నాకు ఆధారమైనవాడు బలవంతుడు
Audio: https://youtu.be/FoiPHEm7TNE
యెషయా 40:29 సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.
ఎంత సంపాదించిన, ఎందరు ఉన్నా బలం లేకపోతే ఆనందించలేము. ప్రస్తుత దినములలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు మానసికముగ బలహీనం చేసేస్తున్నాయి. మనవారి నుండి ఫోన్ వస్తుందంటేనే భయం, ఎలాంటి వార్త వస్తుందోనని ఆందోళన. ఎన్ని సౌకర్యాలు కలిగివున్నా ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవాలంటే దేవుని బలం చాలా అవసరం. కాని, మనకు ఆధారమైన దేవుడు బలమిచ్చువాడు.
ఈ రోజు దేవుడు ఎప్పుడు బలమిస్తాడు? ఎటువంటి పరిస్థితులలో బలమిస్తాడో చూద్దాము.
1. సొమ్మసిల్లినప్పుడు (అలసిపోవడం)
(కీర్త 107:4-7) ఇశ్రాయేలీయులు చెర నుండి విడిపించబడినప్పుడు నివాస పురమేదియు వారికి దొరుకక అరణ్యములో యెడారిత్రోవను తిరుగులాడారు. ఆకలి దప్పులచేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లినప్పుడు, ఆ కష్ట సమయములో యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించాడు.
అంతేకాదు వారొక నివాస పురము చేరునట్లు చక్కనిత్రోవను ఆయన వారిని నడిపించాడు. వారి ప్రార్థనకు జవాబుగా దేవుడు సహాయముచేసాడు. ఇక్కడ శరీరరీతిగా అలసిపోయారు. అనగా ఆపదల వలన అలసిపోవడం. ఎలాంటి ఆపదలంటే ఆహారం లేకపోవడం, ఆర్ధిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కష్టానికి ప్రతిఫలం లేకపోవడం ఇలాంటి సమస్యలలో సొమ్మసిల్లిపోతాము. కాని, సొమ్మసిల్లినప్పుడు బలమిచ్చుటకు మన దేవుడు సిద్ధముగా ఉన్నాడు. నీవు సమస్యలలో అలసిపోయునప్పుడు నిరుత్సాహపడక దేవునికి మొఱ్ఱపెట్టు, నూతన బలముతో నింపబడతావు.
కీర్త 29:11 ప్రకారం దేవుడు బలము ననుగ్రహించుట మాత్రమే కాదు బలముతో పాటుగా సమాధానము కలుగజేసి నిన్ను నాశీర్వదిస్తాడు.
2. శక్తిలేనప్పుడు (నీరసించిపోవడం)
(1 సామూ 1:6-10) హన్నాకు పిల్లలు లేకపోవుట వలన ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికిస్తు, ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను.
హన్నా బహుదుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిని ప్రార్థనచేయుచు బహుగా ఏడ్చినప్పుడు దేవుడు తన గర్భము తెరిచాడు.
ఇక్కడ మానసికమైన సమస్య చూస్తున్నాము. మానసిక సమస్యలు మనలోని శక్తిని హరింపజేస్తాయి, నీరసించిపోతాము. మన తోటివారు కూడ పెనిన్నావలే మన దగ్గర లేని దానిని బట్టి తక్కువ చేసి మాట్లాడుతుంటారు. పెనిన్నా పిల్లల పేరులు బైబిల్ లో లేవు కాని, హన్నా కుమారుడైన సమూయేలు శక్తివంతమైన దేవుని సేవకుడైనాడు. దేవుని వైపు చూస్తే ఇలాంటి కార్యాలు చూస్తాము. అందుకే మన దేవుడు శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగజేయువాడు.
ఈ రోజు నీవు సమస్యలలో సొమ్మసిల్లివున్నా, అలసిపోయినా; మానసికముగ శక్తిహీనుడవైనా, నీరసించిపోయున నీకు ఆధారమైనవాడు బలమిస్తాడు, నీలో బలమును అభివృద్ధి చేస్తాడు. నిరుత్సాహపడక ఆయనవైపు చూడు.