మౌనం


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini - Daily Motivation

మౌనం

Audio: https://youtu.be/HEU8kYhOVaA

ఒక గ్రామం లో ఒక స్వార్ధపరుడును ధనవంతుడునైన మేయర్ ఉండేవాడు. ఎల్లప్పుడు తన క్షేమము మరియు తన సౌకర్యాలకోసం గ్రామంలో ఉన్న పేదవారిని ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ధనవంతుని బంగళాకు వచ్చి పోయే కారులు, లారీల వల్ల ఆ గ్రామంలోని రోడ్డులు పాడైపోయాయి. అంతేకాదు, వాటివల్ల భయంకరమైన దుమ్ము ధూళితో తమ ఇళ్ళు నాశనమైపోయాయని విసుగెత్తిపోయిన ఆ గ్రామ ప్రజలు కోపంతో రగిలిపోయారు. అంతేకాదు, భోగభాగ్యాలతో తనను గూర్చే ఆలోచించుకునే ఆ మేయర్ గారు, గ్రామంలో కనీస వసతులను కూడా పట్టించుకోలేకపోయాడని, అతని అధికార అన్యాయానికి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలంటి అన్యాయం చూస్తుంటే మనకు కూడా కోపం వస్తుంది కదా.

సెప్టెంబర్ 14న హత్రాస్ గ్రామంలో జరిగిన ఒక యదార్ధ సంఘటన మనందరికీ తెలిసిందే. ఆ ప్రాంతంలో జరిగిన అన్యాయం ఆ గ్రామ ప్రజలకు, మనకు,  మన దేశ ప్రజలకు ఆగ్రహం పుట్టించింది. అధికార అన్యాయానికి పాల్పడిన వారిని శిక్షించాలని నినాదాలు చేసినా, ధిక్కార స్వరాన్ని అణగదొక్కే అధికారం ముందు బలహీనుడు నలిగిపోవాల్సిందే.  

పరిశుద్ధ గ్రంథంలోని లిఖితం చేసిన ఒక సంఘటన లో దేవుని ప్రవక్తకు కూడా కోపం పుట్టిచ్చింది. హబక్కూకు, హద్దుమీరిన అన్యాయాన్ని చూసినప్పుడు ఆయన, “యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింప కుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షింపక యున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి.” (హబక్కూకు 1: 2-3) అంటాడు. అయితే దేవుడు ఈ మాటలను  గమనించి ఇలా అన్నాడు – “ తనదికాని దాని నాక్రమించి యభివృద్ధినొందినవానికి శ్రమ; తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొనువానికి శ్రమ; తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరచుకొని, తన యింటివారికొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొనువానికి శ్రమ. “ (హబక్కూకు 2: 6-9). ఈ మాటలను బట్టి గమనిస్తే, అధికార దుర్మార్గాలపై తీర్పు రాబోతుందని గ్రహించాలి.

దేవుడు ఇతరులను తీర్పు తీర్చితే దానిని మనము ఇష్టపడతాము. అయితే మనము ఒక్కసారి ఆగి ఆలోచించే కీలకమైన విషయము ఒకటున్నది హబక్కూకు లో “అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. “ (హబక్కూకు 2:20). లోకమంతా అంటే, అన్యాయాన్ని పొందినవారు, అన్యాయానికి గురిచేసిన వారు. కొన్ని సార్లు దేవుడు మౌనంగా ఉన్నాడు అన్నట్లు ఉన్న పరిస్థితికి తగిన ప్రతిస్పందన మనమే. ఎందుకని మౌనంగా ఉండాలి? ఎందుకంటే మన ఆధ్యాత్మిక పేదరికాన్ని మనము చాల తేలికగా దాటివేస్తాము. పరిశుద్దుడైన దేవుని సన్నిధిలో మన పాపపు స్థితిని గుర్తించేలా చేస్తుంది మౌనం. హబక్కూకు దేవుని మౌనాన్ని నమ్మడం నేర్చుకున్నాడు. మనంకూడా దేవుని మౌనాన్ని నమ్మాలి. మనకు ఆయన మార్గాలన్నీ తెలియవు. అయితే ఆయన మంచివాడని మాత్రం తెలుసు. ఆయన అధీనంలో, ఆయన సమయంలో తీర్పు వెలుగులోనికి తప్పకుండా వస్తుంది.