దేవుని సంతోషపరచే క్రియలు నీలో ఉన్నాయా?


  • Author: Rev Anil Andrewz
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini - Daily Inspiration

దేవుని సంతోషపరచే క్రియలు నీలో ఉన్నాయా?
Audio: https://youtu.be/icsxWUZb-tY

సామెతలు 20:11 బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టలవలన తెలియజేయును.

ఇక్కడ చేష్టల గురించి వ్రాయబడినది. చేష్టలనగా క్రియలు. ఈ భాగంలో రెండు రకముల క్రియలు కనిపిస్తున్నాయి. ఒకటి శుద్ధమైన క్రియలు రెండు యథార్థమైన క్రియలు. ఆశ్చర్యపరచే విషమేమనగా క్రియలకు జీతమున్నది (ప్రకటన 22:7). మన క్రియలను బట్టే పరలోకములో తీర్పుతీర్చబడుతుంది. (మత్తయి 25:31-46) నీవు ఎంత సమయం ప్రార్ధన చేసావు, ఎంత అద్భుతముగ వాక్యము చెప్పావు, క్రమముగా సహవాసంలో పాలుపొందావా అని ఒక ప్రశ్నకూడ ఈ భాగంలో కనిపించదు క్రియల గురించే ప్రస్తావించబడినది. (మత్తయి 7:22) ప్రవచించేవారు, దయ్యములను వెళ్ళగొట్టేవారు, అనేకమైన అద్భుతములు చేసేవారికి కూడ పరలోక ప్రవేశం కలుగలేదు, శుద్ధమైన యథార్థమైన క్రియలు కలిగిన వారికే పరలోక ప్రవేశం కలిగింది.

ఇప్పుడు ప్రశ్న ఎమిటంటే క్రియలు పరలోకం తీసుకెల్లగలుగుతే; ప్రార్ధన, వాక్యం, సహవాసం అవసరం లేదా? ఇక్కడే జాగ్రత్తగా అర్ధంచేసుకోవాలి. మనం చేసే ప్రార్ధన, మనం చదివే వాక్యం, మన సహవాసం మన క్రియలను శుద్ధి చేయాలి, మనలను యథార్థవంతులనుగా చేయాలి అనగా రూపాంతరపరచాలి. దేవునికిష్టమైన క్రియలు లేకుండ అద్భుతముగ వాక్యం చెప్పకలిగి, పెద్ద సంఘం కలిగియుండి, చక్కగా పాటలు పాడగలిగితే ఏమి లాభం. అందుకనే దేవుని సంతోషపరచే క్రియలు నీలో ఉన్నాయా?

రెండు రకముల క్రియలు మనలో ఉండాలి. ఒకటి శుద్ధమైన క్రియలు రెండు యథార్థమైన క్రియలు. శుద్ధమైన క్రియలు అనగా (1 యోహాను 3:9-12) సహోదరులను ప్రేమించడం. కయీను తనకంటే మంచి క్రియలు తన సహోదరుడు కలిగియున్నందుకు ఈర్ష కలిగి సహోదరునినే చంపేసాడు. ఈ రోజులలో తోటివారు ఎదుగుతుంటే, మంచి పేరు కలిగియుంటే, ఆత్మీయ జీవితములో ఎదుగుతుంటే ఓర్వలేని కయీను స్వభావము కలిగినవారిని ఎందరినో చూడగలము.

యథార్థమైన క్రియలు అనగా (కీర్తన 15:1-5) మాట తప్పని జీవితం. యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు నష్టము కలిగినను మాట తప్పడు. ఆరోజులలో మాట మీద నిలబడే విశ్వాసులు ఎంతమందిని చూడగలము?

ఇలాంటి శుద్ధమైన, యథార్థమైన దేవుని సంతోషపరచే క్రియలు కలిగిన ఆత్మీయ జీవితము నీవు కలిగియున్నావా? లేదా దేవుని సంతోషపరచే క్రియలు లేకుండ ప్రార్థన బాగా చేస్తాను, వాక్యము బాగా తెలుసని భ్రమపడుతున్నావా? భ్రమలో బ్రతకొద్దు వాస్తవములో బ్రతకాలి.

SajeevaVahini.com