నూతన జీవితాన్ని ఆస్వాదిద్దాం


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini - Daily Motivation

నూతన జీవితాన్ని ఆస్వాదిద్దాం.

1 పేతురు 1,2 అధ్యయనం.

పొద్దున్నే లేవగానే అందరు సహజంగా చేసే పని,  ఇంటిని శుభ్రపరచుకోవడం. ప్రతి గదిని శుభ్రపరచి, ఎక్కడైతే చిందర వందరగా వస్తువులు పడియున్నాయో వాటిని సరైన రీతిలో సర్దుకొని అనుదినము మన ఇంటిని సిద్దపరచుకుంటాము. నిన్న శుభ్రపరచాము కదా రేపు అవసరం లేదు అనుకునే పని కాదు, ఈ పనిని ప్రతిరోజూ చేయవలసిందే కదా.  

మన ఇంటిని శుభ్రము చేసుకునే ఈ పనిని గూర్చి ఆలోచించినప్పుడు 1 పేతురు 2:1 లో అపో. పేతురు వివరించిన సంగతి ఒక నూతనమైన దృక్పధాన్ని మనకు జ్ఞాపకము చేస్తుంది.” సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానమని” ఈ వాక్యం ద్వారా పేతురు మనలను హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ ఆసక్తికరమైన విశేషమేమిటంటే ఎప్పుడైతే క్రీస్తులో నూతన జీవితాన్ని ప్రకటించుకొనిన తరువాత (1:1-12) మనల్ని పాడుచేసే అలవాట్లను విసర్జించమని పేతురు బ్రతిమలాడుతున్నాడు. దేవునితో మన నడక తడబడినప్పుడు, ఇతరులపట్ల ఐక్యత, ప్రేమ మరియు వారితో సంబంధం దెబ్బతిన్నప్పుడు, ఇవి మన రక్షణను ప్రశ్నించేవిగా ఉండకూడదు. వాస్తవంగా గమనిస్తే రక్షించబడడానికి మన జీవితాలను మార్చుకోము కానీ, రక్షించబడ్డాము కాబట్టి మనము మారతాము. క్రీస్తులో మన జీవితం నూతనమైనదైనప్పటికీ, మనలోని స్వభావసంబంధమైన చెడు అలవాట్లు రాత్రికి రాత్రే మాయమైపోవు.

మన ఇంటిని మనం అనుదినం శుభ్రపరచుకున్నట్టు మన హృదయాన్ని దినదినము శుభ్రపరచుకోవాలి అనగా ఇతరులను ప్రేమించుటలో, ఎదుగుటలో, అడ్డుపడే ప్రతిదానిని శుభ్రపరచుకోడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. శుద్ధమైన మన హృదయం ద్వారా క్రీస్తు శక్తిని పొంది నూతనంగా నిర్మించబడతాము. అంతేకాదు, నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్దపరచబడినట్టు, అమూల్యమైన విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలబడుతుంది.  ఈ అద్భుతాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. నేటినుండి, అనుదినము నాశనము చేసే అలవాట్లను విసర్జించి, యేసులో నూతన జీవితాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిద్దాం. ఆమెన్.


Audio: https://www.youtube.com/watch?v=nwn5x3Ado18