క్రిస్మస్ సందేశం


  • Author: Rev John Babu Kurma
  • Category: Messages
  • Reference: Sajeeva Vahini Vol 2 Issue 2

“ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు.” లూకా 2:10,11

2000 సంవత్సరాల క్రితం బెత్లెహేము నగర ఆకాశ వీధుల్లో దేవదూతల గణముళ చేత ప్రకటింపబడిన ఆనాటి సుమధుర సువార్తమానము నేటికిని విశ్వమంతటిలో తన భక్తుల ద్వారా ప్రకటింపబడుతూనే ఉంది.

ఇంతకీ ఏమిటా సువార్తమానం? దేవుని కుమారుడైన క్రీస్తు యేసు పరలోక వైభవాన్ని విడిచిపెట్టి, రిక్తునిగా జేసుకొని, నరావతారిగా ఈ లోకంలో జన్మించి పాపులైన ప్రతి మానవుని వారి పాపములనుండి రక్షించి, నరక బాధ నుండి తప్పించి పరలోక రాజ్యాన్ని దయచేస్తాడన్నదే ఆ సువార్తమానం.

నేను పాపిని కాదు గదా! నాకు రక్షణ అవసరం ఏమొచ్చింది? అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. రక్షణ ఎందుకు అవరసరం అయ్యింది అనగా! దేవుని చేత పవిత్రంగా సృష్టింపబడిన ఆదిమానవులగు హవ్వ ఆదాములు దేవుని ఆజ్ఞను మీరి పాపం చేశారు. ఫలితంగా పాపులకై నరక పాత్రులయ్యారు. దేవుని ఉగ్రతకు గురియై దేవుని పవిత్ర సహవాసాన్ని, సన్నిధిని పోగొట్టుకున్నారు. వారి ద్వారా పాపం ఈ లోకంలో ప్రవేశించింది. అనగా “ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణము అందరికి సంప్రాప్తమాయెను” అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం బయలు పరుస్తూ వుంది. (రోమా 5:12) అంతేకాదు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడని, ఏ బేధమును లేదు అందరూ పాపం చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారని వివరిస్తూ ఉంది. (రోమా 3:10,23) పాపమునకు వచ్చు జీతం మరణం, భౌతికంగా మరణించిన తరువాత పాపులందరికి దేవుని చేత తీర్పు తీర్చబడి మరణశిక్ష విధింపబడుతుంది. ఈ మరణశిక్ష నరకంలో వేయబడుట ద్వారా అమలు పరచబడుతుంది. ఈ నిత్య నరకం అగ్నిగంధకముల చేత భాదింపబడే స్థలం. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచు స్థలం (ప్రకటన 14:10,11) ఎందుకనగా అగ్ని ఆరదు పురుగు (ఆత్మ) చావదు” (యెషయా 66:24). ఇంత బాధాకరమైన నరక బాధనుండి రక్షింపబడుటకు మార్గం లేదా? దీనికి సమాధానం కొందరంటారు నరక శిక్షకు పరిష్కార మార్గం – మంచి నడవడిక, ఆచార వ్యవహారాలు, నిష్ట నియామకాలు, ధర్మకార్యాలు, సంఘ సేవ తదితరమైన కార్యాలు చేస్తే సరిపోదా అని. గాని పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే “ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది” (రోమా 3:20). గనుక మన నీతి క్రియలు మనలను పాపంనుండి రక్షించలేవని తేట తెల్లమగుచున్నది. ఈ సందర్భంగా బైబిలు వివరించు మహా సత్యం ఏదనగా “ఎవరి వలన రక్షణ కలుగదు, యేసు క్రీస్తు నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము”.(అపో.కా 4:12) పాపులను రక్షించుటకు జన్మించిన “రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు” (లూకా 2:11) అను ఈ సువార్తమానము సిలువలో కార్యరూపము దాల్చింది”. ఆయన మనందరి అతిక్రమ క్రియలనుబట్టి గాయపరచబడెను. ఆయన పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెహోవా మన అందరి దోషములను అతని (యేసు క్రీస్తు) మీద మోపెను. (యెషయా 53:5,6)

క్రీస్తు యేసు పాపముల నిమిత్తమై సిలువలో తన పవిత్ర రక్తాన్ని చిందించి, మరణించి, పాతిపెట్టబడి, మరణమును జయించి, మూడవనాడు సమాధినుండి మృత్యుంజయుడై తిరిగి లేచి మనకు రక్షణనిచ్చి మనందరి కొరకై తండ్రితో నిరంతరము విజ్ఞాపన చేయుచున్నాడు.

ఇంతటి గొప్ప రక్షకుడు జన్మించిన దినమే క్రిస్మస్. అయితే క్రీస్తును రక్షకునిగా అంగీకరించే విధమేమనగా

“మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల అయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక అయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రలనుగా చేయును “ (1యోహాను 1:9) మరియు “ప్రభువైన యేసునందు విస్వసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షింపబడుదురు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంది.

సహోదరి సహోదరుల్లారా మీరు పాపము నుండి రక్షింపబడవలెనని పరలోకరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఆశిస్తున్నారా? నేడే రక్షణ దినం. రండి క్రీస్తు యేసును రక్షకునిగా అంగీకరించండి. ఆయన రక్తము ప్రతిపాపము నుండి మనలను పవిత్రులనుగా జేయును . ఈ క్రిస్మస్ పర్వదినం మీ జీవితంలో నిజమైన రక్షణ దినం కావాలని శాంతి సమాధానములను, ఆశీర్వాదములను బహుమెండుగా క్రీస్తు ద్వారా మీరు పొందాలని కోరుకుంటూ .....