నీ గురి ఏమిటి...?


  • Author: Rev Anil Andrewz
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini - Daily Inspiration

నీ గురి ఏమిటి...?

Audio: https://youtu.be/I69d2Q6iRGI

3 1/2 సం।।లు సంతోషముగ గడిచిపోయాయి. ఎన్ని సమస్యలు వచ్చిన క్రీస్తు ముందుండి శిష్యులకు ఏమి కాకుండ నడిపించాడు. క్రీస్తు మరణం తరువాత ఏమి చెయ్యాలో తెలియక క్రీస్తు చూపిన మార్గం విడిచి పాత మార్గం వైపునకు బయలుదేరారు.

యోహాను 21:3 సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడ వచ్చెదమనిరి.

శిష్యులు 3 1/2 సం।।లు యేసు ప్రభువు చేస్తున్న అద్భుతములు ప్రత్యక్షంగా చూసారు, శిష్యులు కూడ అనేక కార్యాలు చేసారు, అంతమాత్రమే కాదు రాజ్య సువార్తను ప్రకటించారు కాని, గురి అనేది లేదు.

శిష్యుల వలె చాలా సమయాలలో ఏమి చేస్తున్నామో ఏమి చెయ్యాలో తెలియక ఒకసారి ఇటు ఒకసారి అటు, తొందరపడ్డామేమోనని అయోమయంతో దిగులుపడుతుంటాము. మనం మన భవిష్యత్తును చూడలేము, మన భవిష్యత్తును దేవుడు కూడ చూడవలసిన అవసరం లేదు ఎందుకంటే మన భవిష్యత్తును వ్రాసింది దేవుడే.

యెషయా 46: 10 ...ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను. దేవుడు సమయమునకు కట్టుబడి ఉండవలసిన అవసరంలేదు ఆయన అన్నిటికి పైనున్నాడు. దేవుడు ఏదైన మొదలుపెట్టక మునుపే ముగింపు ఎరిగిన దేవుడు,అనగ నీ భవిష్యత్తు గురించి చింతించవలసిన పని లేదు అది దేవుని చేతిలో ఉన్నది.

దేవుని నమ్ముకొనిన నీవు అన్ని ఉన్నప్పుడు ఆనందపడి, లేనప్పుడు దిగులుపడడం కాదు, నీపట్ల దేవుని చిత్తమేమిటో, నీ జీవిత గమ్యమేమిటో తెలుసుకొనగలిగితే నీవే స్థితిలో ఉన్నా, అది మంచైన చెడైనా, కష్టమైన నష్టమైన వెనకడుగు వేయవు, అయోమయ పరిస్థితికి వెళ్ళవు.

దేవుడు చేసిన సృష్ఠికి క్రమముంది. దేవుడు చేసిన ప్రతి పనికి ఒక ఉద్దేశం ఉంది. క్రీస్తు రక్తములో కడుగబడిన నీపై మరి గొప్ప ఉద్దేశం ఉండదా? కాబట్టి దేవుడు నిన్ను పిలిచిన పిలుపును సంపూర్ణముగా ప్రార్థనలో కనిపెట్టి తెలుసుకొని గురి యొద్దకు పరుగెత్తు.