>నీ ఆలోచనలు జాగ్రత్త...!


  • Author: Rev Anil Andrewz
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini - Daily Inspiration

నీ ఆలోచనలు జాగ్రత్త...!

Audio: https://youtu.be/AWPGdvKPpT4

1 పేతురు 5:8 మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.

ఈ రోజులలో ఎక్కువగా వాడే పదం బిజీ. అంత బిజీ పనులు రోజు ఏముంటాయని గమనించినప్పుడు; నాకు కనిపించిన బిజీ పని ఆలోచించడం. డబ్బు కొరకు ఆలోచన, సమస్యల గురించి ఆలోచన, శరీర సంబంధమైన కోరికల కొరకే ఎక్కువగా ఆలోచన. వ్యక్తిగత, కుటుంబ, ఆత్మీయ జీవితం, ఉద్యోగం ఇలా రోజుకు 24గం।।లను ఉపయోగించుకొనకుండా అనవసరమైన, ఉపయోగంలేని ఆలోచనలకే కొంతమంది ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు.

మరికొంతమంది బిజీ అనే పదం వాడే సందర్భం ప్రార్థన. ప్రార్థన చేసారా, వాక్యం చదివారా, కుటుంబ ప్రార్థన చేసారా అని అడిగితే, ఎక్కవమంది ఇచ్చే సమాధానం బిజీ వల్ల కుదరడం లేదంటారు.

ఇలా ఎందుకు జరుగుతుందని గమనించినప్పుడు నాకు జ్ఞాపకము వచ్చిన వాక్యం ‘ మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు’. సాతాను చంపుటకు రావడంలేదు మ్రింగుటకు వస్తున్నాడు. మనుష్యులను మ్రింగుటకు కాదు, వాడికున్న సమయం తక్కువ కాబట్టి మనకున్న శ్రేష్టమైన సమయాన్ని మ్రింగుటకు వస్తున్నాడు.

దీని వలన వాడికొచ్చే లాభం ఏమిటని ఆలోచిస్తే; సాతాను, సమయం మ్రింగడంవలన విశ్వాసి ఆలస్యమైతున్నాడు. ఏ విషయంలో ఆలస్యమైతున్నాడు? సిద్ధపడుటలో ఆలస్యమైతున్నాడు.

ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివినప్పుడు వియత్నాం యుద్ధంలో శత్రువును జయించుటకు యుద్ధ భూమిలో 5 రకాల ఉచ్చులను కొన్ని వేల సంఖ్యలో అమర్చారు. ఈ ఉచ్చులలో ఎక్కువ శాతం శత్రువును చంపుటకు కాదు, శత్రువును గాయపరచుటకు ఉపయోగించారు. ఎందుకనగా యుద్ధములో సైనికుడు చనిపోతే అక్కడే వదిలేస్తారు కాని, గాయపడితే సైనికుని ఇద్దరు సైనికులు మోసుకెళ్ళాలి. ఇందువలన యుద్ధములో వారు వెనకబడుట వలన సులువుగా గెలవచ్చు.

ఇదే తరహా ప్రయత్నం సాతాను విశ్వాసుల మీద ప్రయోగిస్తున్నాడు. మానసికంగా గాయపరుస్తున్నాడు. ఆర్ధిక ఇబంద్దులలో, కలహాలు, అనారోగ్యాలు, తొందరపాట్లు ఇలాంటి వాటితో నలిగిపోతున్నప్పుడు ఇటు పనిచేయనియకుండా, అటు దేవుని సన్నిధికి రానీయకుండ అనవసరమైన ఆలోచనలతో సమయమును వృధా అయ్యేవిధముగా ప్రేరేపిస్తున్నాడు.

ప్రియ విశ్వాసి జాగ్రత్త! నీకున్న సమయం తక్కువ. శ్రేష్టమైన సమయాన్ని అనవసరమైన ఆలోచనలతో వృధా చేయకు. ఊరికే ఆలోచించుట వలన ఏమి చేయలేవు, ప్రార్థనలో కనిపెట్టుటవలననే ఏదైన సాధించగలవు.