దేవుని సన్నిధి


  • Author: Rev Anil Andrewz
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini - Daily Inspiration

దేవుని సన్నిధి
Audio: https://youtu.be/D5yrkrvc8Eo

నిర్గమ 33:14 నా సన్నిధి నీకు తోడుగా వచ్చును

పట్టణాలలో కరోనా విస్తరిస్తున్న సమయంలో వార్తా ఛానల్లు, మరి కొంతమంది పట్టణాలు సురక్షితం కాదు పల్లెలకు వెళ్ళిపొమని హెచ్చరించారు.

ఇప్పుడు కరోనా పట్టణాలతో పాటు పల్లెలలో కూడ విస్తరిస్తుంది. ఒక ప్రక్కన కరోనా మరో ప్రక్కన వరదలు, వీటితో పాటు వ్యాధులు. ఎవరి నుండి వ్యాధి వస్తుందో తెలియని పరిస్థితి, ఎవరిని నమ్మలేము. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ప్రపంచములో సురక్షితమైన స్థలమే లేదు.

మనం చదివిన ఈ వాక్య భాగంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే మోషే ఒక రహస్యాన్ని తెలియజేసాడు. అదేమనగ, ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకముగ పాపము చేయుట వలన; ఈ ప్రజలు చెడిపోయారు వీరు లోబడని ప్రజలు కాబట్టి నేను మీతో వస్తే ఒకవేళ త్రోవలో మిమ్ములను సంహరించెదనేమోనని దేవుడు మోషేతో చెప్పాడు.

శత్రువులతో యుద్ధము చేయుటకు ముందునడచుటకు దూతవున్నా, ప్రతిరోజు మన్నావున్నా, అరిగిపోని చెప్పులు, పాడవ్వని బట్టలు వున్నా దేవుని సన్నిధి లేకపోతే అడుగు కూడా ముందుకు వేయనని దేవునితో మోషే చెప్పాడు. ఎన్ని ఉన్నా దేవుని సన్నిధి లేకపోతే క్షేమం లేదు. ఈ సృష్ఠిలో సురక్షిత స్థలం దేవుని సన్నిధేనని మోషే వేల సంవత్సరముల క్రితమే తెలుసుకున్నాడు.అందుకనే కీర్తనాకారుడు నీ సన్నిధిని నుండి ఎక్కడికి వెళ్ళగలను అని అంటున్నాడు.

దేవుని సన్నిధిలో నిలవాలంటే ఎమి చేయ్యాలి? దేవుని మార్గములలొ నడుచుచు, అప్పగించిన దానిని జాగ్రత్తగా కాపాడితేనే దేవుని సన్నిధిలో నిలిచే అర్హత పొందుకుంటాము (జకర్యా 3:7). దేవుని మార్గములలొ నడుచుట అనగా వాక్య ప్రకారం జీవించుట, అప్పగించిన దానిని జాగ్రత్తగా కాపాడుట అనగా రక్షణను, పిలుపును కాపాడుకొనుట. ఇవి చేస్తేనే దేవుని సన్నిధిలో నిలిచే అర్హత పొందుకుంటాము.

కీర్తన 16:11... నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదు. మనిషికి అన్ని ఉన్నప్పుడే సంపూర్ణసంతోషము కలుగుతుంది, ఆ అన్ని దేవుని సన్నిధిలోనే ఉన్నవి. సంపూర్ణసంతోషము సంపూర్ణ కాపుదల దేవుని సన్నిధిలోనే ఉన్నవి. కాబట్టి నీ అవసరాలలో మనుష్యుల వైపు చూడక దేవుని సన్నిధికి చేరుము.