నీ పొరుగువాడు ఎవడు?


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini - Daily Motivation

నీ పొరుగువాడు ఎవడు?
Audio: https://youtu.be/Cr3Oy1wYhuk

మంచి సమయరయుడు అనే ఉపమానం మనందరికీ తెలుసు. ఈ ఉపమానం చెప్పిన తరువాత యేసు క్రీస్తు ప్రభువు తన శిష్యులతో ఒక ప్రశ్న వేశారు. నీ పొరుగువాడు ఎవడు? ఇదే ప్రశ్న ఈ రోజు మనల్ని మనం ఒకసారి వేసుకుందాం "నా పొరుగువాడు ఎవడు?".

భక్తుడైన సోలోమోను అంటాడు "నీ పొరుగువాడు నీయొద్ద నిర్భయముగా నివసించునపుడు వానికి అపకారము కల్పింపవద్దు (సామె 3:29) మరియు దూరములోనున్న సహోదరునికంటె దగ్గరనున్న పొరుగువాడు వాసి (సామె 25:8). అంతే కాదు మంచి సమరయుడు ఉపమానంలో యేసు క్రీస్తు చెప్పిన రీతిగా, ఎవరైనా ఇబ్బందుల్లో శ్రమల్లో లేదా కష్టంలో ఉంటే వారికి సహాయం చేయాలనే. ఎవరైనా - అంటే వారు తెలిసిన వారైనా లేదా తెలియని వారైనా. వీరే పొరుగువారు.

నేటి దినములలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో చాల కష్టం కదా. ఎవరైనా తెలియని వ్యక్తి ఇబ్బందిలో ఉన్నారని సహాయం చేస్తే, అనేక సార్లు మనం మోసపోవడమే కాకుండా వాటి పరిణామాలు ఊహించలేము. వర్షంలో రోడ్డుపైన ఎవరికైనా లిఫ్ట్ ఇద్దాం అనుకుంటే; అసలు నిజంగా వారు సాహాయం కోసం వేచి ఉన్నారో లేదో మనకు తెలియదు. ఈ మాటలు చదివే ప్రతి ఒక్కరు, ఎవరికైనా తెలియని వ్యక్తికి సహాయం చేసి మోసపోయే ఉంటారు. మీలో నేను కూడా ఒకడినే. నిజ జీవితంలో ఇది వాస్తవం.

యేసు క్రీస్తు బోధన విధానంలో పొరుగువానికి మనం చేయగలిగినంత సహాయం చేయమనే బోధించాడు. ఎవరికైనా పై వస్త్రము లేకపోతె "నీ అంగీని తీసి" ఇచ్చేయమన్నాడు. ప్రియమైన వారలారా, పది మందికి సహాయం చేస్తే కనీసం తొమ్మిదిమందైనా మన వలన ఉపయోగపడితే చాలు అనే ఆలోచన మనకుంటే ఎవరికైనా సహాయం చేయడానికి వెనకాడము. యేసు క్రీస్తును కూడా నమ్మినవారే మోసంచేసినా... చివరకు సిలువేసినా వారిని క్షమిస్తూనే ఉన్నాడు.

పొరుగువారికి సాహయం చేస్తే మనల్ని మోసం చేస్తారేమో, కాని పరలోకపు తండ్రి మన స్వభావాన్ని,మంచితనాన్ని గమనిస్తూనే ఉంటాడు తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా దయజేస్తాడు. నేనంటాను, డబ్బులిస్తేనే సహాయం కాదు... కనీసం నెలలో ఒక పూటైన లేని వారికి అన్నం పెట్టగలిగితే అంతకంటే మించిన సహాయం ఏముంది? దాని వల్ల పుణ్యం వస్తుందో లేదో తెలియదు గాని సంతృప్తి, సంతోషం ఖచ్చితంగా దొరుకుతుంది. మనమే బాగుండాలనే భక్తిలో ఎన్నో వేల రూపాయలు గుడిలో వేసే వారికి మతంతో పని లేదు. లేని వారికి సహాయం చేయడానికి పెద్ద మనసు కావాలి, ధైర్యం కావాలి. ఆ ధైర్యం నువ్వు నేను కావాలనే యేసు క్రీస్తు వేసిన ఈ ప్రశ్నకు సమాధానం. ఆమెన్.