బలపరచే కృప
Audio: https://youtu.be/fCiUs9cGg5U
కీర్తన 94:17,18 యెహోవా నాకు సహాయము చేసియుండని యెడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి యుండును, నా కాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.
ఈ భాగంలో కీర్తనాకారుడు ఒక చీకటి అనుభవం గుండా వెళ్ళిన సంధర్భాన్ని జ్ఞపకము చేస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో ఎలాంటి భయంకర పరిస్థితులు ఎదురైతాయో మనం గమనించాలి. ఊహించని విధముగా ఆటంకాలు వస్తుంటాయి. అందుకనే పౌలు తాను నిలబడినాని తలంచేవాడు పడిపోకుండ చూసుకోవాలని తెలియజేసాడు. ఆత్మీయ జీవితంలో కొన్ని పరిస్థితులు మరణమునకు దగ్గరకు తీసుకెల్తాయి. ఆ సమయంలో దేవుని కృపలేకపోతే విడిపించేవాడు కనిపించడు.
ఆత్మీయ జీవితములో కాలుజారడమంటే పడిపోవడమే. విశ్వాసము నుండి తొలగిపోవడం. లోక సంబంధమైన వాటికి లొంగిపోవడం. (కీర్తన 73) ఆసాపుకు కాలు జారుటకు కారణం -భక్తిహీనులు దేవునికి విరుద్ధముగా జీవించినా వారికి క్షేమం ఉంది, ఇబ్బందులు లేవు, తెగులు లేదు. ఈ భక్తిహీనులను చూసి ఆసాపు పరిశుద్దముగా జీవిస్తు బాధ అనుభవిస్తున్నాను అనుకొని మత్సరపడ్డాడు. కాని దేవుని కృపవలన బలపరచబడి ఈ మత్సరమువలన పశుప్రాయుడయ్యాను, మృగమువంటివాడైయ్యానని గ్రహించి దేవుని సన్నిధే ధన్యకరమని ప్రకటించాడు. అనేకసార్లు విశ్వాస జీవితములో సమస్యలు భరించలేక, పాపం చేసేవారు సమృద్ధిగా ఉండడం చూసి మత్సరపడుతుంటాము కాని, సమస్యలు మన మేలు కోసమేమనని ఆ సమయంలో దేవుని కృప మనతోనే ఉందని మరచిపోవద్దు.
(కీర్తన 38:11-15) దావీదునకు కాలు జారుటకు కారణం తను ఆపదలో ఉన్నప్పుడు బంధువులు, స్నేహితులు, ప్రేమించినవారు దూరమైపోయారు. శత్రువులు హానికరమైన మాటలు పలపకుచు కపటోపాములు పన్నారు. ఇటువంటి పరిస్థితిలో దేవుని ఆశ్రయించి బలపరచబడ్డాడు. ఇలాంటి పరిస్థితులు నీకెదురైనప్పుడు నిరుత్సహపడకుండ దేవుడు సహాయము చేయుటకు సిద్ధముగా ఉన్నాడని, దేవుని బలపరచే కృప మనకున్నదని మరచిపోవద్దు. ఎందుకంటే క్రీస్తునందున్నవాడు నూతన సృష్ఠి.
- మనము లోకమునకు ఉప్పయి యున్నాము. మనము లోకమునకు వెలుగైయున్నాము. (మత్తయి 5:13,14)
- మనము దేవుని ఆలయమై యున్నాము. (1 కొరింథీ 3:16)
- అత్యధిక విజయము పొందుచున్నాము. (రోమా 8:37)
- ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను. (ప్రకటన 1:6)
ఇటువంటి ఉన్నతమైన స్థితి దేవుడు మనకిచ్చాడు కాబట్టి మనం ఎలాంటి పరిస్థితిలోవున్నా దేవుని బలపరచే కృప మన కోసమేనని, మనకు తోడుగా ఉందని మరచిపోవద్దు.