నాకు కోపం వచ్చింది


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini - Daily Motivation

నాకు కోపం వచ్చింది.

80 ఏళ్ల వృద్ధాప్యంలో ఉన్న తండ్రితో కలిసి కబుర్లు చెప్పడం ప్రారంభించాడు .దాదాపు 40 ఏళ్ల వయస్సులో ఉన్న తన కుమారుడు. ఇంతలో ఆ పక్కనే ఉన్న కిటికీలో ఒక పక్షి వాలింది. తండ్రి తన కుమారుని అడిగాడు "ఏంటది?"; అది పావురం నాన్న అన్నాడు. మరలా రెండవ సారి అడిగాడు ఆ తండ్రి; అది పావురం నాన్న అని చురుకుగా సమాధానం చెప్పాడు కుమారుడు. మరో ప్రశ్న లేకుండా అదే ప్రశ్నను మరలా అడిగాడు ఆ తండ్రి "ఏంటి అక్కడ వాలింది అని?", ఈ సారి కుమారునిలో కాస్త చిరాకు తో సమాధానం వచ్చింది అది పావురం అని చెప్పాను కదా. ఆ తండ్రి నాలుగవ సారి మరలా అడిగాడు "ఏంటి అక్కడ వాలింది అని?", ఆ కుమారునికి ఈసారి కోపం వచ్చింది. నేను మూడు సార్లు చెప్పాను అది పావురం అని, నీకు ఆ మాత్రం తెలియదా? లేదా నేను చెప్తే కనీసం గుర్తుపెట్టుకోలేవా ... ఎందుకు అడిగిందే మరలా అడుగుతావు? చీదరించుకుంటూ అన్నాడు కుమారుడు.

ఆ తండ్రి గదిలోనికి వెళ్లి తన అనుభవాలను వ్రాసుకునే ఒక డైరీని తీసుకొని ఆ కుమారుని చేతికిచ్చాడు. ఆ పుస్తకంలోని మొదటి పేజీని తెరిచి కుమారున్ని చదవమన్నాడు. 3 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అదే కిటికీలో ఒక పక్షి వాలింది "ఏంటది?" అంటూ తన కుమారుడు 23 సార్లు ప్రశ్న అడిగాడు. అడిగిన ప్రతి సారి ఓపికతో నవ్వుతూ 23 సార్లు సమాధానం చెప్పాడు ఆ తండ్రి. తన కుమారుడు తనతో మాట్లాడే మాటలలో ఆనందిస్తూ అడిగిన ప్రతీ సారి, తండ్రి ఎంతో సంతోషించి ఆ సంగతిని ఒక అనుభవంగా వ్రాసుకున్నాడు.

వాస్తవమే కాదా, వృద్ధాప్యంలో ఉన్న వారికి ఏదైనా సంగతి పదే పదే చెప్పాలంటే యవ్వన వయస్సులో ఉన్నవారికి మరియు అంతకంటే చిన్న వయస్సులో ఉన్నవారికి కోపం చిరాకు. అసలు పెద్దవారిని గౌరవించడం వారిని ఆదరించడం అంటే - వారితో ఓపికగా మరియు సమాధానంగా ఉండడమే. నేనంటాను, వృద్ధాప్యంలో ఉన్న తలిదండ్రుల ఆయుశ్శును దేవుడు ఇంకా పొడిగిస్తున్నాడంటే అది మనకే ఆశీర్వాదం. ముసలోళ్లు దేనికి పనికి రారు వారితో చాలా కష్టం అంటూ వారితో దుడుసుగా ప్రవర్తించి, అస్సలు పట్టించుకోకుండా వృద్ధాశ్రమంలో పెట్టే బిడ్డలు మన మధ్యే ఉన్నారంటే విలువలు లేని, దయనీయకరమైన సమాజంలో ఉన్నామనే కదా.

ఎందుకంటే, వృద్ధాప్యంలో ఉన్నవారిని ప్రేమించడం ప్రత్యేకంగా వృద్ధాప్యంలో ఉన్న తలిదండ్రులను ప్రేమించడం గౌరవించడం గూర్చిన సంగతులను బైబిల్ అనాది కాలంలోనే స్పష్టం చేసింది. "నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము." (నిర్గమ 20:12) అనే మాటను దేవుడు పది ఆజ్ఞలలో జతచేయడం ఆశ్చర్యమే కదా. ఓపిక, గౌరవం, మర్యాద, నెమ్మది, ప్రేమ ఇది క్రైస్తవ లక్షణం. ఇటువంటి గుణగణాలు కలిగియున్న క్రీస్తు తన తలిదండ్రులను అంతం వరకు గౌరవించి మనకు ఆదర్శంగా నిలిచాడు. దేవుని బిడ్డలమైన మనం ఇటువంటి గుణగణాలు కలిగి, ఆదర్శంగా జీవించడానికి ప్రయత్నిద్దామా? అవును అంటే నాతో ఆమెన్ చెప్పండి.

https://www.youtube.com/watch?v=HrnUvf79Edg