Share on WhatsappDaily Inspiration

సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును (ఫిలిప్పి 4:7).

సముద్ర ఉపరితలం అంతా తుపానులతో, కెరటాలతో అల్లకల్లోలమైపోతూ ఉంటే దానీ లోపలి పొరలు మాత్రం ఎప్పుడూ చెక్కుచెదరవు. సముద్రపు లోతుల్ని తోడి అక్కడ పేరుకున్న జంతువుల, మొక్కల అవశేషాలు పైకి తెస్తే అవి కొన్ని వేల సంవత్సరాలనుండీ నిశ్చలంగా ఏమీ కదలిక అనేది లేకుండా ఉన్నాయని అర్థమౌతుంది. దేవుని శాంతి ఈ సముద్రపు పొరలాటిదే. ఇహలోకపు ఆందోళనలకు, బాధలకు అందనంత లోతుగా ఈ నీటి పొరలు ఉంటాయి. దేవుని సన్నిధిలోకి ప్రవేశించినవాడు ఈ ప్రశాంతతలో పాలుపొందుతాడు.

సముద్రంపై పెనుగాలులు రేగుతుంటే
కెరటాల భీకరఘోషతో ఎగిరిపడుతుంటే
ఈ అల్లకల్లోలానికి దూరాన అంతర్భాగంలో
నిత్య ప్రశాంతత నిమ్మళంగా నివసిస్తుంది.

సముద్రపు లోతులో తుపాను ఘోష వినబడదు
వెండి చిరుగంటలు మ్రోగుతుంటాయి
తుపాను ఎంత భీకరంగా ఉన్నా సడలించలేదు
లోతుల్లో నెలకొన్న సబ్బాతు ప్రశాంతతను.

నీ ప్రేమను రుచి చూసిన హృదయం
ప్రశాంతత నెలకొన్న పవిత్రాలయం
గోలచేసే బ్రతుకు బాధలన్నీ
ఆ మౌనద్వారం దగ్గర నోరుమూస్తాయి.

దూరదూర తీరాల్లో మౌనగీతాలు
మౌనంలో విరిసిన ఆలోచన కలువలు
పెనుగాలి ఎంత చెలరేగినా
నీలో నివసించే ఆత్మను తాకలేదు.