ఊహలన్ని నిజం కావు
Audio:https://youtu.be/pK9gG1A57z0
యోహాను 13:37 అందుకు పేతురు ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీకొరకు నా ప్రాణముపెట్టుదునని ఆయనతో చెప్పెను.
ఊహించుకొనుటలో మనిషి ఆనందపడతాడు. ఊహ అనేది ఎప్పుడు మనిషి సామర్థ్యం మించి ఉంటుంది. ఊహలలో బ్రతకడం ప్రమాదకరం, అది సోమరులనుగాను, నమ్మకద్రోహులనుగా చేస్తుంది. మనం చేయలేనివి ఊహలలో ఊహించుకుంటు బ్రతకడానికి ఇష్టపడతాము.
ఊహలు ఎందుకు ప్రమాదకరమంటే, అవి మనలను ఈ లోకంలో అందరికంటే గొప్పవారమని, బలవంతులమని, జ్ఞనవంతులమని ప్రవర్తించేలాచేస్తుంది. మనలో ఉన్న అసలైన సామర్ధ్యమును చంపేస్తుంది. నోవాహు సమయంలో జలప్రళయం చేత భూమి తుడిచివేయబడుటకు కారణం మనిషిలోని ఊహలే. ఆది 6:5,6 - నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృద యములో నొచ్చుకొనెను.
సాతాను ఈ ఊహలతోనే దేవుని చిత్తమును అపార్ధము చేసుకొనేలా చేసి, పాపమునకు ప్రేరేపిస్తాడు. (మత్తయి 16:13-23) ఒకనాడు యేసు ప్రభువు - మనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడిగినప్పుడు; పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాడు. తరువాత యేసు ప్రభువు - అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని చెప్పినప్పుడు, పేతురు తనకు దేవుని జ్ఞనమున్నదని ఊహించి దేవుని చేత గదించబడినాడు.
యోహాను 13:37లో పేతురు తాను ఏమైనా చేయగలనని అనుకున్నాడు కారణం, ఊహలు తనను మోసం చేసాయి. ఏ దేవుని కొరకు ప్రాణము పెట్టుదునని చెప్పాడో చివరికి ఆయనెవరో నాకు తెలియదని ఒట్టు పెట్టుకున్నాడు.
ప్రియ విశ్వాసి! మనమెప్పుడు ఊహలలో బ్రతుకకూడదు, వాస్తవములో విశ్వాసముతో బ్రతకాలి. నీలో ఉన్న సామర్థ్యం ఊహలలో కాదు మోకాళ్ళ మీద ఉంటేనే తెలుసుకుంటావు. ఎప్పుడైతే ప్రర్థనలో పశ్చాత్తాపం పొందాడో తన తప్పును తెలసుకొని, తనలోనున్న సామర్థ్యం గ్రహించి యేసు నామంలో లోకమును తలక్రిందులు చేసాడు పేతురు. ఇలాంటి పేతురును దేవుడు నీలో చూడాలనుకుంటున్నాడు. నీవు సిద్ధమా...!
SajeevaVahini.com