ఒకానొక రోజు ఒక మారు మూల కొండ ప్రాంతంలో కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ వున్నారు. అక్కడే వున్న లోయలో, వారికి ఎంతో ఉపయోగపడే కొన్ని అమూల్యమైన మూలికలున్నట్లు కనుగొన్నారు. కాని, అది చాల పెద్ద లోయ. అందువల్ల దానిలోనికి మనషులు దిగడం చాలా కష్టం. ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్న వారికి కొంత దూరంలో ఒక చిన్నవాడు గొర్రెలు మేపుకుంటూ కనిపించాడు. వారిలో ఒకరికి ఒక చక్కని ఆలోచన వచ్చింది. వెంటనే అది వారందరికీ చెప్పాడు. అది విన్నవారంతా బాగా ఆలోచించి ఆ చిన్నవాడిని పిలిచి, తమకొక చిన్న పని చేసిపెట్టాలని, దానికి బదులుగా చాలా డబ్బు ఇస్తామని చెప్పారు. ఏం చేయాలో చెప్పమని వాడు అడుగగా, వారు ఆ లోయలోకి దిగాలి అన్నారు. సరేనన్న చిన్నవాడు, ఎలా దిగాలి ? అని ప్రశ్నించాడు. వాని నడుమునకు తాడు ఒకటి కట్టి లోయలోనికి దించుతామని, దిగి ఆ మూలికల్ని కోసిన తరువాత పైకి తాడు సాయంతో లాగేస్తామని చెప్పారు. వాడు బాగా ఆలోచించి, తనకు కొంచెం సమయం ఇస్తే ఇంటికి వెళ్లి వెంటనే తిరిగి వచ్చేస్తానని చెప్పి ఇంటికి పరుగెత్తాడు.
వెళ్లి చాలాసేపయినా రాకపోయే సరికి, ఇక రాడేమో అని వారంతా నిరుత్సాహపడుతున్నంతలో, దూరంగా తనతో పాటూ నడవలేక నడుస్తున్న పండు ముసలివాడ్ని వెంట నడిపించుకుంటూ తీసుకొస్తూ కనిపించాడు. అది చూచిన వారంతా, ఆ వచ్చే ముసలివాని చేత ఆ పని చేయించేందుకే వెంట తీసుకోస్తున్నాడు అని కంగారుపడ్డారు. వాడు వచ్చి, తన వెంట వచ్చింది తన కన్నతండ్రి అని, ఆయన్ని తీసుకొచ్చేందుకే ఇంటికెళ్లానని చెప్పి, ఇక తాడు కట్టి లోయలోనికి దించమని సిద్ధమయ్యాడు.
అయితే నడుముకు తాడు కట్టిన తరువాత వాడు, ఆ తాడు కొనని తన తండ్రి చేతికిమ్మన్నాడు. ఒక్కసారిగా అందరూ నిర్ఘాంతపోయారు. వారికి అర్ధంకాక నవ్వుకుని వాడితో, ఇక్కడ బలంగా వున్న ఇంతమందినీ కాదని ఏ మాత్రం శక్తిలేని ఈ పండు ముసలివానికిమ్మని అడుగుతున్నావెందుకు ? అని ప్రశ్నించారు. దానికి వాడు బదులివ్వక, తాడు తన అయ్య చేతికిస్తేనే దిగుతానని, లేకుంటే దిగనని గట్టిగా చెప్పాడు. ఏ మాత్రం శక్తిలేని మీ అయ్యకి ఆ తాడిస్తే నిన్ను పైకి లాగలేక ఆ లోయలోకే వదిలేస్తాడని వారు ఎంత చెప్పినా వాడు వినలేదు సరిగదా, తాడు వాళ్ళ అయ్య చేతిలో పెట్టకపోతే లోయలోకి దిగేదే లేదని తెగేసి చెప్పేసాడు.
దానితో వారికి ఎటూ తోచక, వాడ్ని దించాలా వద్దా ? అని ఆలోచిస్తుండగా, వాడు సార్.. మీరేమీ ఆలోచించకండి. నా తండ్రి చేతికి ఆ కొననివ్వండి. నేనెందుకు ఇంత గట్టిగా మొరాయిస్తున్నానంటే, ఒకవేళ మీలో ఎవరైనా ఆ తాడు పట్టుకుంటే, లాగేందుకు శక్తి సరిపోకపోయినా, లేక ఏదైనా మృగం వచ్చినా నన్ను ఈ లోయలోనే వదిలేసి వెళ్లిపోవచ్చు. కానీ అదే ఆ తాడు నా తండ్రి చేతిలో వుంటే మాత్రం తన బలాన్నంతటినీ ఉపయోగించి నన్ను పైకి ఎలాగోలా లాగేస్తాడు. తనకు చేతకాక మరీ కష్టమైతే, ప్రాణాన్నైనా నా కోసం పణంగా పెట్టేస్తాడేమో కానీ నన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లోయలోకి మాత్రం జారవిడువడు అని అన్నాడు. వాడి మాటలకు నివ్వెరబోయిన వారంతా వాడు చెప్పినట్టే ఆ తాడుని తన తండ్రి చేతికే ఇచ్చి మెల్లగా ఆ లోయలోకి దించారు. వాడు దిగి, వారు అడిగినట్టే వారికి కావలసిన ఆ విలువైన మూలికల్నికోసిన తరవాత వాని తండ్రి వాడ్ని లోయలోంచి పైకి లాగేసాడు.