నమ్మకంగా జీవించాలంటే
తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను (యోహాను 16:32)
ఈ రోజుల్లో నమ్మకంగా జీవించాలంటే చాల కష్టం. దానికోసం ఎన్నో త్యాగాలు చేయాలి. సరే నేను నమ్మకంగా జీవిస్తాననే తీర్మానం తీసుకున్నప్పుడు కొన్ని సార్లు అది మనల్ని ఒంటరితనంలోనికి నెట్టేస్తుంది. ఎదో పోగొట్టుకున్న భావాలతో మన అంతరంగంలో అలజడి. ఏది ఎలా ఉన్నా నమ్మకంగా జీవించడం కష్టమైనప్పటికీ అది మనల్ని ఒంటరిని చేసినా, ఆ ఒంటరితనం మనకు ఓర్పు సహనం మరియు విధేయతతో పాటు జీవిత అనుభవాలను నేర్పిస్తుంది. ఈ అనుభవాలే దేవుని ఉద్దేశాలను నెరవేర్చే విజయ మార్గాలు.
నూనె లేకుండా దీపం వెలగదు, నమ్మకం లేకుండా ఏ బంధం కూడా నిలబడదు. గొడుగు వర్షాన్ని ఆపగలదా? కేవలం తడువకుండా సహాయ పడగలదు. నమ్మకంగా జీవిస్తే ఆత్మ విశ్వాసం బలపడుతుంది. ఆత్మవిశ్వాసం గెలుపును తీసుకొని రాదు..., కానీ మనలో ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది.
కొన్ని సార్లు మాట్లాడి ప్రయోజనంలేదనుకున్నప్పుడు మౌనంగా ఉండాల్సిందే, మన చుట్టూ ఉన్నవారు మన మాటలకు విలువ ఇవ్వనప్పుడు వారికి దూరంగా ఉండడం కొన్నిసార్లు మంచిదే. అయితే మన వ్యక్తిత్వంలో ఎన్నడు దిగజారిపోకుండా మన విలువలను కాపాడుకుంటూ నమ్మకంగా జీవిస్తున్నప్పటికీ, మనల్ని అగౌరవపరిచే సందర్భాలు మనల్ని భయంకరమైన ఒంటరితనంలోనికి నేట్టేస్తుంది. మనల్ని ఆదరించే వారు కరువైపోతారు. మన జీవితంలో ఎవరి ఆదరణ లేదని ఒంటరినని నిరాశతో బాధపడకుండా, నన్ను ప్రేమించే క్రీస్తు నాతో ఉన్నాడని విశ్వసిస్తే ఎంతో సంతోషాన్ని పొందవచ్చు.
అనుదినం మనల్ని ప్రేమిస్తూ అనుక్షణం మనతో ఉంటూ మనల్ని బలపరుస్తున్న మన పరలోకపు తండ్రికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తే మన జీవితం ధన్యమవుతుంది.
https://www.youtube.com/watch?v=DEfetkyOWjQ