విధేయతలో మాదిరి
మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినమువరకు దానిని కొనసాగించును. ఫిలిప్పీయులకు 1:4
మనము చూడగలిగినా లేకున్నా దేవుడు మనందరి యెడల తన కార్యములు జరిగించును. ఈ మాటను మీరు నమ్ముతున్నారా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మాట వాస్తవం. దేవుడు నాకేమి చేయలేదు, దేవుని వల్ల నాకేమి లాభం లేదు, అసలు దేవుడే ఉంటె నెందుకు ఇలా జరిగేది అని ఆలోచించే వారిలో మనం కూడా ఉన్నాం. ఏదైనా మ్యాజిక్ జరిగిపోయి అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం అయితే బాగుండు అనే ఆలోచన ఎవరికీ ఉండదు చెప్పండి. అలా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి; ఎప్పుడైతే ఆయనకు మనం విధేయత చూపిస్తామో అప్పుడే అవన్నీ సాధ్యం.
తట్టుకోలేని బాధ కలిగినప్పుడు, మెలిపెట్టే శ్రమకలిగినప్పుడు ఇలా ఎందుకు జరిగింది? నాకే ఎందుకు జరిగింది? అనే ప్రశ్నలు వేసుకోవడం కంటే, ఆ సామస్య నుండి దేవుడు ఎలా తప్పిస్తాడో ఓపికతో వేచి చూస్తె ఆ అనుభవం లో ఉన్న సంతృప్తి మరోలా ఉంటుంది. అలాంటప్పుడే మన ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు బలపడుతాయి; ప్రత్యేకంగా దేవునిపై మన విశ్వాసం రెట్టింపవుతుంది, మన వ్యక్తిత్వం రూపాంతరం చెందుతుందని నేనంటాను.
ఆయన మన వ్యక్తిత్వాన్ని తన కుమారుడైన క్రీస్తు వ్యక్తిత్వం వలె మార్చుడానికి అనుదినం పనిచేయుచున్నాడు. ఆయన తన పని పూర్తయ్యే వరకూ శ్రమిస్తాడు, ఆ విషయములో ఎటువంటి సందేహము లేదు.
ఆరంభించినవాడు, ఆనందంలో నడిపిస్తూ, అంతము వరకు నడిపించేవాడు ఆయనే గనుక ఆయనకు సహకరించుటయే మన యొక్క విధి.
మనం చేయవలసిన అతి సుళువైన పని ఏమిటంటే, విధేయతతో క్రీస్తును అనుసరించి ఆ వెలుగును మన జీవితాల్లో కలిగియుండుటయే.
అందుకే, కీర్తనాకారుడంటాడు.."నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను" కీర్తనలు 119:71
దేవుని కృప మీతో మనందరితో ఉండును గాక. ఆమేన్.
https://youtu.be/iIz2rzi3p5w