సుంకరులును వేశ్యలును మీకంటె ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను (మత్తయి 21:31). సుంకరులును వేశ్యలును పాపముతో నిండిన వారు కదా మరి వారు ముందుగా దేవుని రాజ్యములో ఎలా ప్రవేశించుదురు?
ఈ దినము మనము సుంకరియైన మత్తయి గురించి తెలుసుకుందాము. అల్ఫయి కుమారుడగు లేవి గలిలయ ప్రాంతపు యూదుడు, అతని మరొక పేరు మత్తయి. మత్తయి ఇశ్రాయేలులో సుంకము వసూలు చేయు అధికారి, రోమా ప్రభుత్వము కొరకు తన సొంత ప్రజల వద్ద సుంకము వసూలు చేయుచు వారికీ అయిష్టుడు అయినాడు. ఒక దినము సుంకపు మెట్టునొద్ద కూర్చొని ఉండగా అటుగా వెళ్తున్న యేసు మత్తయిని చూచి నన్ను వెంబడించుమని చెప్పగా మత్తయి లేచి ఆయనను వెంబడించెను. యేసు తనని వెంబడించుమని చెప్పక మునుపు మత్తయి ఎంతో పాపముతో నిండినవాడు.
మత్తయి ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా, మత్తయి తన తోటి సుంకరులును పిలువగా వారును వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి. సుంకరులు పాపము గలవారను విషయము మరియు పాపముతో నిండిన మత్తయిని యేసు తన శిష్యునిగా ఎంచుకొనెను అను సంగతి ఇక్కడ మనము గమనించవచ్చు. యేసు పరిసయ్యులు మాటలకు ఈ విధముగా సమాధానము చెప్పెను - రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు గదా. అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు (మత్తయి 9:13).
ప్రియమైన దేవుని బిడ్డలారా మనలో పాపము నిండివున్నదా? ప్రశ్న వేసుకొందము. మనము పాపములేని వారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్య ముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును (1 యోహాను 9:1-5) ఇక్కడ దేవుడు మనలాంటి పాపులను పిలిచి నీతిమంతులుగా చేయదలచెను అని తెలుసుకొనవచ్చు.
దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపముచేయడు; వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు (1 యోహాను 3:9). దేవుని మూలముగా పుట్టుట అనగా ఆత్మమూలముగా జన్మించుట. ఇక్కడ మనము ఇంకొక విషయము తెలుసుకుందాము – నీటి మూలముగాను ఆత్మమూలము గాను మనము జన్మించితే మనము పాపము చేయము మరియు దేవుని రాజ్యములో ప్రవేశింప అర్హత పొందుతాము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా మనము దేవునిచే పిలువబడి పాపమునుండి కడగబడి నీతిమంతులుగా ఎంచబడిన వారము, దేవుని నమ్మిన ప్రతి మనిషి పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము (రోమీయులకు 6:18).
మత్తయి దేవుని కృపచేత సువార్త వ్రాసెను మరియు ఆ సువార్త క్రొత్త నిబంధనలో మొదటి సువార్తగా చేర్చబడుట మనము చూడవచ్చు. మత్తయి సువార్త ఎక్కువగా యూదులను ఉద్దేసించి యూదుల కొరకు వ్రాయబడినదిగా మనము గమనించవచ్చు. మత్తయి సుంకరిగా లెక్కలు వేయుటలో మంచి నేర్పరి అని మనము భావించవచ్చు ఎందుకనగా మత్తయి సువార్తలో తాను ఎన్నో విషయములను మంచి రీతిలో అమర్చి - యేసు వంశావళి మొదలుకొని ఇమ్మానుయేలుగా (దేవుడు మనకు తోడు) మన కొరకు పుట్టిన విధానము తెలిపి దేవుని కుమారునిగా దేవుని రాజ్యము గురించి ఉపమాన రీతిగా అయన చెప్పిన ఎన్నో విషయములు పొందుపరచి మహిమ గల దేవుడు చేసిన అధ్బుతకార్యములు వివరించి మన కొరకు ఏ విధముగా మరణించెనో తిరిగి పునరుత్థానము పొందుట గురించి చక్కగా వ్రాసెను.
మత్తయి సువార్త A.D 50 – A.D 70 మధ్య కాలంలో వ్రాయబడినదిగా మరియు మత్తయి ఎతియోపియాలో మరణించి వుండవచ్చు అని భావిస్తుంటారు.