గొప్ప ఆదరణ


  • Author: Rev Anil Andrewz
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini - Daily Inspiration

గొప్ప ఆదరణ

Audio: https://youtu.be/O0R-7zhBtOY

కీర్తన 94:19 నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది.

మనిషి ఎదైన దాచిపెట్టగలడు కాని తనలోని విచారము దాచిపెట్టలేడు. విచారము అనగా ఆందోళన కలిగించే ఆలోచనలు. హృదయము దుఖఃముతో నిండియుండినప్పుడు ముఖములో విచారణ ఉంటుంది. ఒక ఆలోచన వలన కాదు అనేకమైన ఆందోళన కలిగించే ఆలోచనలు హృదయంలో ఉన్నప్పుడు దుఖఃముతో నింపబడతాము. ఉదాహరణకు - మన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో సీరియస్ గా ఉన్నారని కబురువస్తే మనలో ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే; బ్రతికున్నాడా చనిపోయాడా? దెబ్బలేమైన తగిలాయా? మాట్లాడుతున్నాడా ? ఇప్పుడు చనిపోతే పరిస్థితి ఏమిటి ఇలా అనేకరకాలుగా ఆలోచిస్తాము. అందుకనే ముఖములో విచారణ ఉంటుంది.

కీర్తనాకారునికి కూడా తన అంతరంగమందు విచారములు ఎక్కువైనప్పుడు దేవుని గొప్ప ఆదరణ తన ప్రాణమునకు నెమ్మది కలుగజేసినదని చెప్పుతున్నాడు. ఈ రోజులలో అనేకుల పరిస్థితి ఇలానే ఉన్నది. విచారములులేని ఇల్లు కనుగొనుట కష్టము. హృదయము నలిగిపోయి దుఖఃముతో ఉన్నవారు అనేకులు. అర్ధిక ఇబందులు, అనారోగ్య పరిస్థితులు, కలహాలు, ఎడబాటులు అనేకరకములైన సమస్యలు. ఇలాంటి పరిస్థితులలో దేవుని గొప్ప ఆదరణ చేత మన ప్రాణమునకు నెమ్మది కలుగాలంటే ఏమి చేయ్యాలి?

యెరూషలేముయొక్క ప్రాకారము పడద్రోయబడినదని; దాని గుమ్మములును అగ్నిచేత కాల్చ బడినవని, చెరపట్టబడినవారిలో శేషించినవారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారని నెహెమ్యా వినినప్పుడు ఇలాంటి పరిస్థితే తనలో కలిగింది. ఆ సమయంలో నెహెమ్యా కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసాడు. ప్రార్థనలో జవాబు దొరికినప్పుడే నెమ్మది తనలో కలిగింది. నెమ్మది అనేది దేవుని సన్నిధిలోనే ఉంటుంది అది మరెక్కడ దొరకదు. నెహెమ్యా చేసిన ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబు - యెరూషలేము పట్టణమును తిరిగి కట్టునట్లుగా రాజు ఒప్పుకోవడమే కాదు మందిరమునకు సంబంధించిన కోటగుమ్మములకును మిగిలిన వాటికి కావలసిన దూలములు మ్రానులు కూడ ఇప్పించాడు. దేవుడికి మహిమ కలుగును గాక!

మన దగ్గరవున్న సమస్యకు దేవుని దగ్గర అనేకమైన పరిష్కారాలు ఉంటాయి. ఆ పరిష్కారాలు కావాలంటే దేవుని సన్నిధిలోనికి నెహెమ్యా వలె రావాలి. దేవుడు నీ అంతరంగములోని హెచ్చగా ఉన్న విచారములు తీసి తన గొప్ప ఆదరణతో నీ ప్రాణమునకు నెమ్మది కలుగజేయును గాక!