దేవునికి మనమివ్వగల ఉత్తమమైన బహుమానం.


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

దేవునికి మనమివ్వగల ఉత్తమమైన బహుమానం.

ఒక వ్యక్తి తన స్నేహితుని పుట్టినరోజుకి మంచి బహుమతి ఇవ్వాలని అనుకున్నాడు.  ఆ స్నేహితుణ్ని సంతోషపరచాలంటే తనకు ఇష్టమైన బహుమానం ఇస్తేనే కదా. ఇష్టమైనది అంటే తనకు నచ్చేదిగా ఉండాలి, అతనికి ఉపయోగపడేదిగా ఉండాలి. ఆశంతా ఆ బహుమతి తన స్నేహితుణ్ని సంతోషపరచడానికే కదా!

మనమైతే, ఏదైనా బహుమతి కొనేముందు ఎన్నో ఆలోచనలతో వెతికి వెతికి ఏ రీతిగా ఆలోచిస్తామో కదా. ఇదిలాఉంటే, మనలను బాగా ప్రేమించే వారు మనకు ఏదైనా బహుమతి ఇస్తే అది చిన్నదా పెద్దదా, దాని విలువ ఏంతో అని చూడము కదా. కొన్నిసార్లు విలువలేని కాగితంపై మూడు విలువైన మాటలు వ్రాసి బహుమానంగా ఇస్తే కూడా ప్రేమను వెదజెల్లే ఆ మాటలు హృదయాన్ని హత్తుకుపోతాయి. ఆ బహుమానాల్లో ఇచ్చినవారి ప్రేమను చూస్తాము కదా.

క్రీస్తు మన కొరకు తన జీవితాన్ని బహుమానంగా ఇచ్చాడు అంతకంటే మన జీవితానికి ఏమి కావాలి? సిలువలో క్రీస్తు పొందిన గాయాలను అనుభవించినప్పుడే ఆ గాయం విలువ తెలుస్తుంది ఆ బహుమానం వెనక ఉన్న దేవుని ప్రేమ, ఆప్యాయత, అనురాగం అర్ధమవుతుంది.

దేవునికి మంచి బహుమానం ఇవ్వాలంటే ముందుగా ఆయన మనసు ఎరిగినవారమైతేనే సాధ్యం (రోమా 11:34). ఆయన మనసును అర్ధం చేసికొని పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకోవడమే మనం ఆయనకు ఇచ్చే అతి విలువైన బహుమానం (రోమా 12:1). 

మనం ప్రేమించేవారికి, స్నేహితులకు, బంధువులకు మనమివ్వగల విలువైన బహుమానాలు ఎన్నో ఉంటే, దేవునికి మనం ఇవ్వగల విలువైన బహుమానం మనమే అని గ్రహించాలి. దేవునికి  కృతజ్ఞతతో, ప్రేమతో, వినయముతో, విధేయతతో, మనఃస్పూర్తితో మనలను మనం ఇచ్చేసుకుందామా?. ఆమేన్.


https://youtu.be/yyU-2p67uXg