తాడనో, భూమినుండి ఉద్భవిస్తాడనో, గగనం నుండి రాలిపడతాడనో అనుకుంటే అది కేవలం మానవుని భ్రమ మాత్రమే. ఇక్కడ దేవుడు బేత్లెహేము గ్రామములోనే పుడతాడు అని ప్రవచనం స్పష్టంగా ఉంది.

పేరు పిలిచినా ఏ రూపంతో కొలిచినా అదే దైవం అనే వాదన ఓ అర్ధ రహితమైన సిద్దాంతం. దేవుని అవతారం లేదా రూపం ఏమిటి అనేది ఇక నిస్సందేహం. ఎందుకంటే పై ప్రవచానాలన్నీ ఆయన నరరూపియైన దైవం అని ఆత్మ పూర్ణుడైన దైవం అని స్పష్టంగా కనిపిస్తుంది. ఇక సృష్టి సిద్ధాంతం చూస్తే ఒక సందేహం కలుగక మానదు. అదేమంటే దేవుడే తాను ఒక్కమాటలో సృష్టి అంతా చేసి ఉంటే సృష్టంలో ఎందుకు అంతర్లీనమై ఉండడు? ఆది 1:3 లో “దేవుడు ... పలుకగా ... కలిగెను.” అని ఉంది. అంటే కనిపించే సృష్టి అంతటిలో దేవుని స్వరం దాగి ఉంది, దైవమే ఉంది – అనుకుంటే తప్పేకదా మరి!. అందుకే యోహాను 1:14 ప్రకారం “ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను;” అనగా మాట చేత సృష్టి అంతా నెరవేర్చబడుతుంది అని, ఆ మాట నరునిగా అవతారం ఎత్తింది అని ధ్యానం చేసుకోవాలి. ఇక పేరు విషయానికొస్తే నా ఇష్టం వచ్చిన పేరు, నా ఇష్ట దైవం అనేది ఆత్మ జ్ఞానానికి సరిపడదు.

మానవావతారి (నరరూపి) యైన దైవానికి ఎవ్వరూ పేరు పెట్టలేరు పెట్టరాదు. ప్రవక్తలతో దేవుడు బయలుపరచిన పేరు “ఇమ్మనుయేలు”. తన తండ్రి (Guardian) యైన యోసేపుకు బయలు పరచిన పేరు “యేసు”. ఈ రెంటికి భిన్నంగా గొల్లలకు తెలిపిన పేరు “క్రీస్తు”. ఇమ్మానుయేలను మాటకు మత్తయి 1:23 దేవుడు మనకు తోడని అర్థము. యేసు అను మాటకు (మత్తయి 1:21) రక్షకుడు అని అర్ధం. క్రీస్తు అను మాటకు లూకా 2:11 ఆభిషిక్తుడు అని అర్ధం. ఇంతకీ ముమ్మారు పెట్టబడిన పేళ్ల అంతరార్ధం గమనిస్తే ఆసక్తి కరమైన విషయాలు తెలిసికొనగలం.

ప్రియ చదువరీ!, యేసు క్రీస్తు జన్మదినాన్ని ఎలా జరుపుకోవాలో తెలుసుకున్నావా? క్రిస్మస్ అంటే నీకు ఏమై ఉంది? క్రిస్మస్ అంటే కొందరికి ఇమ్మానుయేలు పుట్టినరోజు. ఇంకొందరికి యేసు పుట్టినరోజు. మరికొందరికి క్రీస్తు పుట్టిన రోజు. ఇమ్మానుయేలు అను పేరులో ఒక ప్రాపంచిక వాగ్దానం (Universal Promise) దాగి ఉంది. అనగా ఇమ్మానుయేలును ఎరిగిన ప్రతిఒక్కరికీ ఆయన తోడు నీడగా (మత్తయి 1: 23) ఉంటాడని అర్ధం. ఇందులో జాతి, కులం ఇత్యాది విభేదాలు లేవు. యేసు అను పేరులో క్రైస్తవ వాగ్ధానం (Promise to a Christian) దాగి ఉంది. అనగా తన ప్రజలను (అంటే యేసే నా స్వంత రక్షకుడు అని నా పాపములనుండి ఆయనే నన్ను రక్షించును అని విశ్వసించువారు) ఆయనే రక్షించును (మత్తయి 1:21) అని అర్ధం. క్రీస్తు అనే పేరులో ప్రజలందరికీ వాగ్దానం (Promise for Everyone) దాగి ఉంది. అనగా ఇది “ప్రజలందరికిని మహా సంతోషకరమైన సువర్తమానము ” (లూకా 2:10) అని అర్ధం.

గత సంవత్సరము నుండి ఈ సంవత్సరము వరకు మనకు తోడైయుండి మనలను నడిపించిన ఇమ్మానుయేలు మనలో సంతోషానందాలను నింపిన క్రీస్తు ప్రభువు మన ప్రతీ పాపమును క్షమించి నిజమైన రక్షణ అనుభవంలోనికి నడిపించిన యేసయ్య ప్రతీ గుండె గుడిలో కొలువై యుండాలని, ఈ ప్రత్యేక క్రిస్మస్ ప్రతీ జీవితంలో నూతన వెలుగులు విరజిమ్మాలని ప్రార్థించుకుందాం, ఆమేన్.

rigevidon reddit rigevidon risks rigevidon quantity