Share on Whatsapp Daily Devotion - సంబంధం సరిదిద్దుకో

సంబంధం సరిదిద్దుకో

1 యోహాను 2:1 నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు.

ఒక పిల్లవాడు తన తల్లిదండ్రులకు కోపం లేదా బాధ కలిగించేలా ఏదైనా చేయగలడు. అంతమాత్రాన వాడు తమ బిడ్డ కాదని ఏ తలిదండ్రులు అనుకోరు కదా. అయితే ఆ పిల్లవాడు తన తల్లిదండ్రులతో తన సంబంధాన్ని సరిదిద్దుకోవడానికి తన జీవితాన్ని మెరుగుపరుచుకోడానికి ప్రయత్నం చేయాలి. దేవుని పిల్లలకు కూడా ఇదే వర్తిస్తుంది. మీ పట్ల దేవుని ప్రేమ మారలేదు. పొరపాటున పాపం చేయడం ద్వారా దేవునితో మీ సంబంధాన్ని కోల్పోలేదు. దేవునికి దగ్గరగా ఉండటానికి, ఆయనతో సత్ సంబంధాన్ని పునరుద్ధరించుకోడానికి, మీరు మీ పాపాన్ని కప్పుకోక ఒప్పుకోవాలి. మరలా ఆ పాపం జోలికి పోకుండా జాగ్రత్త పడాలి.

మానవుడు దేవుడు వీరు మధ్య సంబంధాన్ని పునరుద్ధరించడానికి ఏకైక మార్గం మనలోని పాపాన్ని పూర్తిగా తొలగించుకోవడమే. డబ్బుతో లేదా త్యాగంతో మరి దేనితోనైనా దేవుని నుండి క్షమాపణను కొనుగోలు చేయలేము. సమస్త సృష్టి దేవునికి చెందినదే; ఆయనకు మన నుండి ఏమీ అవసరం లేదు. అదనపు నీతివంతమైన జీవితాలను గడపడం ద్వారా మన పాపాలను భర్తీ చేయలేము.

నేనంటాను, దేవునితో సరిదిద్దుకోలేని మన అసమర్థత ప్రభువునకు ముందే తెలుసు. అయితే దేవుడు ఎన్నడు కూడా మనం నశించిపోవాలని కోరుకోడు. నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు కాబట్టి తానే స్వయంగా ఒక పరిష్కారాన్నికూడా మనకు అందించాడు. అపరాధ పాపముల భారాన్ని తనపై వేసుకోవడానికి, మన స్థానంలో తాను మరణించడం ద్వారా విమోచన క్రయధనం చెల్లించడానికి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. మన అపరాధములకు యేసు క్రీస్తు ప్రభువు కలువరి సిలువలో ఆ మూల్యం చెల్లించాడు. ఈరోజు మనం చేయవలసింది ఒక్కటే, మన పాపాన్ని ఒప్పుకోవడం. ఆమెన్.

Telugu Audio: https://youtu.be/RGYiivLYq30