మొదటి భాగము - ఎందుకు ప్రాముఖ్యము?
యేసు క్రీస్తు శిష్యునిగా ఉండాలంటే ప్రప్రధమంగా బాప్తిస్మము అత్యంత ప్రాముఖ్యమని పరిశుద్ధ గ్రంధం తెలియజేస్తుంది. పాత నిబంధన కాలంలో బాప్తిస్మము అనే అంశం లేదు, పాత నిబంధన గ్రంధములో వున్నది క్రొత్త నిబంధనలో లేనిది – సున్నతి. క్రొత్త నిబంధనలో వున్నది పాత నిబంధనలో లేనిది – బాప్తిస్మము. నేడు అనేకులు బాప్తిస్మమును నామమాత్రముగానే ఆచరిస్తూ ఉన్నారు, ఈ దినాలలో అనేక సంఘాలలో బాప్తిస్మము నిర్లక్ష్యము చేయబడుతూ ఉంది. సాముహిక ఆలోచనలను తొలగించి వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత నిచ్చే సంస్కృతిలో నేడు మనం నివసిస్తున్నాము.
మన వ్యక్తిగత ఉద్వేగాలు, అవసరాలు, ఆలోచనలకంటే సమూహముగా కలిసియుండుటయే మనకెంతో అవసరమై ఉన్నది. అపో.కా 10:34-48లో ఆజ్ఞాపింపబడింది. యేసు క్రీస్తు ప్రభువు చెప్పినట్టు “మీరు సర్వలోకానికి వెళ్లి సమస్త జనులను శిష్యులను చేయుడి” అని చెప్పబడినట్టు ఈ భాగము “గొప్ప ఆజ్ఞగా” పిలువబడుచున్నది. దీనిని ఎలాగు చేయాలో ఆయన చెప్పారు., ఆయన చెప్పిన బోధలో బాప్తిస్మము ఇమిడివుంది. ఈ భావన వెనక ఉన్న ప్రత్యేకతను పరిశీలించి అర్ధం చేసుకుందాం.
మత్తయి 28:16-20 “పదునొకండుమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్లిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరిగాని, కొందరు సందేహించిరి. అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగాచేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు, నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.”
ఈ ఆజ్ఞ యొక్క వ్యాకరణాత్మకత ఎంతో ప్రాముఖ్యమైనది. ఇందులో ప్రత్యేకమైన ఆజ్ఞ శిష్యులను తయారు చేయడం. మిగిలిన మూడు భాగాలు – వెళ్ళుట, బాప్తీస్మమిచ్చుట మరియు బోధించుట ఇవన్నీ కూడా ఈ ఆజ్ఞను బలపరుస్తూ ఉన్నాయి. యేసు క్రీస్తు శిష్యునిగా తయారు చేయాలంటే, మొదటిగా సర్వలోకానికి వెళ్లి సువార్తను ప్రకటించాలి రెండవదిగా విశ్వాసముంచినవారికి బాప్తిస్మము ఇవ్వాలి మరియు మూడవదిగా నూతన విశ్వాసులైన వారికి దేవుని సంఘములో చేర్చి వారికి యేసు క్రీస్తు బోధనలను నేర్పించాలి.
“సువార్తను అంగీకరించామనుటకు ఋజువు మనం పొందిన బాప్తిస్మమే”
రెండవ భాగము - బాప్తిస్మము అనగా నేమి?
బాప్తిస్మము అనే పదం గ్రీకు భాషలో మునుగుట (Immerse) లేదా ముంచుట (dip) అని అర్ధం. నీళ్ళలో వ్యక్తిగతంగా ముంచే ప్రక్రియే బాప్తిస్మము. ఇది ఒక గుర్తు. ఒక వ్యక్తి యేసు క్రీస్తు సువార్తను అంగీకరించాడు అనుటకు ఋజువు మరియు వారి నూతన జీవన విధానంలో గుర్తించబడటానికి గుర్తు. బహిరంగంగా ఆ వ్యక్తి తన జీవితం క్రీస్తువైపు నడిపిస్తున్నాడన్నా సంగతులకు బాప్తిస్మము సూచనగా ఉంటుంది.
క్రొత్త పాత నిబంధనలలో ఉన్న వ్యత్యాసం ?
అబ్రహాముతో దేవుడుచేసిన నిబంధన : నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన యేదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొంద వలెను (ఆది 17:9). అయితే, క్రొత్త నిబంధన గ్రంధములో అపో. పౌలుగారు సున్నతి పొందుటయందు ఏమియు లేదు, సున్నతి పొందక పోవుటయందు ఏమియులేదు (1 కొరిం 7:19) అంటున్నారు. అది దేవుడు పెట్టిన నిబంధనను మీరినట్లు ఔతుందా?? ఆలోచన చేద్దాం. ఇక్కడ దేవుడు నీ సంతతి అనే మాట కూడా చెబుతున్నారు. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థక మగును (రోమా 4:14) అంటూ; మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము (రోమా 8:17) అంటున్నారు.
అనగా మనము క్రొత్త నిబంధన సంబంధ వారసులమే గాని పాత నిబంధన ఆచారములకు వారసులము కాము అని భావన. ధర్మశాస్త్ర సంబంధమైన నిబంధనలో పురుషుడు మాత్రమే ప్రతిష్ట చేయబడుచుండగా, నూతన నిబంధన స్త్రీ పురుషులిద్దరినీ పరిశుద్ధ పరచుచున్నది. పాత నిబంధన నియమము శరీర సంబందమై దేవుని కట్టడలను తప్పక అనుసరించేదిగా వుండగా నూతన నిబంధన నియమము దేవుని కుమారుడైన క్రీస్తును అనుసరించేదిగా నుండి ఆయన మరణ భూస్థాపన పునరు త్థానములలో పాలిభాగస్తులు గాను పరలోక వారసులనుగానూ చేయుచున్నది.
రోమా 8:17 ప్రకారము మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము మరియూ క్రీస్తుతోడి వారసులము. అయితే, క్రొత్త నిబంధన క్రైస్తవునికి ఒక నియమము ఇక్కడ కనబడుచున్నది ఏమనగా; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల. యేసు ప్రభువు అననీయకు కనబడి అపోస్తలుడైన పౌలు గారి గురించి చెబుతూ : అతడు నా నామము భరించాలి, నా నామము కొరకు శ్రమలు అనుభవించాలి అని చెప్పినట్లు అపో 9:15, 16 వచనాలలో మనము చదువుతున్నాము. అప్పుడే అతడు బాప్తిస్మము పొందినట్లు అపో 9:18 లో వ్రాయబడియున్నది. క్రీస్తుతో శ్రమపడుటకు బాప్తిస్మము ఒక ప్రామాణిక సూచనగా వున్నది.
“బాప్తిస్మము దేవునితో నీ నడక, నిత్యత్వానికి అది నిన్ను నడిపిస్తుంది.”
మూడవ భాగము - యేసుక్రీస్తు వారు ఎటువంటి బాప్తిస్మము పొందారు?
యేసుక్రీస్తు వారు పొందిన బాప్తిస్మము అను అంశమును జాగ్రత్తగా విశ్లేషించి చూసినట్లైతే; మొదట వారు మత్తయి 3:16 ప్రకారము మొదట నీటి బాప్తిస్మము పొందారు, వెనువెంటనే పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందారు తుదకు అగ్ని బాప్తిస్మము అనగా సిలువ మరణము పొందారు. బా. యోహాను గారు; నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలొ బాప్తిస్మ మిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవనిమీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మ మిచ్చువాడని నాతో చెప్పెను (యోహా 1:33) అంటున్నాడు. మరియొక చోట; మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మ మిచ్చుచున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును (మత్త 3:11) అంటున్నాడు.
ఎవరీ బాప్తిస్మమిచ్చు యోహాను అంటే, దేవునియొద్దనుండి పంపబడిన మనుష్యుడు (యోహా 1:6). ఎవరీ అపో. పౌలు అంటే ధర్మశాస్త్రసంబంధమగు నిష్ఠయందు శిక్షితుడైయుండి నజరేయుడనగు యేసు చేత పట్టబడినవాడు (అపో 22:3; 9:1-18). ఇక యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను (రోమా 1:5). వీరు ఆరంబించిన ఈ బాప్తిస్మ విధానమును గూర్చి జాగ్రత్తగా తరచి చూచినట్లైతే అనేక సత్యములు మనము ధ్యానించ గలము.
యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకమునుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? (మార్కు 11:30) – ఇది మనకు మొదటి ప్రశ్న. ప్రియ స్నేహితుడా, పరలోకమునుండి కలిగినది అనుకుంటే, ఈ వ్యాసము నీకొరకే. మనుష్యులనుండి కలిగినది అనుకుంటే ఇంకా లోతైన సంగతులు నీకు వ్యర్ధమే. ఆశ్చర్యమేమంటే; మత్త 3:14,15 ప్రకారం యేసుక్రీస్తు బాప్తిస్మం పొందారు గాని ఆయనకు బాప్తిస్మం ఇచ్చిన యోహానుగారు బాప్తిస్మం పొందనే లేదు.
“క్రీస్తు పై నీ విశ్వాసానికి తొలిమెట్టు బాప్తిస్మముతో ప్రారంభమవుతుంది”
నాలుగవ భాగము – బైబిలులో ఎవరెవరు బాప్తిస్మము పొందారు?
నాలుగు సువార్తలను ధ్యానించినప్పుడు మొట్టమొదట యూదయ దేశస్థులందరును, యెరూషలేమువారందరును బాప్తిస్మం పొందారు (మార్కు 1:5). పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట మత్త 3:7 లో మనకు కనబడుచున్నది. ఆ తదుపరి మత్త 3:16 ప్రకారం యేసు క్రీస్తు వారు బాప్తిస్మం పొందారు. సుంకరులును బాప్తిస్మము పొందవచ్చియున్నారు (లూకా 3:12) అని వ్రాయబడియున్నది. ఐతే పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును బాప్తిస్మము పొందలేదు (లూకా 7:30).
ఆరంభించిన బాప్తిస్మమిచ్చు యోహాను గారు యెరూషలేమువారికిని యూదయ వారికిని యొర్దాను నదీప్రాంతముల వారికిని యొర్దాను నదిలో బాప్తిస్మము ఇవ్వనారంబించినారు (మత్త 3:6). అలాగే యేసు క్రీస్తు వారు మత్త 3:13 ప్రకారము యోహాను గారి దగ్గరకే వచ్చి బాప్తిస్మము పొందినారని వ్రాయబడియున్నది. అక్కడ నుండి బయలు వెళ్ళిన యోహాను గారు సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక అక్కడ కూడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మముపొందిరి (యోహా 3:23). అలాగే పేతురు గారు బోధించినప్పుడు అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి (అపో 2:41).
యేసు ఆజ్ఞాపించిన విధంగా శిష్యుడుగా జీవించాలంటే విశ్వసించాలి. బాప్తిస్మము పొందాలి ఆయన బోధనలను అనుసరించాలి. ఇది ఆది సంఘముల ఆచరణ. అదే ప్రకారము ఫిలిప్పు దేవుని రాజ్యమునుగూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించు చుండగా వారతని నమ్మి, పురుషులును స్త్రీలును బాప్తిస్మము పొందిరి (అపో 8:12). ఐతియొపీయుల రాణియైన కందాకే క్రింద మంత్రియై ఆమెయొక్క ధనాగారమంతటి మీదనున్న ఐతియొపీయుడైన నపుంసకుడు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చినప్పుడు ఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మ మిచ్చుటకు ఆటంకమేమని అడిగెను, ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మ మిచ్చెను. (అపో 8:36-38). అననీయ వెళ్లి ఆ యింట ప్రవేశించి , పౌలుగారి మీద చేతులుంచి .... అప్పుడే అతని కన్నులనుండి పొరలవంటివి రాలగ దృష్టికలిగి, లేచి బాప్తిస్మము పొందెను (అపో 9:18). లూదియయను దైవభక్తిగల యొక స్త్రీయు ఆమె యింటివారును బాప్తిస్మము పొందిరి (అపో 16:15). చెరసాల నాయకుడు రాత్రి ఆ గడియలోనే అతని ఇంటివారందరితో కూడా పౌలు సీలల ద్వారా బాప్తిస్మము పొందిరి (అపో 16:25-33). కొరింథీయులలో అనేకులువిని విశ్వ సించి బాప్తిస్మము పొందిరి (అపో 18:8). ఐతే, వీరంతా యే వయస్కులు ఏయే సమయాలలో ఎంత లోతైన నీళ్ళలో బాప్తిస్మము పొందారు అనే విషయములు మరుగై యున్నవి.
“బాప్తిస్మము యేసు క్రీస్తు తో మరణానుభవమ”
అయిదవ భాగము – నీటి బాప్తిస్మము
బాప్తిస్మము అనే పదం గ్రీకు భాషలో మునుగుట (Immerse) లేదా ముంచుట (dip) అనే సంగతులను ముందున్న భాగాలలో నేర్చుకున్నాము. అయితే ఈ నీళ్ళలో వ్యక్తిగతంగా ముంచే ప్రక్రియే బాప్తిస్మము. ఇది ఒక గుర్తు. ఒక వ్యక్తి యేసు క్రీస్తు సువార్తను అంగీకరించాడు అనుటకు ఋజువు మరియు వారి నూతన జీవన విధానంలో గుర్తించబడటానికి గుర్తు. బహిరంగంగా ఆ వ్యక్తి తన జీవితం క్రీస్తువైపు నడిపిస్తున్నాడన్నా సంగతులకు బాప్తిస్మము సూచనగా ఉంటుంది. ఉదాహరణకు ఒక క్రైస్తవేతరుడు క్రైస్తవునిగా మారినప్పుడు ఆ వ్యక్తి నీటి బాప్తిస్మము తీసుకోవాలి.
యేసు ఆజ్ఞాపించిన విధంగా శిష్యుడుగా జీవించాలంటే సంపూర్ణంగా విశ్వసించాలి, బాప్తిస్మము పొందాలి ఆయన బోధలు అనుసరించాలి. ఇది ఆది సంఘముల నుండి వస్తున్నటువంటి ఆచరణ. ఈ ఆచరణ రెండు విషయాలకు గుర్తు. మొదటిది బాప్తిస్మము తీసుకునేవాడు క్రీస్తుకు మరియు తన సందేశాలకు బహిరంగముగా గుర్తించబడాలి. నీటిలో మునిగి లేచుట ద్వారా క్రీస్తు మరణ పునరుత్థానములకు గుర్తు. క్రొత్త జీవితము కొరకై పునరుత్థానుడయ్యాడని అర్ధం. రెండవదిగా ఆ వ్యక్తి నూతన సమాజంలో గుర్తించబడుట. ఎప్పుడైతే అతడు నీటిలోనుండి బయటకి వస్తాడో, ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారు అతనిని హత్తుకొనుటవలన విశ్వాస సమాజంలో, అనగా యేసు క్రీస్తు సార్వత్రిక సంఘంలో క్రొత్త కుటుంబంలో సభ్యుడవుతాడు.
బాప్తీస్మ సాక్ష్యము లేకుండా దేవుని సంఘంలో సభ్యునిగా ఉండాలని కొంత డబ్బు చెల్లించి పొందే సభ్యత్వం స్వప్రయోజనాలకే గాని దేవునికి అది ఘనతను తెచ్చి పెట్టకపోగా క్రీస్తు సంఘంలో మనకు పాలుపంపులు లేనట్టేనని గమనించాలి. సంఘములో నూతన జన్మ పొందిన వారితో కలిసి బహిరంగముగా గుర్తిపు పొందుటకు యేసు క్రీస్తు ద్వారా కలిగే పాపక్షమాపణ యందు విశ్వాసముంచాడనుటకు బాప్తీస్మమనేది ప్రాముఖ్యమైనది. ఆ తరువాతనే నూతనంగా మారిన వ్యక్తి కుటుంబాల కుటుంబమైన సంఘములో చేర్చబడుతాడు. ఇది దేవుడు నిర్ణయించిన ప్రక్రియ. మనము దీనిని పాటించబద్దులమై యున్నాము.
“క్రీస్తును సొంత రక్షకుడిగా మన తీర్మానం బాప్తిస్మమే దానికి ఋజువు”
ఆరవ భాగము – నీటి బాప్తిస్మము ప్రాముఖ్యత
బాప్తిస్మము అనేది వివాద అంశము, ఒక విషయం గుర్తుంచుకోవాలి బాప్తిస్మము అనేది దేవుని సంఘము నుండి ప్రత్యేకించబడి వేలుపటికి సంబంధించినది కాదు ఇది సంఘంలో ప్రవేశించుటకు బాప్తిస్మము అనేది ఎంతో ప్రాముఖ్యమైన గుర్తు, వారు యేసు క్రీస్తు ప్రభువును విశ్వసించవచ్చు. నమ్ముట ద్వారా ఎవరూ కృంగిపోరు, ఒక వేల వారు బాప్తిస్మము పొందితే వారి మీదికి అవమానము వచ్చును. సహజంగా వారు కుటుంబములో నుండి త్రోసివేయబడతారు. వారసత్వము లేనివారైపోతారు, వారి కొరకు మరణ గీతం పాడబడుతుంది. యేసు క్రీస్తును విశ్వసించినందుకు ఇటువంటి సందర్భాలను బాప్తిస్మము పొందుకున్నందుకు సమాజంలో ఎదుర్కోవలసి వస్తుంది. సమాజం నుండి వేరుచేయబడడం జరుగుతుంది. అయితే, బాప్తీస్మమనేది విడదీయలేని బంధం.
క్రీస్తులో చేర్చబడడం బాప్తిస్మము. క్రీస్తులో చేర్చబడడం సంఘంలో సభ్యత్వం పొందడం. కాబట్టి సంఘములో చేర్చబడకుండా ఏమాత్రం సంఘ విషయాలలో జోక్యం చేసుకోలేరు. అదే పెంతెకోస్తు దినాన కూడా జరిగింది. పేతురు యొక్క బోధకు స్పందించిన వారు బాప్తిస్మము పొంది సంఘములో చేర్చబడ్డారు. “కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి. (అపో 2:41)”. పరిశుద్ధుడైన లూకా దీని విషయమై అంత ఆకర్షింపబడక పొయినట్లైతే క్రొత్త విశ్వాసుల లెక్కను అంతగా స్పష్టంగా ఇవ్వలేడు. వారి ముఖములు గుర్తింపబడినవి, వారి పేరులు సంఘములో కలుపబడినవి. యేసు క్రీస్తు స్వతహాగా చెప్పిన నీతి విషయమై జీవించవలసిన అవసరత ఆనాడు ఆది సంఘం నుండి నేర్చుకొనగలం.
బాప్తీస్మమనేది నీటికి, వాక్యానికి సంబంధించిన పని. గ్రీకు భాషలో బాప్టిజో (Baptizo) అంటే ముంచుట క్రియా రూపకంలో కడుగబడుట అని అర్ధం. త్రిత్వమైన దేవునితో విశ్వాసిని ఐక్యపరుస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో అనే మూడు పదాల కలయికగా అవుతుంది.
బాహ్యంగా కడుగబడే అంతరంగ మార్పు వంటి ప్రక్తియలు క్రైస్తవేతర మతాలలో కూడా ఈ కడగబడే నీతి సూత్రాలున్నవి. అయితే, క్రైస్తవ్యంలో అంతరంగిక మార్పు అంటే కేవలం విశ్వాసము మాత్రమేగాక యేసు క్రీస్తును బట్టి హృదయంలో ఒక బలమైన తీర్మానం కలిగియుండడం. ఈ మార్పు అనేది ఒక ప్రత్యేకమైన నీతికాదు లేక ప్రత్యేకమైన నీతిపై ఆధారపడడం కాదు. మన హృదయంలో దేవునికి స్థానం లేకపోయినట్లయితే నీతి అనేది ఎక్కడా పనికి రాదు. అపోస్తలుల బోధ కూడా ఇదే. ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము అప్పుడు నీవు రక్షించబడతావు అని బోధించారు. (అపో 16:14 లో) . చివరిగా బాప్తీస్మమనే ఆచరణ యేసు క్రీస్తును సంతోషపరచడమే.
“బాప్తిస్మము క్రైస్తవుని నూతన జీవన శైలికి పునాది”
ఏడవ భాగము – పరిశుద్ధాత్మ బాప్తిస్మము
నీటి బాప్తిస్మము ద్వారా బహిరంగంగా మన రక్షణకు గుర్తుగా ఏర్పడి క్రీస్తు అనే సంఘంలోనికి చేర్చబడుతుంది. అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఈ ప్రక్రియను పరిపూర్ణం చేస్తుంది. అనగా, నూతన విశ్వాసి క్రీస్తులో ఐక్య పరచి, సహా విశ్వాసులతో అనగా క్రీస్తు శరీరంలో పాలుపంపులు కలుగజేస్తుంది. పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవం అత్యంత ప్రాముఖ్యమైనది.
అపో.పేతురు గారు ప్రకటింప మొదలు పెట్టినప్పుడు మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు (అపో 2:38) అని చెప్పారు. అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి (అపో 2:41). ఆశ్చర్యమైన సంగతి ఏమనగా పేతురు కైసరయలో ఉన్నప్పుడు అతని బోధ విన్నవారందరిమీదికి బాప్తిస్మము లేకున్ననూ మొదట వారి మీదికిపరిశుద్ధాత్మ దిగెను (అపో 10:44-48) ఆ తదుపరి యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందిరి.
అపొల్లో కొరింథులో మరొక ఆశ్చర్యమైన సంగతి జరిగినది ఏమనగా; యోహాను మారు మనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెనని వారికి వివరించి ఆ వెనుక వచ్చిన యేసును గూర్చి బోధించి ప్రభువైన యేసు నామమున మరలా బాప్తిస్మమిచ్చెను (అపో 19:1-5). అయితే అంతకు ముందు వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. యేసును గూర్చి విని బాప్తిస్మము పొందిన తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి (అపో 19:6). యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితివిు. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతివిు. 1కొరింథీ 12:13 ప్రకారం అపో.పౌలు “మనమందరము” అనే ఐక్యత కలిగిన మాటలు పరిశుద్ధాత్మ బాప్తిస్మము యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం యేసు క్రీస్తు శరీరము మరియు రక్తమునకు సాదృశ్యమైన బల్లలో చేయివేయుటకు అర్హతను పొందే అనుభవాన్ని వివరిస్తూ ఉన్నాడు.
“బాప్తిస్మానుభావం నూతన జీవితానికి ఆవిర్భావం”
ఎనిమిదవ భాగము – పరిశుద్ధాత్మ బాప్తిస్మము ప్రాముఖ్యత
“ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే” (ఎఫేసీ 4:5) అనే భావన క్రీస్తు శరీరంలో జత చేయబడిన విశ్వాసులు ఒకే గుంపుగా చేర్చబడి, క్రీస్తుతో కూడా సిలువ వేసిన అనుభవం వైపు (అనగా అగ్ని బాప్తీస్మం) నడిపించబడుట పరిశుద్ధాత్మ బాప్తిస్మముతో నిర్ధారించబడి పరిపూర్ణం అవుతుంది.
పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందామనే నిర్ధారణ మన ఆత్మఫలములనుండి వెల్లడి చేయబడుతుంది. నేనంటాను, ఆత్మవరములకంటే ఆత్మఫలములు ప్రాముఖ్యమైనవి. మనము విశ్వాసముగలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము.(గలతి 5:5). అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.(గలతి 5:22). ఈ ఫలములు ఫలించు జీవితాలు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందారని నిర్ధారించబడడమే కాకుండా ఆత్మవరములను పొందే అనుభవం వైపు నడిపించబడతారు.
మనము ఆత్మ ననుసరించి జీవించువారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. .(గలతి 5:25). ఈ అనుభవం అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. ఇట్టి అభిషేక శక్తి యేసు క్రీస్తు చెప్పిన విధంగా మనం పొందగలం అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును (యోహాను 16:13).
పరిశుద్ధాత్మ బాప్తిస్మము మన జీవితాలను ప్రక్షాళన చేయడమే కాదు గాని నిత్యత్వానికి మనలను నడిపించు మన జీవన ప్రయాణంలో దేవుని కాపుదలతో పాటు క్రీస్తును చేరుకునే అర్హతను దయజేసేదిగా ఉంటుంది. అరణ్య మార్గంలో ఇశ్రాయేలీయులు మేఘములో నడచుట పరిశుద్ధాత్మ బాప్తిస్మమునకు అనగా దేవుని కాపుదలలో వారు నడచినట్టు అపో.పౌలు వివరిస్తూ ఉన్నారు (1 కోరింథీ 10:2). మరియు 1 కొరిం 2:13 ప్రకారము ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. (15వ) ఆత్మసంబంధియైనవాడు అన్ని టిని వివేచించును గాని అతడెవనిచేతనైనను వివేచింపబడడు అని గ్రహించాలి. ఇదే పరిశుద్ధాత్మ బాప్తీస్మలోని గొప్పతనం, మనం పొందే అనుభవం.
“పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందామనే నిర్ధారణ మన ఆత్మఫలములనుండి వెల్లడి చేయబడుతుంది”
తొమ్మిదవ భాగము – పరిశుద్ధాత్మ బాప్తిస్మము అభిషేక శక్తి
"దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను" అపొ 10:38. అభిషిక్తుడైన యేసుక్రీస్తు ఆపవాదిని గద్ధించాడు, అపవాది చేత పీడించబడిన వారిని విడుదల చేసాడు, అనేకవిధములైన రోగములను స్వస్థపరచాడు. యేసుక్రీస్తు పొందినటువంటి అభిషేక అనుభవాన్ని మనము కూడా పొందగలమనే నిరీక్షణ గలవారమైయున్నాము. అట్టి అభిషేక అనుభవంలో పరిశుద్ధాత్మ మనకు సమస్తమును బయలుపరచి సత్యమును బోధించేదిగా ఉంటుంది. సత్యస్వరూపియైన ఆత్మ ద్వారా సత్యమును యెరిగిన మనం సర్వసత్యములోనికి నడిపించే గొప్ప అనుభవాన్ని పొందగలం.
అంతేకాకుండా, 2 పేతురు 1:3-4 ప్రకారం, దేవుని స్వభావమునందు మనం పాలివారమవుటకు తన అనుభవజ్ఞానమును మనలో నింపి మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి యున్నాడని గ్రహించాలి.
దేవుని స్వభావం పొందుకోవడం పరిశుద్ధాత్మ బాప్తిస్మముతోనే సాధ్యం. దేవుని స్వభావం పొందుకున్న మనం ఆ శక్తి సామర్ధ్యాలను వీక్షించేవారంగా కాక, ఆ శక్తిని పొంది అనుభవించేవారముగా దేవుడు మనలను ఎన్నుకున్నాడన్న సంగతి గ్రహించాలి. దేవుని శక్తి మనలో పనిచేయడానికి పరిశుద్ధాత్మ చాలా అవసరం. దేవుడు విశ్వాసిలో నివసించే పరిశుద్ధాత్మ ద్వారా సమస్తాన్ని జరిగిస్తాడను మాట సత్యమైనది.
నేనంటాను, పరిశుద్ధాత్మతోనూ శక్తితోను దేవుడు మనలను అభిషేకించడానికే ఏర్పరచుకొని, తన స్వరక్తమిచ్చి కొన్నాడు. పరిశుద్ధ గ్రంధంలోని ప్రతి వాగ్ధానాలను మన జీవితాల్లో నెరవేర్చడానికి పరలోక శక్తి సామర్ధ్యాలను, భూలోక శక్తి సామర్ధ్యాలను మనలో అనుదినం నింపి, మన జీవితాలకు సంబంధమైన ప్రతి వాగ్ధానం నెరవేర్చబడ్డానికి తనదైన అభిషేక శక్తి సామర్ధ్యాలను పరిశుద్దాత్మ ద్వారా మనకు దయజేస్తున్నాడు.
రోజువారి జీవితంలో ఏ పనిచేస్తున్నా మన దేవుని స్వభావ సిద్ధమైన దేవుని శక్తిలో జీవించేవారముగా ఉన్నామని విశ్వసించాలి. యేసుక్రీస్తు నేర్పిన అభిషేక అనుభవాన్ని మనం కూడా అలవరచుకొని అనుదిన క్రైస్తవ జీవన శైలిలో ఇట్టి అభిషేక శక్తి సామర్ధ్యాలను పెంపొందించుకొవాలనే ఉద్దేశం కలిగియుందము.
“అంతర్గత విశ్వాసం యొక్క బాహ్య వ్యక్తీకరణ బాప్తిస్మము”
పదియవ భాగము – పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఆత్మీయ వరములు
యేసు క్రీస్తు ఆరోహణమవుతున్నప్పుడు తరువాత తన శిష్యులకు అగుపడి “అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కాబట్టి, మీరు యెరూషలేములో, యూదయ సమరయ దేశాల్లో, ప్రపంచమంతటా నాకు సాక్షులుగా ఉంటారు” (అపో.కా 1:8). అనే మాట చెప్పి ఆరోహణమయ్యాడు. అపో.కా 2:3 ప్రకారం పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్న వారందిలో ఒక వినూత్నమైన వాక్‌శక్తిని అక్కడ గమనించగలం. ఈ శక్తి ఆత్మీయ వరములకు సాదృశ్యంగా ఉంది. అంతేకాదు, ఎవరికీ అర్ధము కాని భాషలో లేదా శబ్దాలతో వారు మాట్లాడలేదు గాని “ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని” (అపో. 2:6) లో స్పష్టంగా గమనించగలం.
అదే అధ్యాయాన్ని అపో. 2ను క్షుణ్ణంగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న శిష్యులు ఆత్మీయ వరములను పొందుకున్నారు. ఈ వరములు ప్రవచనవరం, దర్శనాలను వివరించే వరం, యేసుక్రీస్తు నామంలో సూచకక్రియలను చేసే వరం మొదలగునవి. యోవేలు 2:28 ప్రకారం అంత్యదినములలో దేవుని ఆత్మ కుమ్మరించబడినప్పుడు ఇట్టి వరములను పొందుకుంటామనే వాగ్దానం మనకున్నది. అపో. 2:17 ప్రకారం ఆనాడు శిష్యులు పొందుకున్న శక్తి నేడు మనము కూడా పొందుకోగలమని నిర్ధారించబడింది.
ఈ ఆత్మీయ వరములు పొందుకున్న అనుభవం క్రీస్తును గూర్చిన సువార్తను అనేకులకు ప్రకటించుటకు సంసిద్దులమవుతాము. ఈ వరములు చీకటిలో ఉన్నవారిని, మరణచ్ఛాయలోను ఉన్నవారిని విడిపించి వారికి వెలుగు దయచేయగల శక్తి దానికి ఉన్నదని గమనించాలి. అంత్యదినాలలో దేవుని ప్రణాళికలను బయలుపరచే ప్రవచనాత్మక వరములతో సంఘములను తన రాకడ కొరకు సంసిద్దులనుచేసే శక్తి దానికున్నదని గమనించాలి. రోగ పీడితులను, అనారోగ్యము గల వారిని యేసు నామంలో స్వస్తపరచగల శక్తి కూడా ఈ వరములకున్నవని గమనించాలి.
అపోస్తలుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో మరియు ప్రార్ధనలో ఎడతెగక ఉన్నప్పుడే ఇట్టి ఆత్మీయ వరములను పొందగలము. ఆది అపోస్తలులు ఇట్టి క్రమమును పాటించారు కాబట్టే సంఘాలుగా విస్తరించబడి అనేకులను ప్రభువు వైపు నడిపించింది. ఇది మన బాధ్యత.
“పరిశుద్ధముగా జీవించాలంటే మొదట దేవుని నుండి క్రొత్త జీవితాన్ని పొందాలి.
అది బాప్తిస్మముతోనే సాధ్యం”
పదకొండవ భాగము – అగ్ని బాప్తిస్మము
నీటి ద్వారా మరియు పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మము అనే పదములు కాస్త సుళువుగా అనిపించినప్పటికీ, అగ్ని బాప్తిస్మము అనే మాట కొంత సందేహానికి దారి తీస్తుంది, మరియు గందరగోళంగా అనిపిస్తుంది. నీటిలో మునిగితే నీటి బాప్తిస్మము అన్నట్లు అగ్ని చేత కాల్చి వేయబడితే అగ్ని బాప్తిస్మము అనే సందేహం ఖచ్చితంగా ఉంటుంది.
అపో.కా 2 వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినమున శిష్యులందరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొన్నవారిపై అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ (అపో.కా 2:3) వారు ఒక వినూత్నమైన శక్తిని పొందినట్లు గమనించగలం. ఇక్కడ అగ్నిజ్వాలలవంటి నాలుకలు అగ్ని బాప్తిస్మమునకు సాదృశ్యము కాదని గమనించాలి. అపో.కా 2:3 లో స్పష్టంగా వ్రాయబడియుంది వారు పరిశుద్ధాత్మ శక్తిని మాత్రమే పొందుకున్నారు.
వాస్తవానికి పరిశుద్ధ గ్రంధంలో అగ్ని బాప్తిస్మము ఎలా పొందుకోవాలో ఖచ్చితంగా వివరించబడలేదు. అయితే క్షుణ్ణంగా మత్తయి 3:11,12 ధ్యానిస్తూ ఉన్నప్పుడు “ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను”. ఈ మాటలను బట్టి అగ్నితో మనం పొందుకునే బాప్తిస్మము వివరించబడింది.
యేసు క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన మన జీవితాల్లో ఇంకా ఏదైనా మలినము మష్టు ఉన్నట్లయితే అది మనలను ప్రక్షాళన చేస్తూ సంపూర్ణమైన విశ్వాసిగా సంసిద్ధులను చేస్తుంది. పాత నిబంధన కాలంలో పాపపరిహారార్ధ బలి అర్పణలో యాజకుడు బలిపీఠంపై బలిని సిద్ధపరచి నిర్దోషమైనదానిని ఆ యాజకుడు బలిపీఠంపై అర్పించినప్పుడు, అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. యెహోవ - అగ్ని చేత అది కాల్చబడి, ఆ దహనబలి సువాసనను దేవుడు ఆఘ్రాణించి మనయెడల తన కనికరాన్ని చూపుతూ మనలను క్షమిస్తూ ఉన్నాడు. అదేరీతిగా, విరిగి నలిగిన మన హృదయాలను దేవునికి సమర్పించుకున్నప్పుడు; మన జీవితాలు ఇంపైన సువాసనను కలుగజేసి దేవునిని సంతోషపెట్టేవిగా ఉంటాయని గ్రహించాలి. ఈ అనుభవం సజీవయాగంగా మనలను మనం సమర్పించుకున్నప్పుడే సాధ్యమవుతుంది. ఈ అనుభవమే అగ్ని చేత మనం పొందుకునే బాప్తిస్మము.
“రక్షణ ద్వారా గతం క్షమించబడింది, మన వర్తమానానికి అర్ధం ఇవ్వబడింది
మరియు భవిష్యత్తు సురక్షితం. బాప్తిస్మం దీనికి ఆదారం.”
పన్నెండవ భాగము – అగ్ని బాప్తిస్మము ప్రాముఖ్యత
అగ్ని చేత బాప్తిస్మము పొందే ఈ ప్రక్రియలో శ్రమల ద్వారా మన జీవితాలు పరీక్షించబడతాయి. ఈ ప్రక్రియ విశ్వాస జీవితంలో పరిపూర్ణులగుటకు ఆఖరి మెట్టు. అపో.పౌలు తన అనుభవాన్ని రోమా సంఘానికి వివరిస్తూ - శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నదని స్పష్టం చేశాడు (రోమా 5:3-5).
క్రైస్తవ విశ్వాసంలో శ్రమ అనేది ఓ వినూత్నమైన అనుభవం. శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి దూషించి విశ్వాసాన్ని మధ్యలోనే వదిలేసినవాళ్లు అనేకులు ఉన్నారు. వీరు బాప్తిస్మ అనుభవం పొందినప్పటికీ కొంత లోకాంలో మరియు కొంత దేవునిలో ఉండేవారు. ఎందుకంటే వీరికి శ్రమలు ఎదుర్కోవడం కష్టతరం. ఆ శ్రమను దాటడానికి వ్యక్తిగత నిర్ణయాలతో కూడిన మార్గాలను వెతుక్కుంటారు. కాని ఆ అనుభవంగుండా వెళ్ళడానికి ప్రయత్నించరు. అయితే ఎటువంటి శ్రమ వచ్చినా, అగ్నివంటి శ్రమ కలిగినా, అది చివరకు మరణమైనా లెక్కచేయనివాళ్ళు కొందరుంటారు. వీరే దేవునికి కావలసినవాళ్లు.
క్రైస్తవుడు అగ్నివంటి శ్రమలద్వారా పరీక్షించబడుతాడు. ఇదేమి వింత కాదు అని పేతురు వివరిస్తూ, (1 పేతురు 4 : 12)ఈ శ్రమ "క్రీస్తులో మనకున్న విశ్వాసాన్ని పరీక్షించడాన్ని సూచిస్తుంది" అని జ్ఞాపకము చేస్తున్నాడు. బంగారము కొలిమిలో వేయబడినప్పుడు, మలినము మష్టు అగ్నిలో కాల్చివేయబడి శుధ్ధమైన మేలిమైన బంగారంగా తయారవుతుంది. అలాగే శ్రమలగుండా ప్రయాణిస్తున్నప్పుడు మన విశ్వాసము పరీక్షించబడి పరిశుద్ధమైన వారముగా రూపాంతరమెందుతాము .
అనేక రకములైన శ్రమ కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న సమాజంలో... బాధలు, నిందలు, అవమానాలు మరియు సామాజిక బహిష్కరణలను ఎదుర్కోనవలసి వస్తుంది. ఈ శ్రమానుభవంలో మారణాన్ని కూడా లెక్క చేయని హతసాక్షులు క్రీస్తుకు మరింత దగ్గర చేరుకునే అనుభవాన్ని పొందారు. ఇట్టి శ్రమలను దేవుడు మన జీవితంలో అనుమతిస్తారు ఇది దేవుని చిత్తం.
శ్రమలు మనలను క్రీస్తులో మరింత బలపరచబడటానికే గాని కృంగదీయడానికి కాదు. అగ్నివంటి శ్రమలు చివరకు మరణానికి దారి తీసినా క్రీస్తును చేరుకుంటామనే నిరీక్షణను పెంపొందింపజేస్తుంది. శ్రమలో సహనం బలపరచబడాలి. అంటే క్రీస్తు మనతో ఉన్నాడనే విశ్వాసం ఆ దేవుని సన్నిధిలో ఉన్నామనే నిశ్చయత కలుగచేస్తుంది. ఆయనతో మనము కలిగియున్న సాన్నిహిత్యం మన హృదయానికి కలిగిన గాయములను అందులోని వేదననుండి స్వస్థత కలుగజేస్తుంది.
గనుక దేవుడు... మనకు కలిగే ప్రతీ వేదనలోను, మనము పొందే ప్రతి శ్రమలోను మనకు తోడై ఉంటాడనే నమ్మకం మనకుంటేనే కదా విశ్వాసములో మరింత బలము పొందగలము. ఇట్టి విశ్వాసమే మనలను నీతిమంతులుగా చేస్తుంది. నీతిమంతుడుగా తీర్చబడాలంటే క్రీస్తుతో శ్రమపడిన అనుభవం కావాలి. ఈ అనుభవమే అగ్ని బాప్తిస్మం పొందుకున్నామనుటకు ఋజువు.
“బాప్తిస్మము ఫలవంతమైన నీ హృదయానికి ప్రారంభ దశ”
చివరి భాగము – బాప్తిస్మము లేకపోతే పరలోక ప్రవేశం లేదా?
బాప్తిస్మమనేది యేసు ప్రభువు ఇచ్చిన నియమాలలో ఒకటి. బాప్తిస్మము కంటే ప్రాముఖ్యమైనది మన పాపములను ఒప్పుకొని విడుదల పొందడం, యేసు క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించడం, ఇదే రక్షణ. క్రైసవ విశ్వాసానికి రక్షణ సంచకరువు లాంటిది. పరలోక రాజ్యం చేరాలంటే రక్షణ అనివార్యం. రక్షణ అనుభవం లేకుండా పరలోకం చేరుకోవడం అసాధ్యం.
రక్షించబడిన మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఎట్టి జీవన శైలిని కలిగియుండాలో యేసు క్రీస్తు ప్రభువు జీవించి చూపించాడు. మనం పొందుకున్న రక్షణను బహిర్గంగా వెల్లడి చేయుట, ఒక సంఘములో చేర్చబడి పరిశుద్ధులతో సహవాసం కలిగియుండుట – మొదటి మెట్టు. ఇక రెండవ ప్రాముఖ్యమైన నియమం; పరిశుద్ధ బల్లలో పాలు పొంపులు కలిగియుండుట. ప్రతి సంఘం ఈ క్రమమును పాటించాలని పరిశుద్ధ గ్రంధం సెలవిస్తుంది. పరిశుద్ధ బల్లలో పాల్గొనుట అనగా పూర్తిగా క్రీస్తును అనుసరించుటయే. ఆయన సిలువలో సైతము పాలుపొంపులు పొందుటయే. క్రీస్తువారు చూపిన ఆత్మీయ మాదిరి మనకు ఎంతో అవసరమై యున్నది. అది, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గము, అనగా నూతనమైనది, జీవముగలది (హెబ్రీ 10:19). జీవమార్గము అనుసరించి చూపించిన యేసుక్రీస్తువారే బాప్తిస్మమిచ్చు యోహాను దగ్గరికి... యోర్దాను నదికి రావటము మనం గమనించుకోవాలి. అప్పుడే కదా, లోక పాపములు మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినది.
కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగాచేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మియ్యుడని (మత్తయి 28:19) యేసు క్రీస్తు వారు నియమించిన ఆజ్ఞకు లోబడే వారంగా ఉండాలి. కాబట్టి సంఘం దీనిని కోరుతుంది. అయితే, బాప్తిస్మము యేసు క్రీస్తు సంఘంలో చేర్చబడుటకు మనం పొందుకునే అర్హత. పరలోక రాజ్యం చేరాలంటే రక్షణ ఒక్కటే మార్గం. రక్షించబడిన మనం క్రీస్తులో అనుదినం వృద్ది చెందాలంటే సంఘంలో సహవాసం కలిగియుండడం అత్యంత అవసరం. చివరిగా బాప్తిస్మము అనే ఆచరణ మూలమేమనగా యేసు క్రీస్తు ప్రభువును సంతోషపరచడమే.
మరణానికి చేరువలో ఉన్నప్పుడు సిలువపై దొంగ తన పాపములను కప్పుకోక ఒప్పుకున్నాడు, రక్షణను పొందుకున్నాడు కాబట్టే బాప్తిస్మము లేకుండానే క్రీస్తుతో కూడా పరదైసులో ఉండే భాగ్యాన్ని పొందుకున్నాడు. “నేను ఈ లోకంలో నా ఇష్టాను సారంగా జీవించి నా జీవితపు ఆఖరి ఘడియల్లో పాపములను ఒప్పుకొని ఈ దొంగవలె చివరి ఘడియల్లో క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరిస్తే పరలోకం చేరుకుంటాను” అనే ఆలోచన అత్యంత ప్రమాదకరం, అది ఎప్పటికీ సాధ్యం కాదు. రక్షణ అనుభవం లేకుండా పొందుకునే బాప్తిస్మం, వివాహాల కోసం పొందుకునే బాప్తీస్మం, తెలిసి తెలియని వయసులో పొందుకునే చిలకరింపు ఇవన్ని పరలోకం చేర్చలేవు.
కాబట్టి, రేపేమి సంభవించునో నీకు తెలియదు గనుక సమయముండగానే క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించుకొని, రక్షణానుభావంలో మన జీవితాలను యేసు క్రీస్తు నేర్పిన జీవన శైలిని కలిగియుంటేనే ఆయన రాకడ ఎప్పుడు వచ్చినా ఆయను ఎదుర్కొని ఆయనతో నిత్యత్వంలో ఉండే విశ్వాసాన్ని కలిగియుంటాము. ఇవ్విధముగా యేసు క్రీస్తు ప్రభువును సంతోషపరచే జీవితం జీవించుటకు ప్రయత్నం చేద్దామా?
దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక! ఆమెన్.
“బాప్తిస్మము అనే ఆచరణ మూలమేమనగా యేసు క్రీస్తు ప్రభువును సంతోషపరచడమే.”
c…….c
Audio Version
- మొదటి భాగము - ఎందుకు ప్రాముఖ్యము?
- రెండవ భాగము - బాప్తిస్మము అనగా నేమి?
- మూడవ భాగము - యేసుక్రీస్తు వారు ఎటువంటి బాప్తిస్మము పొందారు?
- నాలుగవ భాగము – బైబిలులో ఎవరెవరు బాప్తిస్మము పొందారు?
- అయిదవ భాగము – నీటి బాప్తిస్మము
- ఆరవ భాగము – నీటి బాప్తిస్మము ప్రాముఖ్యత
- ఏడవ భాగము – పరిశుద్ధాత్మ బాప్తిస్మము
- ఎనిమిదవ భాగము – పరిశుద్ధాత్మ బాప్తిస్మము ప్రాముఖ్యత
- తొమ్మిదవ భాగము – పరిశుద్ధాత్మ బాప్తిస్మము అభిషేక శక్తి
- పదియవ భాగము – పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఆత్మీయ వరములు
- పదకొండవ భాగము – అగ్ని బాప్తిస్మము
- పన్నెండవ భాగము – అగ్ని బాప్తిస్మము ప్రాముఖ్యత
- చివరి భాగము – బాప్తిస్మము లేకపోతే పరలోక ప్రవేశం లేదా?
- All in One