గంతులు వేసే జీవితము నీ ముందుంది


  • Author: Rev Anil Andrewz
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini - Daily Inspiration

గంతులు వేసే జీవితము నీ ముందుంది...!

Audio: https://youtu.be/ZMlxtyZ9RCs

కుంటితనముతో పుట్టిన ఒకనిని కొందరు ప్రతిదినము మోసుకొని దేవాలయము బయట భిక్షమడుగుటకు కూర్చుండబెట్టేవారు.

ఈ భిక్షగాడు పుట్టిననది మొదలు కొందరి మీద ఆధారపడి బ్రతకడమే. తను సొంతంగా ఏమి చేయలేని పరిస్థితి. అడుకున్నప్పుడు వచ్చే డబ్బుతోనే దినము గడిచేది. ప్రతిదినము ఎవరైన ఏమైన ఇస్తారేమోనని ఎదురు చూడడమే. తన జీవితమంతా ఎదుటివాని చేతులను ఆశతో చూడడమే తప్ప మరొక పని లేదు.

ఒక రోజు దేవాలయము దగ్గర పేతురు యోహానులు కనిపించారు. అలవాటు ప్రకారంగా ఈ భిక్షగాడు ఏమైన దొరకుతాయెమోనని వారి చేతులవైపు ఆశతో చూస్తున్నాడు. కాని, పేతురు వెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి, వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొంది దిగ్గున లేచి నిలిచి నడిచాడు. అంతమాత్రమేకాదు నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు పేతురు యోహానులతో కూడ దేవాలయములోనికి వెళ్ళాడు (అపో.కా. 3:6-8).

అక్కడ పరిస్థితి గమనిస్తే భిక్షకునికి కావలసింది డబ్బులు కాని, పేతురు యోహాను దగ్గర ఉన్నది దేవుని వరం. డబ్బులు ఇస్తే ఆపూటకు మాత్రమే తినేవాడు. భిక్షకుడు ఆ పూట బ్రతుకుటకు ఆలోచించాడు కాని, దేవుడు ఆ భిక్షకుని జీవితమంతటి గురించి ఆలోచించాడు.

దేవుని కార్యం భిక్షగాడిని గంతులు వేసేలా చేసింది. సంఘములో చేర్చింది. క్రీస్తుని వెంబడించేల చేసింది. నిత్యరాజ్య వారసుని చేసింది. మరల భిక్షమడిగే పరిస్థితి తన జీవితములో రానివ్వకుండా చేసింది.

ప్రియ స్నేహితుడా! ఈ భిక్షవానివలే నీకున్న అవసారాలలో, క్లిష్టమైన పరిస్థితులలో మనుష్యుల చేతులవైపు చూస్తున్నావా? మనుష్యుల మీద ఆధారపడితే ఒక్కరోజు మాత్రమే బ్రతుకగలవు. మనము ఈ ఒక్కరోజు గడిస్తే చాలు, ఈ ఒక్క సమస్య నుండి బయటపడితే చాలనుకుంటాము. కాని, దేవుడు మన జీవితమంతటికి కావలసిన వాటి గురించి ఆలోచిస్తాడు. నీవు ఒక్కరోజు కాదు జీవితమంత గంతులువేయాలని దేవుడు ఆయన కార్యములు సిద్ధపరుస్తున్నాడు.

(కీర్తన 123:2) దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచునట్లు; నీవు దాసునివలే అందరి దగ్గర అడుక్కోకు, కుమారుని వలే ధైర్యముగ దేవుని దగ్గర నుండి, నీ కొరకు నీకు కావలసినవి దేవుడు సిద్ధపరచినవి తీసుకో.

తప్పిపోయిన కుమారుని మనస్సు ఎలా ఉందంటే? నీ పనివారిలో ఒకనివలే పనిచేస్తానని అడిగాడు. కాని, తండ్రి మనస్సు నీవు దాసునివి కాదు, నీవు పడిపోయిన నా కుమారునివే నిలబడిన నీ కుమారునివే. ఈ రోజు నీవు ఒకవేళ పడిపోయింటే దేవుడు విడిచిపెట్టాడేమోనని అనుకొవద్దు. నీవు పడిపోయిన దేవుని కుమారునివే నిలబడిన దేవుని కుమారునివే. కాని ఆ తప్పిపోయిన కుమారునివలే పశ్చాత్తాపపడి ఆయన దగ్గరకు వస్తే అడుక్కొనే పరిస్థితిని దేవుడు నీ జీవితములో ఎన్నడు కలుగనీయడు.

కాబట్టి ఈరోజు ఆ కుంటివాడు దేవాలయము బయట ఏ విధముగానైతే తెరిచూచి పేతురు యోహానులు చెప్పిన మాటను నమ్మాడో అదే విధముగా నీవు దేవుని నామములో ఏమైనా చేయగలవని, దేవుడు నీ జీవితములో ఏమైనా చేయగలడని నమ్మితే గంతులు వేసే జీవితమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.