నేను దాసుడను కాను


  • Author: Anudina Vahini | Dr. G. Praveen Kumar | Connecting With God | Dr. Suma Jogi | Devotions Telugu & English
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 2
  • Reference: Sajeeva Vahini

నేను దాసుడను కాను

దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; ఆది 1:27

రెండవ సమూయేలు 9వ అధ్యాయం మెఫీబోషెతు ను గూర్చి వ్రాయబడింది. మెఫీబోషెతు అంటే సిగ్గుకరము లేదా నాశనకరమైన అవమానము అని అర్ధం. రాజైన సౌలు మనవడును యోనాతాను కుమారుడును యవనస్తుడైన ఈ మెఫీబోషెతు రాజ వంశకునుగా సరైన రీతిలో ఆలోచించక తనకు తానే తిరస్కరించబడినవానిగా ఎంచుకున్నాడు. తన కుంటితనాన్ని బట్టి ప్రయోజకుడను కానని తనలో తాను అనుకున్నాడు.

లోదెబారులో నున్న అమ్మియేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని సీబా ద్వారా దావీదు తెలుసుకొని మెఫీబోషెతును పిలిపించాడు. మెఫీబోషెతు దావీదు ముందు భయముతో సాగిలపడినప్పుడు, దావీదు – నీవు భయపడవద్దు నీ తండ్రియైన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును; మరియు నీవు సదాకాలము నా బల్లయొద్దనే భోజనము చేయుదువని (2 సమూయేలు 9:7) లో గమనించగలం. 8వ వచనంలో గమనిస్తే మెఫీబోషెతు  “చచ్చిన కుక్కవంటివాడనైన నా యెడల నీవు దయ చూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటివాడను” అంటూ తనను తానే తిరస్కరించబడినవానిగా ఎంచుకున్నాడు అనుటకు సాదృశ్యంగా ఉన్నాడు. 

తగ్గింపు జీవితం లేదా తగ్గించుకునే స్వభావం కలిగియుండడం చాల మంచిదే, కాని మనల్ని మనం తిరస్కరించుకొని తక్కువవారంగా చేసుకోవడం స్వాభావికంగా మంచిది కాదు. నేను చేయలేను, సాధించలేను, చేతకానివాడనని అనుకున్నప్పుడల్లా మనలోని పట్టుదల మరియు శక్తి సామర్ధ్యాలను మనం కోల్పోతూ ఉంటాము. సాధించాలనే పట్టుదల కలిగినప్పటికీ విశ్వాసం కంటే మనలో సాధించలేమనే భయం ఉంటే ఎన్నటికి విజయాన్ని చూడలేము. అది దైనందిన జీవితమైనా విశ్వాస జీవితమైనా. మనం పాపులము, అర్హులము కాక అనీతిమంతులమైనప్పటికీ (2 కొరింథీ 5:21) ప్రకారం “ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.” హల్లెలుయ! ఇప్పుడు క్రీస్తు ద్వారా అర్ధత పొందగలిగిన మనం ఆయన స్వరూపంలోనికి మార్చబడిన మనం సత్యములో ధైర్యముగా నడవగలుగుతున్నాము.

యోనాతానుకు చేసిన ప్రమాణమును బట్టి అర్హతలేని మెఫీబోషెతును దావీదు ఆశీర్వదించినట్టు, యేసు క్రీస్తును బట్టి మనలను కూడా దేవుడు ఆశీర్వచించాడు. మెఫీబోషెతు కుంటితనం మనలోని బలహీనతలకు సాదృశ్యం గా ఉన్నాయు. ఇప్పుడు మనం రాజులైన యాజక సమూహంలో చేర్చబడ్డాము ఇక మనలో బలహీనతలు ఎందుకు? క్రీస్తులో బలము శక్తి తప్ప! ఆమెన్.

Telugu Audio: https://youtu.be/bHeuBPpRL20