ప్రవర్తనలో పరిపక్వత
Audio: https://youtu.be/C7ueFnsoa3M
పక్షపాతాన్ని చూపించడము పిల్లల మధ్య విరోధానికి అతి పెద్ద కారణం అని పిల్లల వైద్య నిపుణులు తల్లిదండ్రులను హెచ్చరిస్తూ ఉంటారు. ఈ విరోధాలు ఎలా దారి తీస్తాయో మన ఊహలకు అందనివి. తన తండ్రికి ఇష్టుడైన కుమారుడైన పాత నిబంధనకు చెందిన యోసేపు దీనికి ఉదాహరణ. ఇందును బట్టి తనకంటే పెద్దవారైన అన్నలకు కోపం వచ్చింది (ఆది 37:3-4). ఆ చిన్నవాడైన యోసేపుపై తమ తండ్రి ప్రేమను ఓర్వలేక అతన్ని ఐగుప్తుకు ప్రయణమైపోతున్న వర్తకులకు అమ్మివేసారు. అంతేకాదు, ఒక దుష్టమృగము యోసేపును చంపివేసినట్లుగా తమ తండ్రి యెదుట చిత్రీకరించారు.
చిన్ననాటి నుండి కన్న కలలు చెదిరిపోయాయి, భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపించింది. అన్నలు మోసం చేసినా శిరము వంచి ఆ వర్తకులకు బానిసైపోయాడు. గమ్యం తెలియని తన ఒంటరి ప్రయాణం మొదలైంది, తన జీవనయానంలో తన దేవునికి నమ్మకస్తుడుగా ఉండడానికి నిశ్చయించుకున్నాడు. పరిస్థితులు తనకు అనుకూలించవు, స్వంత నిర్ణయాలు ఇంకెన్నడూ తీసుకోలేని దుస్తితి. ఎటువంటి పతికూల పరిస్థితి ఎదురైనా నా దేవునిపైనే ఆధారపడతాను అని నిశ్చయించుకున్నాడు యోసేపు. చివరకు ఐగుప్తుకు చేరుకున్న తన ప్రయాణం పోతీఫరు ఇంటిలో బానిసగా బ్రదుకుతున్నా... తన యజమానుని భార్యచే అబద్ధముగా నిందింపబడి, తాను చేయని నేరానికి జైలులో వేయబడినా, అన్యాయము తనను ముట్టడి చేస్తున్న పరిస్థితిలో కూడ విశ్వాసం విధేయత వెనుకంజ వేయలేదు. తన నమ్మకత్వానికి ప్రతిఫలం పొందాడు చివరకు ఉన్నతస్తాయికి చేరుకున్నాడు.
కాలచక్రం పరుగెడుతున్న ఒక తరుణంలో తమ దేశాల్లో కరువు కారణంగా యోసేపు అన్నదమ్ములు ధాన్యము కొరకు ఐగుప్తుకు చేరుకున్నారు. వారు అలక్ష్యము చేసిన సోదరుడే ఇప్పుడు ప్రధానమంత్రి అని తెలుసుకొని భయపడ్డారు. కీడుకు ప్రతికీడు చేయాలనే మనం ఆలోచిస్తాము, పగ తీర్చుకోడానికి ఒక చిన్న అవకాశాన్ని కూడ వదిలిపెట్టము, క్షణం ఆలోచించకుండా మనం చేయాలనుకున్నది చేసితీరుతాము. కాని కుట్రలు, అవమానాలు, నిందలపాలైన తన బానిస బ్రదుకులో దైవునిపై యోసేపు నమ్మకత్వం అచంచలమైనది. తన జీవితం తనకు నేర్పిన పాఠాల్లో ఓర్పు, దయ, ఉదార స్వభావం వంటి అనుభవాలను నేర్చుకున్నాడు. తన అన్నల యెడల జాలిపడి కన్నీరు కారుస్తూ యోసేపు పలికిన మాటలనుబట్టి గమనిస్తే ప్రవర్తనలో పరిపక్వత వర్ణనాతీతం. “నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి; అది మీకు సంతాపము పుట్టింప నియ్యకుడి; ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను” (ఆది 45:5). జీవితపు అంధకార ఘడియల్లోకూడా దేవుని ప్రేమకలిగిన హస్తాలు కేవలం విశ్వాసదృష్టితో చూసినప్పుడే కనుగొనగలం. యోసేపు తన విశ్వాస అనుభవంలో నేర్చుకున్నాడు. పరిపక్వత చెందిన తన ప్ర్రవర్తన మనలను ఆలోచింపజేస్తుంది. మన ప్రవర్తన ఎలా ఉంది? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. ఆమెన్.